పేదల స్థలాలు... పెద్దలపాలు..!

ABN , First Publish Date - 2021-11-22T06:19:39+05:30 IST

నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలపై పెద్దలు, రాజకీయ దళారుల కన్ను పడింది. అధికారులతో కుమ్మక్కై పేదల స్థలాలను వశం చేసుకుని, భవంతులు కట్టుకుంటున్నారు.

పేదల స్థలాలు... పెద్దలపాలు..!

పట్టణంలో ప్రభుత్వ స్థలాల క్రయవిక్రయాల జోరు..

రూ.లక్షలు గడిస్తున్న రాజకీయ దళారులు

కళ్యాణదుర్గం, నవంబరు 21:  నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలపై పెద్దలు, రాజకీయ దళారుల కన్ను పడింది. అధికారులతో కుమ్మక్కై పేదల స్థలాలను వశం చేసుకుని, భవంతులు కట్టుకుంటున్నారు. పేదలు మాత్రం పూరి గుడిసెల్లోనే ఉంటున్నారు. పేదలను ఆదుకునేందుకు 2010లో పట్టణ సమీపంలోని ఐదుకల్లు రోడ్డు, బ్రహ్మ య్య ఆలయ సమీపంలో గరుడాపురం, కళ్యాణదుర్గం రెవెన్యూ గ్రా మాల పరిధిలోని సర్వేనెంబర్లు 69, 70, 420లో 56ఎకరాల భూమిని రూ.56లక్షలతో కొనుగోలు చేసి, సుమారు 2,050 మంది పేదలకు 2010, 2012లో రెండు విడతలుగా రెండున్నర సెంట్ల ప్రకారం స్థలాలను కేటాయించారు. అర్హత గల నిరుపేదలకు మాజీ మంత్రి ఎన. రఘువీరారెడ్డి చేతులమీదుగా పట్టాలు పంపిణీ చేశారు. 1998లో బళ్లారిరోడ్డు సమీపంలో సర్వేనెంబరు 111, 114లో పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేశారు.  ఆ స్థలాల్లో  కొంతమంది  పేదలు మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. వాటికి క్రమేణా విలువ పెరగడంతో రాజకీయ దళారుల కన్నుపడింది. పేదల బలహీనతలను ఆసరాగా తీసుకున్న రాజకీయ దళారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుమ్మక్కై ఓ పట్టాకు రూ.లక్ష అందజేసి, స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన స్థలాలకు అగ్రిమెంట్‌ చేసుకుని, లబ్ధిదారులకు సంబంధం లే కుండా రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ ధనవంతుడు సుమారు 50 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి, ఏకంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో ఇంటి పట్టాలను తారుమారు చేసి, పెద్దపెద్ద భవంతులను నిర్మించి, అద్దెకు ఇచ్చినట్లు పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. నిరుపేదలు వారికిచ్చిన స్థలాల్లో బేస్‌మెంట్‌ వేసుకున్నారు. మరికొందరికి పక్కా గృహాలు మంజూరుకాకపోవడంతో స్థలాలను అలాగే ఉంచుకున్నారు. వీటిపై కన్నేసిన దళారులు.. మునిసిపల్‌ అధికారులతో కుమ్మక్కై ఆ స్థలాలపై  బినామీ పేర్లతో ఇంటి నిర్మాణపు అనుమతులు పొంది, దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు పట్టణంలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆ స్థలాలను ధనవంతులకు విక్రయించి, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన ధనవంతులు వారికున్న రాజకీయ పలుకుబడితో దర్జాగా భవంతులు నిర్మించుకుంటున్నారు. ఈ తతంగం మునిసిపల్‌  అధికారుల కళ్లెదుటే సాగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.


స్పెషల్‌ డ్రైవ్‌లు చేసినా ఫలితం శూన్యం

అత్యంత విలువ గల స్థలాలు పేదలకు కేటాయించడంతో వాటిపై రాజకీయ దళారుల కన్ను పడింది. అప్పటి రెవెన్యూ అధికారుల మాయాజాలంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఖాళీ స్థలాలను వదులుకున్నారు. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది, దళారులు కుమ్మక్కై ఖాళీ స్థలాలను ధనవంతులకు విక్రయిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని 2012లో పెద్దఎత్తున దుమారం రేగింది. స్థలాల కేటాయింపులో అనర్హులకే పెద్దపీట వేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇందుకు స్పందించిన అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విచారణకు ఆదేశించారు. దీంతో మొదటిసారి అదే ఏడాదిలో ఇతర  రెవెన్యూ డివిజన తహసీల్దార్లు, డీటీలతో సర్వే చేయించినా స్పష్టత రాలేదు. ఇదే తరహాలో 2015, 2017లో మరోసారి కళ్యాణదుర్గం రెవె న్యూ డివిజన పరిధిలోని 11 మండలాల తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలతో సమగ్ర సర్వే నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వాస్తవాలు వెలికి తీసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నివేదికను బహిర్గతం చేయలేకపోయారు. దీంతో నిరాశ్రయులకు ఏళ్ల తరబడి నిరాశే మిగులుతోంది. అర్హతగల పేదలకు అందజేసిన ఇంటి స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీ నిర్ధారణలో రెవెన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శించడంతో పేదల స్థలాలు పెద్దలపాలయ్యాయని స్పష్టమవుతోంది.


వైసీపీ నాయకుల హల్‌చల్‌

బళ్లారిరోడ్డులో వెలసిన రామస్వామి కాలనీలో వైసీపీ నాయకులు.. పేదలకు సంబంధించిన బేస్‌మట్టాలను తొలగించి, కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు లబోదిబో మంటున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ ఏర్పాటు ముసుగులో బేస్‌మట్టాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పదుల సంఖ్యలో పేదలకు సంబంధించిన స్థలాలను కబ్జాచేయడంతో అర్హతగల పేదలు.. వైసీపీ నాయకుల తీరుపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ పోలీస్‌ స్టేషనలో ఆరుగురు వైసీపీ నాయకులపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఇదివరకే ఆయా స్థలాల్లో పెద్దపెద్ద భవంతులను నిర్మించుకుని, అద్దెకు ఇచ్చారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో కొం దరు వైసీపీ నాయకులు దందాలకు పాల్పడుతూ పేదలు చేపట్టిన ఇంటి నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నరనే విమర్శలు లేకపోలేదు. పేదలు మున్సిపాలిటీ పరిధిలో పునాదులు, నిర్మాణపు పనులు ప్రారంభిస్తే వాటిని తాత్కాలికంగా నిలుపుదలచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల స్థలాలపై బోగస్‌ ఇంటిపట్టాలు పుట్టిస్తూ నిర్మాణాలను అడ్డుకుని, లక్షలాది రూపాయాలు దండుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తతంగం రెవెన్యూ, పోలీస్‌ అధికారుల దృష్టికి వచ్చినా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2021-11-22T06:19:39+05:30 IST