పుష్కర కాలువ మట్టి తరలింపులో.. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు

ABN , First Publish Date - 2022-01-21T06:13:49+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పుష్కర కాలువ మట్టి తరలించి ఆ కాల్వను ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరుడు, సినీనటుడు రవితేజ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పుష్కర కాలువ మట్టి తరలింపులో..  జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు

  • ఎఫ్‌ఐఆర్‌లో సినీనటుడు రవితేజ తల్లి పేరు కూడా..
  • కాలువ ధ్వంసంపై ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు
  • తాత్సారం చేసి రెండురోజులకు కేసు నమోదు చేసిన జగ్గంపేట పోలీసులు

జగ్గంపేట, జనవరి 20: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పుష్కర కాలువ మట్టి తరలించి ఆ కాల్వను ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరుడు, సినీనటుడు రవితేజ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు స్థానిక ఇరిగేషన్‌ శాఖ అధికారులు రెండురోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా జగ్గంపేట పోలీసులు తాత్సారం చేసి చివరికి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట మండలంలో పుష్కర కాలువను ఏర్పాటు చేశారు. ఈ కాల్వ జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో దొమ్మవాని గుట్ట కొండ మీదుగా వెళ్తోంది. ఆ కొండపై సర్వే నెంబర్లు 108, 124 పేరు మీద భూమి ఉంది. వీటిలో ప్రభుత్వానికి, కొంతమంది రైతులకు, సినీనటుడు రవితేజ తల్లి భూపతి రాజా రాజ్యలక్ష్మికి భూములు ఉన్నాయి. ఈ కొండతోపాటు పుష్కర కాల్వను 600మీటర్ల పొడవు వరకు అక్రమంగా తవ్వేశారు. దీంతో కాల్వ పూర్తిగా ధ్వంసమైంది. ఈ వ్యవహారంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరుడు కాపవరపు సంజయ్‌ పాత్ర ప్రధానంగా ఉంది. దీనిపై స్థానిక ఇరిగేషన్‌ అధికారులు పోలీసులకు రెండురోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. కానీ జగ్గంపేట పోలీసులు కేసు నమోదుకు వెనుకంజ వేశారు. ఇందులో వైసీపీ నేత సంజయ్‌ పాత్ర ఉండడంతో ఇరిగేషన్‌ అధికారులకు బెదిరింపులు వచ్చాయి. ఆయన పేరు తొలగించాలని కొందరు తమను బెదిరించినట్టు వారు చెప్తున్నారు. ఎట్టకేలకు ఇరిగేషన్‌ అధికారుల పట్టుతో బుధవారం రాత్రి 11 గంటలకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ లక్ష్మికాంతం తెలిపారు. రామవరంలోని పుష్కర కాలువను అక్రమంగా తవ్వి మట్టిని తరలించుకుపోయారని పుష్కర ఏఈ యర్రంశెట్టి జగదీష్‌ తెలిపారు. తమ పరిధిలోని కాలువను అక్రమంగా 20వేల క్యూబిక్‌మీటర్లు మట్టిని తరలించారని, దీని విలువ రూ.95లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు.

జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని దొమ్మవానిగుట్ట కొండ మీదుగా ఉన్న 108, 124 సర్వే నెంబర్లలో సినీనటుడు రవితేజ తల్లి భూపతి రాజా రాజ్యలక్ష్మికి భూమి ఉంది. ఈ గట్టుపై ఉన్న మట్టిని పూర్తిస్థాయిలో బయటకు తరలించుకోవడానికి అనుమతి ఇవ్వాలని గతంలో తహసీల్దార్‌ వై.సరస్వతికి ఆమె అర్జీ పెట్టుకోగా అది పెండింగ్‌లో ఉంది. దీన్ని అదునుగా చేసుకొని కొన్నాళ్లకు కొందరు ఆ కొండపై ఉన్న మట్టిని తరలించడం ప్రారంభించారు. ఆ తర్వాత పుష్కర కాల్వలోని మట్టిని కూడా తరలించేశారు. ఇందులో వైసీపీ నేత కాపవరపు సంజయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఆ కాల్వ ధ్వంసమైనట్టు ఇరిగేషన్‌ అధికారులు ఆయనపైనా, గతంలో అర్జీ పెట్టుకున్నందున రవితేజ తల్లిపైనా ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-01-21T06:13:49+05:30 IST