దిక్కుతోచని వైసీపీ

ABN , First Publish Date - 2022-10-02T06:33:13+05:30 IST

‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది’ అనే చందంగా మారింది విశాఖపట్నంలో వైసీపీ పెద్దల పరిస్థితి.

దిక్కుతోచని వైసీపీ
దసపల్లా భూముల్లో జీవీఎంసీ ట్యాంకు వద్ద టీడీపీ నేతల ధర్నా

దసపల్లా భూముల వ్యవహారంలో విపక్షాల ముప్పేట దాడి

విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర వుందని జనసేన ఆరోపణ

పెరుగుతున్న విమర్శల దాడి

నోరు విప్పని జగన్‌ పార్టీ నాయకులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది’ అనే చందంగా మారింది విశాఖపట్నంలో వైసీపీ పెద్దల పరిస్థితి. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని, ఇక్కడ ప్రభుత్వ భూమి ఎవరు కబ్జా చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని ప్రగల్భాలు పలికిన నాయకులే ఇప్పుడు అత్యంత విలువైన దసపల్లా భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దసపల్లా భూములను గజాల చొప్పున కొన్న పెద్దలందరినీ భయపెట్టి అతి తక్కువ వాటా ఇచ్చేలా బలవంతంగా అగ్రిమెంట్‌ చేయించుకున్నారని ఏడాది క్రితమే బయటపడింది. ఇలా...దాదాపు 75 వేల చదరపు గజాల స్థలాన్ని ఎస్యూర్డ్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ పేరిట బదలాయించారు. దీనికి రూ.9.9 కోట్లు ఫీజుగా కట్టాల్సి వస్తే...ఆ నిధులను కూడా వారే సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా అందించారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందులో వైసీపీ ఉత్తరాంధ్ర పూర్వపు ఇన్‌చార్జి కుమార్తె, అల్లుడు వున్నారని ఆరోపిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా ఆగమేఘాలపై వచ్చి అడ్డగోలుగా మాట్లాడే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ అంశంపై అసలు నోరెత్తడం లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు...ఈ భూములను తెలుగుదేశం కాజేస్తోందని, ఎవరెవరికో ఇచ్చేస్తుందని విచారణ చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకుడి నుంచి పార్టీ అధినేత వరకు దసపల్లా భూములను కాపాడతామని విశాఖ కలెక్టరేట్‌ ముందు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు అదే నేతలు అవే భూములను పువ్వుల్లో పెట్టి ప్రైవేటు పార్టీకి అప్పగిస్తున్నారు. వాటిని 22-ఏ నుంచి తొలగించాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో రాజధానిని వదిలేసి విశాఖపట్నం వస్తున్నది ఇందుకా?..అని ప్రతిపక్ష పార్టీలతో సహా విశాఖ వాసులు సైతం విస్తుపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో విలువైన ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా చేతులు మారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత బే పార్క్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కార్తీకవనం ప్రాజెక్టులో వాటా తీసుకొని రాడిసన్‌ హోటల్‌ గుప్పిట్లో పెట్టుకున్నారు. భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయాన్ని కలుపుతూ ప్రతిపాదించిన బీచ్‌ కారిడార్‌ను దారిమళ్లించి, ఆ మార్గానికి ఇరువైపులా భూముల్ని బలవంతంగా లాక్కొని తక్కువ ధరకు రిజిసే్ట్రషన్లు చేయించుకున్నారు. రామానాయుడు స్టూడియోపైనే కన్నేశారు. వాల్తేరు క్లబ్‌ను కొట్టేయడానికి ఏకంగా న్యాయవాదులను ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకువచ్చి ఫైళ్లన్నీ అప్పగించారు. విశాఖపట్నంలో విలువైన భూములను కొట్టేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ పెద్దల బాగోతం ఇప్పుడు దసపల్లా రూపంలో మరింత స్పష్టంగా బయటపడడంతో ఆ పార్టీ నాయకుల నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఏ ఒక్కరూ దీనిని ఖండించడం లేదు. కనీసం దసపల్లా భూములను కాపాడతామని కూడా ప్రకటన చేయలేకపోతున్నారు. దీనిని బట్టే అందులో ఆ పార్టీ పెద్దల హస్తం వుందని అర్థమవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


అక్కడ వచ్చేది గేటెడ్‌ కమ్యూనిటీ

దసపల్లా భూముల్లో భారీ గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి ‘దసపల్లా యుఫోరియా గార్డెన్స్‌’ అని పేరు పెట్టేశారు. 


ఇది క్విడ్‌ ప్రోకోనే

విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఎవరైనా భూమిని డెవలప్‌మెంట్‌కు తీసుకుంటే 50:50 లేదా 60:40 శాతం చొప్పున యజమాని, బిల్డర్‌ ఒప్పందం చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ దసపల్లా భూములను డెవలప్‌మెంట్‌కు తీసుకున్న పెద్దలు కొందరికి 17:83, మరికొందరికి 20:80 శాతం చొప్పున వాటా ఇచ్చారు. అంటే నిర్మించిన వాటిలో డెవలపర్‌ వాటాయే ఎక్కువ. ఇది చాలా అడ్డగోలు ఒప్పందం. దీనిని బట్టే ఇది క్విడ్‌ ప్రోకో అని అర్థమవుతోంది. ‘ఆ భూములు 22-ఏలో ఉన్నాయి కాబట్టి మీరు ఏమీ చేయలేరు...మేము అధికారం ఉపయోగించుకొని చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ వాటా’’ అని వారు తీసుకున్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలి. మేము అధికారంలోకి రాగానే నొయిడాలో ట్విన్‌ టవర్స్‌ని కూల్చినట్టు దసపల్లా భూముల్లో నిర్మించే భవనాలను కూల్చేస్తాం. అది మాత్రం ఖాయం.

Updated Date - 2022-10-02T06:33:13+05:30 IST