ఎమ్మెల్సీ కారులో డ్రైవర్‌ డెడ్‌బాడీ!

Published: Sat, 21 May 2022 02:50:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎమ్మెల్సీ కారులో డ్రైవర్‌ డెడ్‌బాడీ!

వైసీపీ నేత ఉదయ భాస్కర్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

మృతదేహాన్ని తన కారులోనే తీసుకొచ్చిన ఎమ్మెల్సీ

రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఫోన్‌లో సమాచారం

అంతకుముందే డ్రైవర్‌ను పిలిపించుకున్న ఎమ్మెల్సీ

మూడు గంటల వ్యవధిలోనే మృతుడిగా మారిన డ్రైవర్‌

రూ.20 వేల బాకీపై పలుమార్లు ఫోన్‌చేసి బెదిరింపులు

ఎమ్మెల్సీయే చంపించారంటున్న బాధితుడి కుటుంబం

ఆయన అక్రమాలు తెలిసినందునే చంపేశారని ఆరోపణ

రోడ్డు ప్రమాదం ‘కథ’పై అనేక అనుమానాలు

అలాంటి దాఖలాలే లేవంటున్న పోలీసు వర్గాలు

ఎమ్మెల్సీని అరెస్టు చేశాకే... పోస్టుమార్టం

ఆందోళనకు దిగిన మృతుడి భార్య, తల్లిదండ్రులు


కాకినాడ, మే 20  (ఆంధ్రజ్యోతి): ఆయన అధికార పార్టీ ఎమ్మెల్సీ! తన దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున దళిత యువకుడిని తన దగ్గరికి పిలిపించుకున్నారు. తిరిగి... తానే కారులో ఆ డ్రైవర్‌ను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేశారు. కానీ... నిర్జీవంగా! అదేమంటే... రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆ ఎమ్మెల్సీ... అనంత ఉదయ భాస్కర్‌! చనిపోయింది... ఆయన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం! ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుడి కుటుంబ సభ్యులు, ఇతర వర్గాల సమాచారం ప్రకారం.... 


తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ వద్ద కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం (23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు వారాల కిందట బైక్‌పై నుంచి పడిపోవడంతో ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. గురువారం  తన పుట్టినరోజు కావడంతో ఉదయ భాస్కర్‌ కాకినాడలోని స్నేహితులతో విందు చేసుకున్నారు. అదే సమయంలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.... ‘‘సుబ్రహ్మణ్యం నాకు రూ.20 వేలు బాకీ ఉన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు. డబ్బులివ్వకుంటే ఊరుకోను’’ అని హెచ్చరించారు. కాసేపటికి... మణికంఠ అనే తన స్నేహితుడిని సుబ్రహ్మణ్యం ఇంటికి పంపించి, అతడిని కాకినాడ కొండయ్యపాలెం వద్దకు తీసుకురావాలని ఆదేశించాడు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యాన్ని మణికంఠ తీసుకెళ్లారు. మూడు గంటలు గడిచాక... చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ ఫోన్‌ చేశారు. మీవాడికి యాక్సిడెంట్‌ అయ్యింది. స్పృహలో లేడు... అని చెప్పారు. ఆ తర్వాత అరగంటకు ఫోన్‌ చేసి... భానుగుడి జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్దకు రమ్మనడంతో మేం అక్కడికి వెళ్లాం. ఉదయభాస్కర్‌ కారు వెనుక సీటులో సుబ్రహ్మణ్యం చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆస్పత్రి వైద్యులు సుబ్రహ్మణ్యాన్ని పరీక్షించి, చనిపోయాడని చెప్పారు’’ అని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
సుబ్రహ్మణ్యం మృతిపైటీడీపీ నిజనిర్ధారణ కమిటీ

నేడు కాకినాడలో పర్యటన

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ డ్రైవర్‌ మృతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం కాకినాడలో పర్యటించే ఈ కమిటీలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, పార్టీ నేతలు ఎమ్మెస్‌ రాజు, పిల్లి మాణిక్యాలరావు సభ్యులుగా ఉన్నారు. 


