Minister Appalaraju: ఆందోళనలో మంత్రి అప్పలరాజు..జగన్‌ ఇచ్చిన టాస్క్‌తో సతమతం

ABN , First Publish Date - 2022-09-03T23:38:57+05:30 IST

మంత్రి సిదిరి అప్పలరాజు పరిస్థితి నడి సంద్రంలో నావలా మారిందట. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పలరాజుకు మంత్రి పదవి దక్కింది. అయితే రెండో విడత క్యాబినెట్‌లో..

Minister Appalaraju: ఆందోళనలో మంత్రి అప్పలరాజు..జగన్‌ ఇచ్చిన టాస్క్‌తో సతమతం

శ్రీకాకుళం (Srikakulam): మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Appalaraju) పరిస్థితి నడి సంద్రంలో నావలా మారిందట. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పలరాజుకు మంత్రి పదవి దక్కింది. అయితే రెండో విడత క్యాబినెట్‌లో చాలా మందికి ఊస్టింగ్ ఇచ్చినా అప్పలరాజును మాత్రం యథావిధిగా కొనసాగించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మంత్రికి ప్రభుత్వ పెద్దలు అప్పగించిన బాధ్యత ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారిందట. తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టేయడంతో ఆ విషయాన్ని పెద్దలకు చెప్పలేక బాధ్యతను నిర్వర్తించలేక మంత్రి పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీకావట.


శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం (Ap Government) చర్యలు చేపట్టింది. సంతబొమ్మాళి మండలం మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే పోర్టుకు కావాల్సిన భూసేకరణ బాధ్యతలను సీఎం జగన్, అప్పలరాజుకు అప్పగించారు. అయితే మొదట్లో ఇదెంతపని అనుకున్న మంత్రి.. భూ సేకరణ విషయంలో కొంత స్పీడ్‌గానే అడుగులు వేశారు. కానీ ఆ తర్వాతే తెలిసిందట లోతేంటో. నిర్వాసితుల నుంచి ఎదురౌతున్న అడ్డంకులు తొలగించడం మంత్రిగారికి సాధ్యం కావడం లేదట. ఒకవేళ మొండిగా పోర్టు నిర్మాణానికి అడుగులు వేస్తే.. దాని పర్యావసానం ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌లో ఉన్నారట అప్పలరాజు.



సుమారు 3వేల 100 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న భావనపాడు పోర్టు (Bhavanapadu Port)కు ఆది నుంచీ ఆటంకాలే ఎదురౌతున్నాయి. పోర్టు నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణ త్యాగాలు చేసైనా పోర్టును అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భావనపాడులో నిర్మించాల్సిన పోర్టును మూలపేట-విష్ణుచక్రం గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే జగన్‌ సర్కార్‌ తాజా ప్రతిపాదనలను ఆ గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015 నుంచి కొద్ది రోజుల ముందు వరకూ భావనపాడు-దేవునల్తాడ మధ్యలో పోర్టు నిర్మాణం చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అయితే ఏం జరిగిందో ఏమో గానీ కొత్తగా మూలపేట-విష్ణుచక్రం గ్రామాల మధ్య నిర్మించాలని నిర్ణయించింది. అయితే  ఈ నిర్ణయం వెనుక మంత్రి అప్పలరాజు హస్తం ఉందని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓ సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం మూలపేట-విష్ణుచక్రం గ్రామాలకు అన్యాయం చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 



ఇదిలావుంటే ఇటీవల మంత్రి అప్పలరాజు ఆ రెండు గ్రామాల ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నం చేశారట. అయితే గ్రామస్తుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారట. గతంలో సోంపేట ధర్మల్ విద్యుత్ ఉద్యమం అనుభవాల దృష్ట్యా గ్రీన్ ఫీల్డ్ పోర్టు విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందట. మొత్తంగా మంత్రి అప్పలరాజుకు ప్రభుత్వ పెద్దలు ఓ టైంబాండ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోపు నిర్వాసితుల అభ్యంతరాలను పరిష్కరించి భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని వైసీపీ (Ycp)లో టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మంత్రి అప్పలరాజు పోర్టు విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఆసక్తిగా మారుతోంది.



Updated Date - 2022-09-03T23:38:57+05:30 IST