వైసీపీ నాయకుడి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-05-16T05:37:31+05:30 IST

హత్యకు గురైన అధికారి పార్టీ నేత వర్రే నాగేంద్ర భౌతిక కాయానికి అంత్యక్రియలు ఆదివారం ముదినేపల్లిలో జరిగాయి.

వైసీపీ నాయకుడి అంత్యక్రియలు
నాగేంద్ర అంతిమ యాత్ర లో పాడె మోస్తున్న కానిస్టేబుల్‌

తొలి రోజు దహన సంస్కారాలకు ఒప్పుకోని బంధువులు 

ఎమ్మెల్యే, ఎంపీపీలను నిలువరించిన అధికారులు 

 అంత్యక్రియలకు తొందర పెట్టిన పోలీసులు

ఏలూరు/ముదినేపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): హత్యకు గురైన అధికారి పార్టీ నేత వర్రే నాగేంద్ర భౌతిక కాయానికి అంత్యక్రియలు ఆదివారం ముదినేపల్లిలో జరిగాయి. పటిష్ట మైన పోలీసుల బలగాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకు న్నారు. శుక్రవారం రాత్రి ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నాగేంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి హతుడి భౌతికకాయం శనివారం రాత్రికే ముదినేపల్లికి చేరుకున్నది. అయితే అదే రోజూ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా బంధువులు, కుటు ంబీకులు అందుకు అంగీకరించలేదు. తన భర్తను, కుమారుడు హత్యకు కారకులైన వారిని తమ ముందుకు తీసుకురావాలని హతుడి భార్య, తల్లి శనివారం రాత్రి ముదినేపల్లిలో బైఠాయించారు. తెల్లవారితే దళితసంఘాల నాయకులు ముదినేపల్లికి భారీగా తరలిరావచ్చన్న సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో పోలీసులు వారితో జరిపిన చర్చలుకూడా విఫలం అయ్యాయి. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారు జాము నుంచే ముదినేపల్లిలో పోలీస్‌ బలగాలు మొహరించాయి. దళిత సంఘాలు ఆందోళన దిగే ముందే అప్రమత్తం అవుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు మృతదేహం తరలింపుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసులు దగ్గర ఉండి మరీ అంతిమ సంస్కారాలు నిర్వహింపజేశారు. ఈ అంతిమ యాత్రలో కానిస్టేబుల్‌ బీవీరావు కూడా పాల్గొని పాడె మోశారు. మృతుడు నాగేంద్ర స్నేహితుడు కావడం వల్లనే కానిస్టేబుల్‌ ఇలా పాడె మోశారని చెబుతున్నారు.

 ఎమ్మెల్యే, ఎంపీపీలను రావద్దన్న పోలీసులు 

హతుడు నాగేంద్ర మృతదేహం వద్దకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆదివారం ఉదయం బయలుదేరారు. అయితే ముదినేపల్లిలో పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించిన పోలీసులు ఆ సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు అందజేశారు. ఆ నాయకులు ముదినేపల్లికి వస్తే గ్రామస్తులను అదుపు చేయలేమని నాయకులకు భద్రత కల్పించలేమని పోలీసులు వారించడంతో మృతదేహం వద్దకు రాకుండానే ఆ నాయకులు వెనుదిరిగారు. ఈ విషయం తెలుసు కున్న కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు కాకపోతే గడపగడపకు అయినా రాకపోతారా..... అప్పుడు చూసుకుందాం!  అంటూ నాయకులను హెచ్చరించినట్లుగా సమాచారం.  


Updated Date - 2022-05-16T05:37:31+05:30 IST