కుప్పంలో వైసీపీ దాబాయింపు

ABN , First Publish Date - 2022-05-17T08:16:57+05:30 IST

కుప్పంలో అధికారపార్టీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిరూపించే సంఘటన సోమవారం జరిగింది.

కుప్పంలో వైసీపీ దాబాయింపు
వైసీపీ కౌన్సిలర్‌, మరొకరు చంపుతామని బెదిరించారని ఏడుస్తూ చెప్పిన దాబా నిర్వాహకులు

రాత్రి 12 తర్వాత భోజనం లేదన్నారని కుర్చీలు విసిరి విధ్వంసం

కుప్పం, మే 16: కుప్పంలో అధికారపార్టీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిరూపించే సంఘటన సోమవారం జరిగింది. తమ దాబాపై ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారంటూ ఉదయం ఏడుస్తూ ఆరోపించిన బాధితులు, మధ్యాహ్నానికల్లా మాట మార్చి... దాడి జరగలేదని  అంతకు ముందు నిందితులుగా పేర్కొన్నవారి సమక్షంలోనే చెప్పారు. 

బాధితులు తొలుత చెప్పిన కథనం మేరకు... కుప్పం బైపాస్‌ రోడ్డులోని ఒక దాబాకు వైసీపీ కౌన్సిలర్‌తోపాటు, మరో కౌన్సిలర్‌ అనుచరుడు ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత వచ్చారు. భోజనం కావాలని అడిగారు. అప్పటికే అన్ని ఆహార పదార్థాలు అయిపోయాయని చెప్పడంతో ఆగ్రహించి దుర్భాషలాడుతూ అక్కడున్న కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. భయభ్రాంతులకు గురిచేశారు. ఇంకో వంద మందితో వచ్చి తగులబెడతామని, అందరినీ చంపేస్తామని హెచ్చరించారు. బాధిత మహిళ ఏడుస్తూ చెప్పిన ఈ కథనం, దాబాలో కుర్చీలు విసిరేస్తున్న సీసీటీవీలోని విధ్వంస దృశ్యాలు సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీనిపై స్పందించారు. కుప్పంలో దాడుల సంస్కృతిని ఖండించారు.  భోజనం అయిపోయిందని చెప్పిన నేరానికి  దాబాపై దాడులకు తెగబడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశాల మేరకు కుప్పం రూరల్‌, మున్సిపల్‌ పార్టీ అధ్యక్షులు ప్రేమ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ తదితరులు బాఽధితులను పరామర్శించారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఖండించారు. బాధితులకు    అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదంతా మధ్యాహ్నం లోపల జరిగింది.


చంద్రబాబు జోక్యంతో టీడీపీ నేతల పరామర్శ 

ఆ తర్వాత మారిన సీన్‌

అసలు దాడే జరగలేదంటూ వైసీపీ కౌన్సిలర్‌,

మరొకరి సమక్షంలో చెప్పిన బాధితులు

అబ్బే.. దాడే జరగలేదు!

టీడీపీ నాయకులు దాబా నుంచి ఇటు తిరగగానే సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తరువాత దాబా నిర్వాహకులైన ప్రభు దంపతులు అసలు దాడే జరగలేదని చెప్పే ఒక వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.  తమ దాబాలో పనిచేసే యువకులే వారిలో వారికి గొడవలొచ్చి కొట్లాడుకున్నారని వారు చెప్పారు. ఈ గొడవలోనే కుర్చీలు, టేబుళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తాము వ్యాపారం చేసుకునేవారమని, అనవసరంగా తమను రాజకీయాల్లోకి లాగొద్దని వేడుకున్నారు. ఉదయం తమ దాబాపై దాడి చేశారని ఎవరి పేర్లనైతే చెప్పారో, ఆ ఇద్దరూ ఈ సమయంలో ప్రభు దంపతులకు అటూఇటూ కూర్చుని ఉండడం విశేషం. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు.




Updated Date - 2022-05-17T08:16:57+05:30 IST