
అనంతపురం: గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ కార్యకర్తల గట్టి షాక్ తగిలింది. గడప గడపకీ వస్తున్నారన్న సమాచారంతో బుక్కరాయసముద్రం మండలం చేదుళ్ల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఇళ్లకు తాళం వేసుకున్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బాగుండేవారమని... వైసీపీకి ఓట్లేసినందుకు దిక్కులేని వారిని చేశారాంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకుల వేధింపులతో ఒక్కగానొక్క కొడుకు ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడంటూ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన హనుమంతరెడ్డి, రత్నమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. వైసీపీ నేతల మాటలు విని ట్రాక్టర్ కొంటే.. ఇసుక తోలుతున్నారని కేసు పెట్టించి జైలుకు పంపించారంటూ వాపోయారు. మీరు ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి.. మా నెత్తిన పెట్టి కాల్చండంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని నిలదీశారు. గ్రామానికి చెందిన మరికొందరు వైసీపీ కార్యకర్తలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.