అధికారం.. కామాంధకారం

ABN , First Publish Date - 2021-09-03T06:25:25+05:30 IST

వైసీపీ నాయకుల కామ కలాపాలు..

అధికారం.. కామాంధకారం
కైకలూరులో ట్రాక్టర్‌పై అర్ధనగ్నంగా ఉన్న మహిళలతో రాసలీలలు

కృష్ణా జిల్లాలో పెచ్చుమీరుతున్న వైసీపీ నాయకుల కామ కలాపాలు..

మైలవరంలో ఇళ్ల పట్టాల ఆశచూపి మహిళలకు ఓ ‘ఇన్‌చార్జి’ ఎర

చెప్పినట్టు వింటే పట్టా ఇస్తానంటూ మరో నాయకుడి బరితెగింపు

పెడనలో ఓ నేతను రోడ్డుపైనే కొట్టిన మహిళ

కలిదిండి, కైకలూరు మండలాల్లో నగ్న నృత్యాలు

మహిళల దుస్తులు విప్పించి డ్యాన్సులు

అందరూ చూస్తుండగానే అసభ్య ప్రవర్తన


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): 


ఒకడు... జగనన్న ఇళ్ల పట్టాలు కావాలంటే తనకు లొంగిపోవాలంటాడు. ఆమెతో పాటు ఆమె బంధువులకు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని లోబర్చుకుంటాడు. తన కోరిక తీర్చుకుంటాడు.


ఇంకొకడు.. పచ్చటి సంసారంలో చిచ్చు పెడతాడు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి మహిళను సొంతం చేసుకుంటాడు. భర్తకు విషయం తెలిసి ఆమెను చావ బాదుతాడు. సాఫీగా సాగే సంసారం రోడ్డున పడుతుంది.


మరొకడు.. కృష్ణాష్టమి అని పేరు చెప్పి మహిళల దుస్తులు విప్పించి డ్యాన్సులు చేయిస్తాడు. నడిరోడ్డుపైనే ఈ తంతు నడిపిస్తాడు.


అధికారం చేతిలో ఉంది.. అధికారులు చెప్పింది చేస్తారు.. ఇంకేముంది కొందరు వైసీపీ నాయకులకు అంధకారం అలముకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. నిన్నటి వరకు గ్రావెల్‌, మట్టి, ఇసుక తవ్వకాలు, ఇళ్ల స్థలాల భూసేకరణ, సెటిల్‌మెంట్ల ద్వారా బాగానే వెనకేసుకున్న నాయకులు నేడు కామ కలాపాలకు తెరలేపారు. మండల, గ్రామస్థాయి నాయకులు ఇదే ఆదాయ వనరుగా మార్చుకుని జిల్లా పరువు తీస్తున్నారు. నిదర్శనాలివిగో.. 


ఇళ్ల పట్టాల ఆశచూపి.. 

మైలవరం నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి ఆయన అధికార పార్టీ తరఫున ఇన్‌చార్జి బాధ్యతలు వహిస్తున్నారు. జగనన్న ఇళ్ల పట్టాల మంజూరు నుంచి కొత్త పింఛన్ల వరకు ఆయన చెబితేనే పనవుతుంది. దీంతో పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి చుట్టూ తిరిగేవారు. వారిలో ఓ మహిళను.. ఇళ్ల పట్టా ఆశచూపి ఈ నాయకుడు లొంగదీసుకున్నాడు. తాను చెప్పినట్టు వినకపోతే పట్టా రాకుండా చేస్తానని బెదిరించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ నాయకుడికి లొంగిపోయింది. ఓ రోజు ఆమె భర్త ఇంటికి వచ్చే సమయానికి ఆ నాయకుడు ఆమెతో ఉన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త కత్తితో తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రి పాలై ప్రాణాలతో బయటపడింది. కేవలం ఈ ఒక్క మహిళ విషయంలోనే కాదు ఆ వైసీపీ నాయకుడు తన కార్యాలయానికి ఏదైనా పనిమీద వచ్చే మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని బెదిరించో.. ఆశపెట్టో లొంగదీసుకుంటాడని పేరు. దీంతో మహిళలు ఆయన కార్యాలయం వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. మైలవరం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులది ఇదే తీరు. 


బరితెగించి నగ్న నృత్యాలు

జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అశ్లీల నృత్యాల సంస్కృతి పెరిగిపోయింది. కృష్ణాష్టమి సందర్భంగా మూడు రోజుల క్రితం కైకలూరు నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులు అశ్లీల నృత్యాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వీటికోసం స్థానిక వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం గమనార్హం. కలిదిండి మండలంలోని వెంకటాపురం, సానారుద్రవరం, కైకలూరు మండలంలోని గోపవరం, తామరకొల్లు గ్రామాల్లో అశ్లీల నృత్యాల నిర్వహణ భారీగా సాగింది. మహిళలు, హిజ్రాలతో అర్ధనగ్నం గానూ.. నగ్నంగానూ బహిరంగంగా యథేచ్ఛగా నృత్యాలు చేస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరికి కొందరి అరెస్టు చూపించారు. 


వ్యభిచార గృహాల నిర్వహణ

ఇబ్రహీంపట్నం, కొండపల్లి, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాల నిర్వహణ వైసీపీ నేతల కనుసన్నల్లో సాగుతోంది. ముంబయి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ నగరంలో మంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ చోటా నాయకుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నారని, ఈయన ఆదాయం రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈయనతో పాటు నేర చరిత్ర ఉన్న ఓ అధికార పార్టీ కార్పొరేటర్‌ సైతం ఇదే దందాలో మునిగి తేలుతున్నాడు. పోలీసులకు ఎప్పటికప్పుడు మామూళ్లు వెళ్తుండటంతో ఈ నాయకుల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. 


లబ్ధిదారుల పాలిట కీచకులు

‘నీకు జగనన్న ఇళ్ల స్థలం ఇప్పిస్తా.. నీతోపాటు మీ బంధువులకూ ఇప్పిస్తా.. కానీ, నేను చెప్పినట్టు వినాలి..!’ మైలవరం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత తన వద్దకు ఇంటి పట్టా ఇప్పించమని వచ్చిన మహిళలకు పెట్టిన కండిషన్‌ ఇది. ఇతని తీరుతో విసిగిపోయిన వైసీపీ నాయకులు ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. 


పెడన నియోజకవర్గంలో ఓ గ్రామస్థాయి నాయకుడూ లబ్ధిదారుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నాడు. నెల కిందట ఓ మహిళ ఆ నాయకుడిని నడిరోడ్డుపైనే కొట్టడంతో అసలు నిజం బట్టబయలైంది. విషయం తెలిస్తే పార్టీ పరువు పోతుందని నాయకులు జోక్యం చేసుకుని వ్యక్తిగత గొడవ అని సరిపెట్టారు. 




Updated Date - 2021-09-03T06:25:25+05:30 IST