ఖాళీ కుర్చీల ప్లీనరీ

ABN , First Publish Date - 2022-06-29T05:56:11+05:30 IST

వైసీపీ జిల్లాస్థాయికి జనం కరువయ్యారు. ఆఖరుకు డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించారు. కొందరు మహిళలు కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోతూ కనిపించారు.

ఖాళీ కుర్చీల ప్లీనరీ

మధ్యలోనే వెనుదిరిగిన మహిళలు

డ్వాక్రా సంఘాల సభ్యుల తరలింపు 

రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభం 

గంటలోనే ముగింపు 


పుట్టపర్తి, జూన 28: వైసీపీ జిల్లాస్థాయికి జనం కరువయ్యారు. ఆఖరుకు డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించారు. కొందరు మహిళలు కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోతూ కనిపించారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచు ప్లీనరీ ఎంత చప్పగా సాగిందో. విమర్శలతో కార్యక్రమం ముగించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రశాంతి గ్రామం క్రికెట్‌ గ్రౌండ్‌లో వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీని నిర్వహించారు. ప్లీనరీ ఆద్యంతం ప్రతిపక్ష పార్టీ టీడీపీని విమర్శంచేందుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. స్కూల్‌ లీడర్‌గా గెలవలేని లోకేశను మంత్రిని చేస్తే మంగళగిరి ప్రజలు దారుణంగా ఓడించారన్నారు. మాటలు పలకలేని నత్తివాడు లోకేశ పాదయాత్ర చేసినా, తిక్కోడు పవన కల్యాణ్‌ బస్సుయాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీయాత్ర చేసినా.. జగన జైత్రయాత్రను ఆపలేరన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ.. 2 గంటలు ఆలస్యమైంది. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను తరలించారు. రెండు గంటలు నిరీక్షించిన మహిళలు సదస్సు ప్రారంభం కావడం ఆలస్యమవడంతో ముందుగానే వెళ్లిపోయారు. మరికొంతమంది కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. నాలుగు గంటలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తర్వాత గంటలోనే సదస్సు ముగించారు. సదస్సుకు ఇనచార్జి మంత్రి జయరాం, ధర్మవరం ఎమ్యెల్యే కేతిరెడ్డి, హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఖాళీ కుర్చీల నడుమ ప్లీనరీ చప్పగా సాగింది. సదస్సులో బయటకు వెల్లిపోతున్న వారిని కూర్చోవాలంటూ బతిమాలటం కనిపించింది. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్యెల్యేలు దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశరెడ్డి, సిద్దారెడ్డి, ఎమ్యెల్సీ ఇక్బాల్‌, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ మాధవరెడ్డి, కన్వీనర్‌ రంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:56:11+05:30 IST