ఆపరేషన్‌.. ఆకర్ష్‌!

ABN , First Publish Date - 2021-02-28T05:44:46+05:30 IST

‘పుర’ పోరు వేడెక్కింది. మునిసిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఎన్నికల అనంతరం ప్రత్యర్థి పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు వల వేయడం చూశాం. కానీ, జిల్లా రాజకీయ చర్రితలో తొలిసారిగా.. ఎన్నికలకు ముందే.. ఇతర పార్టీల తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులపై వైసీపీ నేతల కన్ను పడింది. ఈ క్రమంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన నలుగురు కౌన్సిలర్లు అభ్యర్థులు వైసీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇది అప్రజాస్వామికం అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతల ప్రలోభాల వల నుంచి తమ అభ్యర్థులు కాపాడుకునే దిశగా వారందరినీ రహస్య స్థావరాలకు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అధినేతతో పాటు టీడీపీ నేతలంతా ఈసీని కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఆపరేషన్‌.. ఆకర్ష్‌!
రహస్య ప్రదేశానికి పయనం అవుతున్న టీడీపీ అభ్యర్థులు

- టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులపై వైసీపీ కన్ను

- అధికార పార్టీలో నలుగురి చేరిక

- మరో ఇద్దరి కోసం వైసీపీ నేతల తీవ్ర ప్రయత్నం

- రహస్య ప్రదేశాలకు తరలించిన టీడీపీ నేతలు

- పలాసలో వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

(పలాస, ఫిబ్రవరి 27)

‘పుర’ పోరు వేడెక్కింది. మునిసిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఎన్నికల అనంతరం ప్రత్యర్థి పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు వల వేయడం చూశాం. కానీ, జిల్లా రాజకీయ చర్రితలో తొలిసారిగా.. ఎన్నికలకు ముందే.. ఇతర పార్టీల తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులపై వైసీపీ నేతల కన్ను పడింది. ఈ క్రమంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన నలుగురు కౌన్సిలర్లు అభ్యర్థులు వైసీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇది అప్రజాస్వామికం అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతల ప్రలోభాల వల నుంచి తమ అభ్యర్థులు కాపాడుకునే దిశగా వారందరినీ రహస్య స్థావరాలకు తరలించారు. ఈ ఘటనపై   టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అధినేతతో పాటు టీడీపీ నేతలంతా ఈసీని కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

-----------------

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ‘పుర’పోరుకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరి మునిసిపల్‌ సమరంలో కూడా సత్తా చాటేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవాలు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’లో భాగంగా టీడీపీ అభ్యర్థులపై ప్రలోభాల వల విసురుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన నలుగురు కౌన్సిలర్ల అభ్యర్థులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం వాయిలపల్లి శ్రీనివాస్‌(లక్ష్మణ్‌)(4వ వార్డు), రోణంకి మురళీకృష్ణ (8 వార్డు నర్సిపురం కాలనీ),  బమ్మిడి వెంకటలక్ష్మి(20 వార్డు లేబర్‌కాలనీ), సనపల దీప్తి(29 వార్డు) మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ జంట పట్టణాల అభివృద్ధి కోరి వైసీపీలో చేరడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వారి వార్డులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరిని కూడా తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలో చేరడం సహజంగా జరుగుతుంది. కానీ ఎన్నడూలేని విధంగా ఈసారి నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేయడం చర్చనీయాంశమవుతోంది. 

 టీడీపీ నేతల అత్యవసర సమావేశం

ఒకేసారి నలుగురు కౌన్సిలర్‌ అభ్యర్థులు వైసీపీలో చేరడంతో టీడీపీ నాయకులు ఖంగుతిన్నారు. శనివారం మధ్యాహ్నం పలాసలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కౌన్సిలర్‌ అభ్యర్థులతో మాజీమంత్రి గౌతు శివాజీ, గౌతు శిరీషతో పాటు ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి వజ్జ బాబూరావు, పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌గుప్తా, వజ్జ భవాని ప్రత్యేకంగా చర్చించారు. కౌన్సిలర్‌ అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎటువంటి ప్రలోభాలు పెట్టారు... ఏ విధంగా బెదిరించారనే తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని, అభ్యర్థులు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని, ఉన్నవారితోనే విజయం సాధిస్తామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురి కావద్దని అభ్యర్థులకు సూచించారు. 

 పిల్లా పాపలతో రహస్య స్థావరాలకు...

వైసీపీ నేతల ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు ప్రతివ్యూహాన్ని రచించారు. పలాసలో రాజకీయ పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా అధిష్ఠానం, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు పార్టీని వీడిన వార్డులో డమ్మీలుగా వేసిన అభ్యర్థులందరినీ కుటుంబ సభ్యులతో సహా శనివారం రహస్య స్థావరాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అప్పటివరకూ వీరంతా రహస్య ప్రదేశాల్లో ఉండాల్సిందే. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత వీరంతా బయటకు రానున్నారు. అంతవరకూ ద్వితీయ శ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-28T05:44:46+05:30 IST