కోనసీమలో వైసీపీ చిచ్చు!

ABN , First Publish Date - 2022-05-26T09:13:13+05:30 IST

ప్రభుత్వం పట్ల ఎస్సీల్లోని వ్యతిరేకతను దారిమళ్లించేందుకే వైసీపీ నేతలు తమ ఇళ్లపై తామే దాడులు చేయించుకున్నారని, అమలాపురం ఘటన వెనుక అధికారపక్షం పక్కా డిజైన్‌ దాగి ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

కోనసీమలో వైసీపీ చిచ్చు!

  • వాళ్ల ఇళ్లపై వాళ్లే దాడులు చేయించుకున్నారు
  • అంబేడ్కర్‌ పేరును వివాదాల్లోకి లాగడం దురదృష్టకరం
  • సంయమనం పాటించాలి.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు
  • గొడవ జరగాలని జగన్‌ పార్టీ కోరుకుంది
  • సంయమనం పాటించాలి: పవన్‌


అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పట్ల ఎస్సీల్లోని వ్యతిరేకతను దారిమళ్లించేందుకే వైసీపీ నేతలు తమ ఇళ్లపై తామే దాడులు చేయించుకున్నారని, అమలాపురం ఘటన వెనుక అధికారపక్షం పక్కా డిజైన్‌ దాగి ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అమలాపురం సంఘటనలో జనసేన హస్తం ఉందని వైసీపీ మంత్రులు, నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీస్‌ వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకొని దాడులకు జనసేన కారణమని మాట్లాడటం ఏమిటని ఆగ్రహించారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే ఆయనకు మా పార్టీ నేతలు నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్నవారిపై ఆయన అనుచరులు దాడులకు పాల్పడ్డారు. నేను కేవలం పరామర్శించడానికి అక్కడకు వెళ్తేనే 144 సెక్షన్‌ విధించి, నా పర్యటన పూర్తయ్యేవరకూ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాంటిది నెలరోజులుగా జిల్లాపేరు మార్పుపై కోనసీమ ప్రాంతంలో భావోద్వేగాలు చెలరేగుతుంటే మరెంత జాగ్రత్తగా వారు ఉండాలి? కానీ, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అమలాపురం ఘటన జరిగిందనేందుకు ఇదే నిదర్శనం’’ అని పవన్‌ విమర్శించారు. 


నిజంగా దాడులు జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు 144 సెక్షన్‌ విధించి మంత్రుల ఇళ్ల వద్ద వేల సంఖ్యలో పోలీసుల్ని ఎందుకు మోహరించలేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ‘‘ కోనసీమ గొడవల వెనుక డిజైన్‌ ఉంది. గొడవ జరగాలని వైసీపీ నాయకులు కోరుకున్నారు. మాజీ డ్రైవర్‌ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసును పక్కదారి పట్టించాలనే దురుద్దేశంతోనే కోనసీమకు అధికారపక్షం చిచ్చు పెట్టింది’’ అని మండిపడ్డారు. దాడికి గురైంది మంత్రి విశ్వరూప్‌ సొంత ఇల్లు కాదని.. అది అద్దె ఇల్లు అని, దాడికి ముందే మంత్రి కుటుంబీకులను పోలీసులు అక్కడ నుంచి తరలించారన్నారు. ‘‘కుల ఘర్షణలు రావణకాష్ఠం లాంటివి. ఒక్కసారి అంటుకుంటే దేశమంతా కాలిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడి గొడవలు పెంచే ప్రయత్నం చేయడం తప్ప, ఈ మంటలను తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు  గెజిట్‌లో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టకుండా, ఇప్పుడు హడావుడిగా కోనసీమ జిల్లాకు ఆ పేరు పెట్టారు. ఇది వైసీపీ రాజకీయ కుట్రగానే కనిపిస్తోంది. కొత్త జిల్లాల్లో కొన్నింటికి శ్రీసత్యసాయి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వంటి వారి పేర్లతో నామకరణం చేశారు.  అప్పుడే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాని కూడా ప్రకటిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కావాలని జాప్యం చేయడంలో వైసీపీ ఉద్దేశం ఏమిటి? నోటిఫికేషన్‌ జారీచేసి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వినతులు ఇవ్వాలని కోరడం వెనక ఆంతర్యం ఏమిటి? దీని వెనుకనున్న దురుద్దేశం ఏమిటో సృష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్లు ప్రతి జిల్లాకు వెళ్లి వాళ్ల వాళ్ల అభ్యంతరాలు తెలుసుకునేవి. ఇప్పుడు మాత్రం సమూహంగా కాకుండా వ్యక్తులుగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి వినతలు ఇవ్వాలని అడగడం ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు. 


కడపకు అంబేడ్కర్‌ పేరు పెట్టొచ్చుగా..

ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ అంబేద్కర్‌ పట్ల గౌరవభావం ఉంటుందని, ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘‘రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఒక్క కోనసీమకే ఆయన పేరు ఎందుకు పెట్టాలి? కడప జిల్లాకు ఆ పేరు పేరు పెట్టొచ్చు కదా? ఎస్సీల పట్ల వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ ఉండి అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెట్టిందని అనుకోలేం. అమరావతికి చెందిన ఎస్సీ రైతుల మీద జగన్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడాన్ని ఎలా మరవగలం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రా తొలిస్థానంలో ఉన్నట్టు కేంద్రం మంత్రి రాందాస్‌ అథవాలే స్వయంగా చెప్పారు. అనంతపురం జిల్లాలో కొంత భాగానికి సత్యసాయి జిల్లాగా నామకరణం చేసినప్పుడు కొంత మందికి ఆ పేరు నచ్చలేదు. నా దగ్గరకు వచ్చి దానిపై మాట్లాడాలని కోరారు. అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, స్థానికంగా మీ అభిప్రాయాలు తెలపాలని చెప్పాను. తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ చేశాం’’ అని పవన్‌ గుర్తుచేశారు. 

Updated Date - 2022-05-26T09:13:13+05:30 IST