ఆ మాజీ ఎమ్మెల్యే పేరు వింటే వైసీపీ పెద్దలకు ముచ్చెమటలు!?

ABN , First Publish Date - 2021-01-25T04:23:08+05:30 IST

ఆ మాజీ ఎమ్మెల్యే పేరు వింటే వైసీపీ పెద్దలకు ముచ్చెమటలు!?

ఆ మాజీ ఎమ్మెల్యే పేరు వింటే వైసీపీ పెద్దలకు ముచ్చెమటలు!?

ఆ మాజీ ఎమ్మెల్యే పేరు వింటే అధికార వైసీపీ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ నాయకుడు పేల్చే మాటల బాంబులు చూసి వారు ఉలిక్కిపడుతున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉండొచ్చన్న ప్రచారంతో కలవరపడుతున్న ఫ్యాన్‌ పార్టీ నాయకులకు ఆ లీడర్‌ చుక్కలు చూపిస్తున్నారట. ఇంతకీ అధికార పార్టీ నేతలను పరేషాన్‌ చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన అంటే అంతగా వారు ఎందుకు భయపడుతున్నారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


టీడీపీలోకి వెళ్లిపోతారా..!?

ఏపీలో అధికార వైసీపీలో ఉన్న దళిత నాయకులు ప్రతిపక్ష టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దళితులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఓవైపు చెబుతూనే..మరోవైపు ఆ సామాజికవర్గాలపై దాడులు జరుగుతుండటం వారిలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తోంది. కొందరు వైసీపీ నేతలు దళితులపై అమానవీయంగా ప్రవర్తించడం ఇటీవల తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు దళిత నాయకులకు జగన్‌ పార్టీలో పదవులు ఇవ్వకపోగా..చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో దళిత లీడర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఇందుకు ఊతమిచ్చేలా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 


అనుచరులతో చర్చలు..

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అది రహస్యంగా కాదు..అందరికీ తెలిసేలా తన ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఒంగోలులోని తన నివాసంలో అనుచరులతో డేవిడ్ రాజు  సమావేశం నిర్వహించారు. అధికార పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. పార్టీ పదవుల్లోనూ అవకాశాలు ఇవ్వలేదని ఆయన వాపోయారట. దాంతో తిరిగి టీడీపీలో చేరేందుకు అనుచరులతో చర్చించారు.


జంపింగ్‌లు ఇలా..

డేవిడ్‌రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 1999లో టీడీపీ నుంచి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు టీడీపీ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన డేవిడ్ రాజు ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఎర్రగొండపాలెం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 30 వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో డేవిడ్ రాజు హవా నడిచింది. 2019 ఎన్నికల్లో డేవిడ్ రాజుని పక్కన  పెట్టిన టీడీపీ... ఎర్రగొండపాలెం టిక్కెట్ బూదాల అజితారావుకి ఇచ్చింది. తనకు టిక్కెట్ ఇవ్వలేదన్న మనస్తాపానికి గురైన డేవిడ్ రాజు వైసీపీలో చేరారు.


ఆశపడి చివరికి నిరాశ!

2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వం చేపట్టింది. దాంతో తనకు వైసీపీలో భవిష్యత్ ఉంటుందని ఆశ పడ్డ డేవిడ్ రాజుకు నిరాశ తప్పలేదు. ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఈ పరిణామాలతో కొంతకాలంగా ఆయన అధికార పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ అంటిముట్టన్నట్లుగా వ్యవహిస్తున్నారట. అయితే ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బూదాల అజితారావు గత ఎన్నికల్లో ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయన ఎర్రగొండపాలెం వైపు కన్నెత్తి చూడలేదంటారు. దాంతో టీడీపీలో చేరి ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ పదవి దక్కించుకోవాలని డేవిడ్ రాజు పావులు కదుపుతున్నారు.


బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..!?

ఈ క్రమంలో ఒంగోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌.. డేవిడ్ రాజు ఇంట్లో ఆయనతో భేటి అయ్యారు. గతంలో టీడీపీ అభివృద్దికి పనిచేశాననీ, తన వల్ల మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగాయనీ టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్దమని డేవిడ్ రాజు ప్రకటించేశారు.. అదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. చంద్రబాబు వస్తేనే ఏపీలో తిరిగి ప్రశాంతత వస్తుందని బాహాటంగానే అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.


ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో..!

అయితే అధికార పార్టీకి చెందిన సీనియర్ దళిత నాయకుడు డేవిడ్ రాజు ప్రభుత్వంతో పాటు పార్టీలో దళితులకు గౌరవం దక్కటం లేదని విమర్శలు చేయడంతో.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని వైసీపీ నేతల్లో కలవరం మొదలైందట. ప్రస్తుతం రాష్ర్టంలో దళితులపై జరుగుతున్న దాడులకు తోడు దళిత నేత పార్టీని వీడేందుకు యత్నించడం.. సంధి చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవటంతో.. ఇది ఎంతవరకూ వెళుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుందట. డేవిడ్‌ రాజు బాటలో మరికొందరు దళిత నాయకులు ఉన్నారన్న సమాచారంతో వారిలో మరింత గుబులు రేగుతుందట. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.



Updated Date - 2021-01-25T04:23:08+05:30 IST