ఏకగ్రీవాల కోసం కుయుక్తులు

ABN , First Publish Date - 2021-03-02T07:02:10+05:30 IST

పురపాలక సంఘాల ఎన్నికల సమరంలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమై బుధవారం సాయంత్రంతో ముగియనుంది.

ఏకగ్రీవాల కోసం కుయుక్తులు

రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు

బహిరంగంగానే బెదిరింపులు, ప్రలోభాలు

మార్కాపురంలో హైడ్రామా 

చీరాల మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఉత్కంఠ 

ఏమైనా సరే సమరానికే  సన్నద్ధమైన టీడీపీ

 వేడెక్కిన పురపోరు 


పురపోరులో భాగంగా వార్డులు, డివిజన్లను ఏకగ్రీవంగా సాధించుకునేందుకు అధికార వైసీపీ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఆ పార్టీ నాయకులు కొన్నిచోట్ల నామ్‌కేవాస్తే నామినేషన్లు వేసిన వారితోపాటు, స్వతంత్ర అభ్యర్థులను లోబర్చుకొని టీడీపీ అభ్యర్థులను  ప్రలోభపెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సొంతపార్టీలో అసంతృప్తులు, రెబల్స్‌ బెడదను ఎదుర్కొంటూనే టీడీపీ అభ్యర్థులను తమవైపునకు తిప్పుకొని ఏకగ్రీవ ఎంపికల ద్వారా ఆరంభంలోనే నైతికంగా బలపడేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. చీరాల పురపాలక సంఘంలో  సగానికిపైగా వార్డుల నుంచి అభ్యర్థులను రంగంలో నిలిపే ప్రయత్నంలో టీడీపీ ఉండగా, వైసీపీలోని ఆధిపత్య పోరుకి ఇంకా పుల్‌స్టాప్‌ పడలేదు. కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, ఒంగోలు, అద్దంకిలలో మాత్రం అధికారపార్టీ పన్నాగాలను  అధిగమించి పార్టీ అభ్యర్థులతో సమరానికి దిగేందుకు  టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పురపాలక సంఘాల ఎన్నికల సమరంలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమై బుధవారం సాయంత్రంతో ముగియనుంది. తదనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నమేర డివిజన్లు, వార్డులను ఏకగ్రీవంగా చేజిక్కించుకుని ఆరంభంలోనే టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని అధికారపార్టీ నాయకులు యోచిస్తున్నారు. తదనుగుణంగా ఆయా మున్సిపాలిటీల్లో, నగరపంచాయతీల్లో వైసీపీ ప్రజాప్రతినిఽధులు సామదాన దండోపాయాలను వినియోగిస్తున్నారు. అయితే ఒకటి రెండు చోట్ల మినహా మిగిలినచోట్ల అధికారపార్టీ కుయుక్తులు ఫలించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల సమరానికి సంబంధించి నాయకులతో టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కాపురం, చీరాల విషయంలో ఆయన నిత్యం పర్యవేక్షిస్తూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ తరఫున పోటీలో ఉండాల్సిందేనని నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.


