అంతా మీరే చేశారు!

ABN , First Publish Date - 2022-05-26T08:54:56+05:30 IST

సమస్య తలెత్తితే... పరిష్కారం గురించి ఆలోచించాలి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత సాధికారికంగా మాట్లాడాలి.

అంతా మీరే చేశారు!

  • ప్రత్యర్థి పార్టీలపై వైసీపీ ‘ఎదురు దాడి’ వ్యూహం
  • వైఎస్‌ మృతి నుంచి కోనసీమ చిచ్చు దాకా..
  • కోడికత్తి దాడి, వివేకా హత్యపైనా అంతే..
  • విపక్షంలో ఉండగా సీబీఐ విచారణకు డిమాండ్‌
  • అధికారంలోకి రాగానే అన్నీ మరిచి మౌనముద్ర
  • రాజకీయ డ్రామాలో వైసీపీకి ఎదురు దెబ్బలు


కోడికత్తి పోటు నుంచి కోనసీమ చిచ్చు దాకా ఎక్కడ, ఎప్పుడు ఏం జరిగినా సరే... ‘దీని వెనుక కుట్ర ఉంది. టీడీపీ వాళ్లే చేశారు’ అని బురదజల్లడం! తమ పార్టీ వారు తప్పు చేసినా... ఎంచక్కా వెనకేసుకు రావడం! వాస్తవాలు బయటపడిన తర్వాత ‘మౌనముద్ర’ దాల్చడం! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  ఇదే వ్యూహం! అధికార పక్షంలోకి వచ్చాక అదే వ్యూహం. ఇది... వైసీపీ తీరు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సమస్య తలెత్తితే... పరిష్కారం గురించి ఆలోచించాలి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత సాధికారికంగా మాట్లాడాలి. కానీ... ముందూ వెనుకా చూడకుండా ‘టీడీపీ వాళ్లే చేశారు. జనసేన వాళ్లే కుట్రలు పన్నారు’ అంటూ వైసీపీ నేతలు ప్రత్యర్థి పార్టీలపై క్షణం ఆలస్యంకాకుండా బురదజల్లుతున్నారు. జిల్లా పేరు మార్పుపై కోనసీమలో తలెత్తిన ఉద్రిక్తతలపైనా అదేపని చేశారు. చివరికి... అల్లర్ల వెనుక అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ హస్తముందని స్వయంగా మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రకటించడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇలా ఒకటీ రెండూ కాదు... విపక్షంలో ఉన్నప్పటి నుంచీ అనేక అంశాల్లో వైసీపీకి ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి. 


తండ్రి మరణం నుంచి బాబాయ్‌ హత్యపై దాకా...

హెలికాప్టర్‌ ప్రమాదంలో తండ్రి వైఎస్‌ మరణించిన తర్వాత... ముఖ్యమంత్రి పదవికోసం జగన్‌ ప్రయత్నించి భంగపడ్డారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించారు. అప్పటిదాకా వైఎస్‌ మరణంపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయని వైసీపీ... ఉప ఎన్నికలు రాగానే వైఎస్‌ మృతి వెనుక కుట్ర ఉందని, ఆయనను చంపించారని ఆరోపణలు గుప్పించింది. ఎన్నికలు ముగియగానే దీనిపై గప్‌చుప్‌! 2019 ఎన్నికల ముందు జరిగిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. తొలుత దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు విఫల యత్నం చేశారు. హత్యగా నిర్ధారణ అయిన తర్వాత... ‘అది చంద్రబాబే చేయించారు’ అంటూ అప్పుడు  ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌తోపాటు వైసీపీ ముఖ్యనేతలంతా ఆరోపించారు. జగన్‌ సొంత మీడియాలో ‘నారాసుర చరిత్ర’ అంటూ ప్రత్యేక కథనాలు వండి వార్చారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో దీనిని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. తొలుత సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌... అధికారంలోకి రాగానే ప్లేటు తిరగేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లి పోయింది. వివేకా హత్య కేసు విచారణలో... చంద్రబాబు పాత్ర ఏమాత్రం లేదని దర్యాప్తులో తేలింది. పైగా... ‘ఇంటి దొంగల’ పాత్రపై బలమైన అనుమానాలు తలెత్తాయి. బాబాయ్‌ హత్యను ఎంచక్కా ఎన్నికల్లో అస్త్రంగా వాడుకున్న జగన్‌... ఇప్పుడు ఆ మాటెత్తడంలేదు.


కోడికత్తిపై ఇలా...

ఎన్నికల ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడికత్తి దాడి జరిగింది. ఇది తెలుగుదేశం వాళ్లే చేయించారని రచ్చ రచ్చ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు తెరలేపారు. కోడికత్తితో దాడి చేసిన వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడని కొన్ని గంటల్లోనే పోలీసులు తేల్చారు. కేవలం సంచలనం సృష్టించి, వార్తల్లోకి వచ్చేందుకు అతను ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. అయినా సరే... ‘కోడి కత్తి’ పోటును ఎన్నికల్లో అస్త్రంగా వాడుకున్నారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోనికి వచ్చాక.. కోడికత్తి కేసు ఏమయిందో ఎవ్వరికీ తెలియదు.