అనంతబాబును అరెస్టు చేయాలి: లోకేశ్‌

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం తల్లి, భార్యతో మాట్లాడిన ఆయన... న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. హత్యపై సీబీఐ విచారణ వేయాలని లోకేశ్‌ ట్విటర్‌లో కోరారు. హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాక్షస క్రీడకు అద్దం పడుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా.. పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ ఘటనను మరో ప్రకటనలో టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్‌సాగర్‌ ఖండించారు. 


అరెస్ట్‌ చేయాలి: రామకృష్ణ

కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కాగా, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కి వ్యతిరేకంగా ఏజెన్సీ వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీడీపీ, బీజేపీ నాయకులు ఉదయభాస్కర్‌ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం, రాజవొమ్మంగి, మోతుగూడెంలో టీడీపీ నాయకులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు.  

ఎమ్మెల్సీ కారులో డ్రైవర్‌ డెడ్‌బాడీ!

ఇంటి వద్ద ఆందోళన... 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని నేరుగా ఆయన నివాసం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘‘గురువారం రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లిన వ్యక్తిని నిర్జీవంగా అప్పగిస్తారా? డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తారా?’’ అంటూ ఉదయ భాస్కర్‌ను సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు నిలదీశారు. అయితే... జరిగిందేదో జరిగిపోయిందని, ఎంతోకొంత పరిహారం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్సీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. పరిస్థితి చేజారి పోతుండటంతో మృతదేహాన్ని కారులోనే వదిలేసి... ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీయే తన కుమారుడిని చంపేశారని మృతుడి భార్య అపర్ణ, తల్లి రత్నం ఆరోపించారు. ‘‘ఇది ఉదయ భాస్కర్‌ చేయించిన హత్య. ఆయన అక్రమాలన్నీ నా భర్తకు తెలుసు. అందుకే చంపేశారు’’ అని అపర్ణ రోదిస్తూ చెప్పారు. ఆమె ప్రస్తుతం ఐదునెలల గర్భిణి.


చంపేశారా...

‘సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు’ అని ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ చేస్తున్న వాదనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. కానీ... అక్కడ శుక్రవారం రాత్రి యాక్సిడెంట్‌ అయిన దాఖలాలే లేవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లిన కారు ఎక్కడా దెబ్బతినలేదు. రోడ్డు ప్రమాదం జరిగితే ముందు పోలీసులకు సమాచారం అందించాలి. అంబులెన్స్‌ను పిలవాలి. అవేవీ జరగలేదు. పైగా... తమ వద్దకు ఎలాంటి యాక్సిడెంట్‌ కేసు రాలేదని సదరు ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఇదంతా ఒకెత్తయితే... రోడ్డు ప్రమాదం మెడికో లీగల్‌ కేస్‌. పోలీసులకు సమాచారం అందించి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి... అక్కడ పోస్టుమార్టం పూర్తయ్యాకే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఇవేవీ చేయకుండా... అర్ధరాత్రి ఎమ్మెల్సీయే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో మృతుడి ఇంటికి తీసుకెళ్లడంతో అనుమానాలు మరింత పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎమ్మెల్సీ జాడ కూడా తెలియలేదు. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. మధ్యాహ్నం 3.30 గంటల కు పెడతానన్న ప్రెస్‌మీట్‌నూ ఆయన రద్దు చేశారు.  


కిందపడేసి తొక్కేశారా...

వైద్యులు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ప్రాథమికంగా పరిశీలించారు. ఇది అనుమానాస్పద మృతేనని, రోడ్డు ప్రమాదం కాదని ఒక అంచనాకు వచ్చారు. మృతుడి కాళ్లు, పెదాలపై గాయాలున్నాయి. శరీరం కందిపోయి ఉంది. తలపైనా రెండుచోట్ల దెబ్బలున్నాయి. కిందపడేసి బలంగా తొక్కడంవల్లే మరణించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని ఉంచిన కారు సీటులో బురద, ఇసుక పడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో... కాకినాడ బీచ్‌ వైపు తీసుకెళ్లి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.