ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం మొండిచేయి

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

ఎస్సీల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం(ఎల్‌పీఎస్‌) అమలు చేసింది.

ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం మొండిచేయి
ఎస్సీ కార్పొరేషన అధికారులు జారీ చేసిన నోటీసులు

అటకెక్కిన భూ పంపిణీ

టీడీపీ హయాంలో తొలి విడత పంపిణీ

రెండో విడతకు అనుమతి.. మూడో విడత ప్రతిపాదన

ప్రభుత్వం మారడంతో మూడేళ్లుగా ఎదురు చూపులు

తొలి విడత రైతులకు కంతుల నోటీసుల భయం

విడపనకల్లు, ఆగస్టు 6: ఎస్సీల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం(ఎల్‌పీఎస్‌) అమలు చేసింది.  రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఉరవకొండ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. ఎస్సీ కార్పొరేషన ద్వారా నిరుపేద ఎస్సీలకు 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల సాగు భూమిని కొని ఇచ్చే పథకం ఇది. 75 శాతం సబ్సిడీతో భూములను ఎస్సీలకు అప్పగించి, వారి అభివృద్ధికి పాటుపడటం ఈ పథకం ఉద్దేశం. మిగిలిన 25 శాతం మొత్తాన్ని లబ్ధిదారులు ఐదు వాయిదాలలో ఐదేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నిధులు 60 శాతం, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన నిధులు 40 శాతం కలిపి ఎస్సీలకు భూమిని కొనుగోలు చేసి ఇచ్చేవారు. 2018లో విడపనకల్లు మండలంలోని వివిధ గ్రామాల 158 మంది ఎస్సీ రైతులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి 2.5 ఎకరాల ప్రకారం దాదాపు 400 ఎకరాలను కొనుగోలు చేశారు. ఎస్సీ కార్పొరేషన ద్వారా రూ.12 కోట్ల ఖర్చు చేశారు. మొదటి విడత కింద అర్హులకు భూమిని పంపిణీ చేశారు. రెండో విడత రూ.22 కోట్ల ఖర్చుతో దాదాపు 700 ఎకరాలు కొని, 230 మందికి పంపిణీ చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయ్యింది. అదే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోయింది. లేదంటే అప్పట్లోనే మరో 230 మంది ఎస్సీ రైతులకు భూమి దక్కేది. ఇది కాక మరో రూ.30 కోట్ల ప్రతిపాదనలతో 500 మందిని ఎంపిక చేయాలని భావించారు. ఈ సొమ్ముతో మూడో విడతలో వెయ్యి ఎకరాలకు పైగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత మాత్రమే భూ పంపిణీ జరిగింది. ప్రభుత్వం మారిపోవడంతో ఈ పథకం అటకెక్కింది. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత మూడేళ్లలో దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. 


కంతులు చెల్లించండి..

మొదటి విడత కింద 2018లో భూమిని తీసుకున్న ఎస్సీ రైతులకు ఎస్సీ కార్పొరేషన ద్వారా నోటీసులు జారీ చేశారు. మూడు సంవత్సరాలకు వడ్డీతో కలిపి ఒక్కొక్క రైతు రూ.80 వేలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. లేదంటే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. గడువులోగా కంతులు చెల్లించకపోతే భూములను వెనక్కి తీసుకుని, వేలం వేయటానికి సిద్ధంగా ఉన్నామని బెదిరిస్తున్నారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల నుంచి పంటలు పండటం లేదని, పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులు పాలయ్యామని వాపోతున్నారు. ఇలాంటి సమయం లో కంతులు కట్టాలని బెదిరిస్తే, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. 


నిధులు లేక..

వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయి. ఎస్సీ కార్పొరేషనలో నిధులు ఉండి ఉంటే ఇప్పటికి ఉరవకొండ నియోజకవర్గంలో వెయ్యి మందికి పైగా ఎస్సీలకు సాగు భూమి అందేది. కార్పొరేషన నిధులు ఇతర అవసరాలకు మళ్లించడంతో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది, పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఇక ఎస్సీ కార్పొరేషనకు నిధులు వస్తే భూ పంపిణీ పూర్తి అవుతుంది. కానీ నిధులు లేవని అధికారులు ఫైల్‌ అటకెక్కించారు. ఇదే అన్యాయం అనుకుంటే.. కొందరు నాయకులు ఎస్సీలను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్సీ కార్పొరేషన ద్వారా భూ పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులను తమ ఇళ్లకు పిలిపించుకున్నారు. ఒక్కొక్కరితో ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


అప్పులపాలయ్యాం..

ఎస్సీ కార్పొరేషన ద్వారా నాకు రెండున్నర ఎకరాల భూమి ఇచ్చారు. మూడు సంవత్సరాలుగా పప్పుశనగ సాగు చేస్తున్నాను. ఒక్క సంవత్సరం కూడా పంట పూర్తిగా పండలేదు. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ఇప్పుడు కంతులు కట్టమంటే ఎలా..?

- రామాంజినమ్మ, విడపనకల్లు


ఎలా కట్టాలి..?

మూడేళ్లుగా పంటలు లేవు. వరుస కరువులు వచ్చాయి. వేలకు వేలు అప్పులు చేశాము. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. బయట తెచ్చిన అప్పులు ఎలా కట్టుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు కార్పొరేషన వాళ్లు కంతులు కట్ట మంటే ఎలా కట్టేది..? ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి..?  

- లక్ష్మిదేవి, విడపనకల్లు


ప్రభుత్వం మారడంతో..

రెండో విడతలో నా పేరు ఎంపిక చేశారు. అన్ని రికార్డులు పూర్తి చేశారు. కానీ ప్రభుత్వం మారి పోవటంతో భూ పంపిణీ ఆగిపోయింది. ఇప్పుడు ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. మా పేర్లను తొలగించి, ప్రస్తుతం ఉన్న నాయకుల అనుచరులకు ఇస్తారని ప్రచారం సాగుతోంది.    

- ఈరమ్మ, వి.కొత్తకోట


ఇస్తారో.. ఇవ్వరో..

రెండో విడతలో భూపంపిణీ చేస్తామని పేర్లు రాసుకున్నారు. నెల రెండు నెలల్లో భూ పంపిణీ చేస్తారనే ముందు ఎన్నికల కోడ్‌ రావటంతో పంపిణీ నిలిపి వేశారు. మూడేళ్లు అయిపోయ ఇంక ఇస్తారో ఇవ్వరో తెలీదు. 

 - లక్ష్మి, ఆర్‌ కొట్టాల


అప్పుల్లో ఉంటే నోటీసులా..

పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన రైతులు అప్పులపాలయ్యారు. ఇప్పుడు ఒక్కొక్కరు రూ.80 వేలు చెల్లించాలని నోటీసులు జారీ చేయటం సరికాదు. ఎస్సీలకు పూట గడవటమే గగనం. అలాంటిది కంతులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు..? 

- ఎంబీ చెన్నరాయుడు, సీపీఐ నాయకుడు


వసూలు చేయొద్దు..

ఎస్సీ కార్పొరేషన ద్వారా నాలుగేళ్ల క్రితం మండలంలోని వివిధ గ్రామాల ఎస్సీ రైతులకు భూమి పంపిణీ చేశారు. భూములు తీసుకున్నప్పటి నుంచి పంటలు సరిగానే పండక రైతులు అప్పుల పాలు అయ్యారు. బడా బడా కంపెనీలకు వేల కోట్లు రుణ మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు, ఎస్పీలకు ఎందుకు రుణమాఫీ చేయకూడదు. ఒక్కరితో కూడా కంతులు వసూలు చేయరాదు.

- ఈరప్ప,  దండోర నాయకుడు, వి.కొత్తకోట

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST