అక్కరమానిపై తిరుగుబావుటా

ABN , First Publish Date - 2022-08-14T06:42:49+05:30 IST

‘సమన్వయకర్తగా అక్కరమాని విజయనిర్మలే వుంటే వెలగపూడి రామకృష్ణబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయం.

అక్కరమానిపై తిరుగుబావుటా

తూర్పు వైసీపీలో ముసలం

ఆమె సమన్వయకర్తగా ఉంటే వచ్చే ఎన్నికల్లో వెలగపూడికి లక్ష మెజారిటీ ఖాయం

అన్నీ ఏకపక్ష నిర్ణయాలు

కార్పొరేటర్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదు

ఎమ్మెల్సీ వంశీకృష్ణను కలిసిన నేతలు


మద్దిలపాలెం, ఆగస్టు 13:

‘సమన్వయకర్తగా అక్కరమాని విజయనిర్మలే వుంటే వెలగపూడి రామకృష్ణబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయం. ఆమె పోటీ చేస్తే మేము పని చేయలేము. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే. కార్పొరేటర్ల అభిప్రాయాలతో ఆమెకు పనిలేదు. ఆమె అనుకున్నదే చేసుకుని పోతుంటే ఇక మేమెందుకు...’ అంటూ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ నాయకులు అసంతృప్తి రాగం ఆలపించారు. శనివారం శివాజీపాలెంలో పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేయర్‌ భర్త గొలగాని శ్రీనివాస్‌, జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ కార్పొరేటర్‌ అప్పారి శ్రీవిద్య భర్త గిరిబాబు, 13వ వార్డు కార్పొరేటర్‌ కెళ్ల సునీత భర్త సత్యనారాయణ, 16వ వార్డు కార్పొరేటర్‌ మొల్లి లక్ష్మి భర్త అప్పారావు, 17వ వార్డు కార్పొరేటర్‌ గేదెల లావణ్య భర్త నాగరాజు,  20వ వార్డు కార్పొరేటర్‌ నెక్కళ్ల లక్ష్మీ భర్త త్రినాథ్‌, 23వ వార్డు కార్పొరేటర్‌ గుడ్ల విజయసాయి భర్త సత్యారెడ్డి, 21వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మదుపాడ రవి, 22వ వార్డు అధ్యక్షుడు పీతల గోవింద్‌లు వంశీకృష్ణతో సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవికి తాము గుడ్ల విజయసాయి, అక్కరమాని రోహిణి పేర్లు ప్రతిపాదించగా...అక్కరమాని విజయనిర్మల పట్టించుకోకుండా కార్పొరేటర్‌ కోరుకొండ స్వాతి పేరును సూచించడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే తూర్పు నియోజకవర్గంలో అంతమంది మహిళా కార్పొరేటర్లు ఉండగా...విజయనిర్మలే ఒక్కరే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాఖీ కట్టడం ఏమిటని ప్రశ్నించారు. విజయనిర్మల విధానాలతో నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, ఇకపై ఆమెతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. ఆమె సమన్వయకర్తగా కొనసాగితే 2024 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో ఓటమి తప్పదన్నారు. కార్పొరేటర్లతో సమన్వయం లేకుండా సొంత నిర్ణయాలతో ముందుకువెళుతున్న అక్కరమానిని సమన్యయకర్త బాధ్యతల నుంచి తప్పించాలని వంశీని కోరారు. అక్కరమానిని తప్పించి మొల్లి అప్పారావుకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. కార్పొరేటర్ల అభిప్రాయాలు విన్న వంశీకృష్ణ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం పలువురు మాట్లాడుతూ అక్కరమాని విజయనిర్మల తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆమెతో కలిసి పని చేయలేమని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-14T06:42:49+05:30 IST