దావోస్‌ దారి తప్పి...

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దావో్‌సకు వెళ్లిన ప్రతిసారీ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. ‘దోచుకున్నది దాచుకోవడానికే’ వెళ్తున్నారని ఆరోపించారు. పైగా... అదో వృథా పర్యటన అని తేల్చేసేవారు. ఇప్పుడు... జగన్‌ స్వయంగా దావో్‌సకు వెళ్లారు. అప్పుడు తాము చేసిన విమర్శలను ఎంచక్కా మరిచిపోయారు. మరోవైపు... ఈ పర్యటనలోనూ అనేక మలుపులు, రహస్యాలు! ముఖ్యమంత్రిగా జగన్‌ ఎక్కడికైనా వెళ్లవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలూ చేయవచ్చు. కానీ... దీనిపైనా అంతలేని గోప్యత, గుట్టు పాటించడం వివాదాస్పదంగా మారింది. ఆయన సతీసమేతంగా దావోస్‌కు వెళ్తున్నట్లు అధికారిక ప్రకటనల్లో చెప్పలేదు. పైగా... దావోస్‌కు వెళ్లాల్సిన సీఎం విమానం లండన్‌లో దిగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో... మంత్రులు రంగంలోకి దిగి అర్థంలేని వాదనలతో లండన్‌ టూర్‌ను సమర్థించుకునేందుకు విఫల యత్నం చేశారు. లండన్‌లో ఎందుకు దిగాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.


హత్యచేసిన ఎమ్మెల్సీపై...

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను హత్య చేశారు. మూడు రోజులపాటు దీనిపై రచ్చ జరిగినా... ఉదయ భాస్కర్‌ను వైసీపీ నేతలు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘ఆయన ఏ తప్పూ చేయలేదు. అందుకే బయట తిరుగుతున్నారు’ అని ప్రభుత్వ పెద్దలే కితాబు ఇచ్చారు. మృతుని కుటుంబ సభ్యుల వాదన, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, సామాజిక మాధ్యమాలు, ప్రజా సంఘాలు వాస్తవాన్ని వెలికి తీయడంతో... ఎట్టకేలకు పోలీసులు ఉదయ భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘నేనే చంపాను’ అని ఎమ్మెల్సీ అంగీకరించారు. ఎందుకు, ఎలా చంపారనే దానిపై పోలీసులు చెప్పిన కథనంపై అనేక సందేహాలున్నా... చంపింది ఎమ్మెల్సీయే అని తేలిపోయింది. దీంతో... ‘చట్టం ముందు ఎవరైనాఒకటే.’ అంటూ పెద్దలు గొప్పలకు పోయారు.


పచ్చటి కోనసీమలో చిచ్చు...

‘పథకం’ ప్రకారమే అమలాపురంలో దాడులు జరిగాయని అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆ పథకం ఎవరిది, కుట్ర ఎవరు పన్నారనే అంశంపై ఎవరి వాదన వారిది. కానీ... మంగళవారం నాటి పరిణామాలకు పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పక తప్పదు. మూడేళ్లుగా ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు చిన్న ఆందోళనలకు పిలుపునిచ్చినా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ... కోనసీమలో ఈ పరిస్థితి కనిపించలేదు. జిల్లా పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఈనెల 19వ తేదీ నుంచే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. అంతకుముందే జరిగిన కలెక్టరేట్‌ ముట్టడిలో సుమారు 5వేల మంది పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా... మంత్రి విశ్వరూప్‌ అనుచరుడు, వైసీపీ క్రియాశీల కార్యకర్త అన్యం సాయి ఆత్మహత్యాయత్నం  చేసుకున్నారు. ఇక... మంగళవారం ఉదయం నుంచే ఎక్కడికక్కడ కట్టడి చేశారుకానీ, సరైన సన్నద్ధత లేకపోవడంతో పోలీసులే ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. సంఘటన జరిగిన వెంటనే.... అందుకు బాధ్యులెవరో తేలకుండానే,  హోంమంత్రి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స  ‘ఇది టీడీపీ, జనసేన కుట్ర’గా ప్రకటించేశారు. కొద్దిసేపటికే... సాయి ఆత్మహత్యాయత్నం ఉదంతం, మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇచ్చిన ప్రకటనలు, సజ్జలతో దిగిన ఫొటో వంటివి బయటికి వచ్చాయి. ఇక... ఈ అల్లర్ల వెనుక తమ పార్టీకే చెందిన ఒక కౌన్సిలర్‌ హస్తం ఉన్నట్లు స్వయంగా విశ్వరూప్‌ ప్రకటించారు. దీంతో... వైసీపీ మళ్లీ ఆత్మరక్షణలో పడింది.

Updated Date - 2022-05-26T08:54:56+05:30 IST