మార్కాపురంలో హైడ్రామా 

మార్కాపురంలో రాజకీయంగా హైడ్రామా సాగుతోంది. అందుకు ప్రధాన కారణం టీడీపీ ముఖ్యనేత వెనుకడుగు వేయటమేనని ప్రచారం జరుగుతోంది. ఆ నేత వైఫల్యాన్ని గుర్తించి మొత్తం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఏకగ్రీవం చేసి చైర్మన్‌ పదవి పొందే దిశగా వైసీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత పాలకమండలిలో మున్సిపల్‌ చైర్మన్‌ భర్తగా రాజకీయంగా చక్రం తిప్పిన టీడీపీ నేతను సైలెంట్‌ చేయగలిగినట్లు కనిపిస్తోంది. కాంట్రాక్టర్‌ అయిన ఆయన టీడీపీ ముఖ్యుల సమావేశానికే గైర్హాజరయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ అయిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనకు ఆర్థిక వనరులు సహకరించటం లేదని, మాజీ చైౖర్మన్‌ కూడా రాకపోవటంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకుల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుని వైసీపీ నాయకులు వార్డుల్లో నామినేషన్లు వేసిన ఇతరులందరితోను మంతనాలు ప్రారంభించారు. టీడీపీనే పోటీలో లేకపోతే మీకేంటి ఇబ్బంది, ఏకగ్రీవంగా తలా ఒక డివిజన్‌ తీసుకోండంటూ వామపక్షాలు, బీజేపీతో కూడా వారు మంతనాలు సాగిస్తున్నారు. తాజా సమాచారం మేరకు వైసీపీ పక్షాన నామినేషన్లు వేసిన అసంతృప్తివాదులందరి నుంచి ఉపసంహరణ పత్రాలు తీసుకున్నారు. అధికారికంగా ఒప్పందాలు కుదిరినా కుదరకపోయినా ఏకగ్రీవ ఎంపికకు మీరు సహకరించండి, మీకు మేము సహకరిస్తామంటూ టీడీపీ పక్షాన నామినేషన్లు వేసిన వారందరితోను సంప్రదింపులు ప్రారంభించారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉందో గమనించి తదనుగుణంగా వ్యవహరించటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్థానిక పార్టీ నాయకత్వం మెతకవైఖరితో కొంతమంది నామినేషన్లు వేసినవారు ఏకగ్రీవ ఎంపికకు అంగీకారం కూడా తెలిపినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం ఏమైనా అక్కడ మన అభ్యర్థులు పోటీలో ఉండాలి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లోక్‌సభ అధ్యక్షుడు బాలాజీకి ఆదేశాలు జారీచేశారు. ఆయన విషయాన్ని నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నారాయణరెడ్డితో కూడా కొందరు నేతలు మాట్లాడారు. తాను ఆర్థికంగా సహకరించలేకపోతున్నానని, అందుకతీతంగా సిద్ధమయ్యే వారందరినీ పోటీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.


ఒంగోలులో..

ఒంగోలు కార్పోరేషన్‌లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం పలికింది. పరిస్థితులకు అనుగుణ ంగా అభ్యర్థులను ప్రకటించనప్పటికీ పార్టీ తరపున పోటీకి సిద్ధం కావాలని స్థానిక నేతలను ఆదేశించి అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని టీడీపీ మాజీఎమ్మెల్యే జనార్దన్‌ ఇస్తున్నారు. 50 డివిజన్లలో నాలుగు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు పరిశీలనలో తమ నామినేషన్లను కోల్పోయారు. మరో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి రంగం నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో అవసరమైన చోట జనసేనకు, వామపక్షాలకు మద్ధతిచ్చే దిశగా అడుగేస్తున్నారు. జనసేన మాత్రం అనధికారికంగా అంగీకారానికి వస్తున్నట్లు తెలిసింది. ఇక మంత్రి బాలినేని సారథ్యంలో వైసీపీ దూకుడుగా ఉంది. మేయరు అభ్యర్థి గంగాడ సుజాతను ఏకగ్రీవంగా 18వవార్డు నుంచి గెలిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారపార్టీ ప్రలోభాలు ఈ విషయంలో పెద్దగా ఫలించకపోవచ్చని, ఏకగ్రీవమయ్యే డివిజన్లసంఖ్య పెద్దగా ఉండకపోవచ్చని అంచనా. 


చీరాలలో..

చీరాలలో వైసీపీ ఆధిపత్య పోరుకి ఇంకా ఫుల్‌స్టాప్‌ పడలేదు. అక్కడకు పరిశీలకులుగా వెళ్లిన చిన వెంకటరెడ్డి, శేషారెడ్డిని సోమవారం సాయంత్రం మంత్రిని కలిసి ప్రాథమిక నివేదిక అందజేశారు. దానిపై మంత్రి బాలినేని కుస్తీ పడుతున్నారు. ఎమ్మెల్యే, మాజీఎమ్మెల్యేల మధ్య సమన్వయమా బలరాంకు చీరాల, కృష్ణమోహన్‌కి పర్చూరు బాధ్యతలని తేల్చిచెప్పటమా లేక ఇరువైపుల వారికి చెందిన అభ్యర్థులను కలిపి జాబితాను నిర్ణయించి ఎమ్మెల్యేగా గెలుపుభారం చూడమని బలరాంకు అప్పజెప్పటమా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ విషయానికొస్తే పార్టీ కోఆర్డినేటర్‌గా ఈ అంశం వరకు అక్కడకు వెళ్లిన సలగల రాజశేఖర్‌ 16 డివిజన్లకు సంబంధించి టీడీపీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వారినైనా గట్టిగా పోటీలో ఉంచి ఫైట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఇన్‌ఛార్జ్‌ యడం బాలాజీ హాజరుకాలేదు. అనారోగ్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదని సమాచారం. 


 కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకిలలో..

కనిగిరిలో టీడీపీ పక్షాన రంగంలో ఉన్న వారిని లోబర్చుకునే ప్రయత్నాలను అధికారపార్టీ నేతలు ముమ్మరం చేశారు. బెదిరింపులు, ప్రలోభాల పర్వం పూర్తిగా సాగుతోంది. సాక్షాత్తూ కందుకూరు డీఎస్పీ, కనిగిరి సీఐలు కూడా అందుకు సహకరిస్తుండటం పలు విమర్శలకు తావిచ్చింది. అయినా వారు ఆశించిన ఫలితం దక్కలేదు. టీడీపీ నేత ఉగ్రనరసింహారెడ్డి ప్రజలతో మమేకమై ఉండటమే అభ్యర్థుల మనోధైర్యానికి కారణంగా కనిపిస్తోంది. 18మంది అభ్యర్థులకుగాను ఒకరిద్దరు చేజారినా మిగిలిన అభ్యర్థులతో అధికారపార్టీకి సవాల్‌ విసిరే ప్రయత్నంలో డాక్టరు ఉగ్ర ఉన్నారు. గిద్దలూరులో మూడు నుంచి నాలుగు వార్డులను ఏకగ్రీవం చేసుకునే దిశగా ఎమ్మెల్యే రాంబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన ఎంపిక చేసిన ఛైర్మన్‌ అభ్యర్థి విషయంపై అధిష్ఠానం సీరియస్‌ అయింది. బీసీలలో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఛైర్మన్‌ అభ్యర్థి ఎంపిక వివాదానికి తెరదించాలని ఎమ్మెల్యేని ఆదేశించింది. తదనుగుణంగా రాంబాబు తమ పార్టీ ఇంకా ఛైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల జనసేన కార్యకర్త ఆత్మహత్య వ్యవహారం కలిసి అటు కాపు సామాజికవర్గంతో పాటు ఇటు యాదవ సామాజికవర్గంలోని అధికారపార్టీకి తలొంపులు తెచ్చారు. ఇంకోవైపు టీడీపీ నేత అశోక్‌రెడ్డి రంగంలో ఉన్న 18మంది అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్పుకున్నా 15కిపైగా డివిజన్లలో గట్టి పోటీకి సిద్ధమైనట్లు తద్వారా సానుకూలత ప్రకటించారు. చీమకుర్తిలో వైసీపీ పక్షాన ఎమ్మెల్యే సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిలు ఐదు డివిజన్లను ఏకగ్రీవం చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే ఇటీవల వైసీపీలో చేరిన మాజీమంత్రి శిద్దా సహకారంతో 14వ డివిజన్‌, టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైన 10వ డివిజన్‌లో మాత్రమే అందుకు అవకాశం కనిపిస్తోంది. ఇటువైపు టీడీపీ నేత విజయకుమార్‌ రంగంలోకి వచ్చి వైసీపీయేతర శక్తులందరినీ ఐక్యం చేసే పనిలో పడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వారిని పార్టీలో చేర్చుకోవటం, తటస్థవాదుల మద్దతు కూడగట్టుకోవటం లాంటి ప్రయత్నాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పోటీకి సిద్ధం కావటంతో దాదాపు అన్ని డివిజన్లలోను పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగే పరిస్థితి కనిపిస్తోంది. అద్దంకిలో ఇప్పటికే టీడీపీ పక్షాన ఎమ్మెల్యే రవికుమార్‌, వైసీపీ పక్షాన కృష్ణచైతన్యలు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ ఏకగ్రీవ ఎంపికలకు పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చని అంచనా.


Updated Date - 2021-03-02T07:02:10+05:30 IST