మూడేళ్లలో ఏం చేశారయ్యా..!?

ABN , First Publish Date - 2022-05-17T09:20:59+05:30 IST

గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. తమ ఇళ్లకు వస్తున్న వైసీపీ నేతలను ఈ మూడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటయ్యా..? అంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ‘‘గత మూడేళ్లుగా రోడ్లను

మూడేళ్లలో ఏం చేశారయ్యా..!?

రోడ్లు, పక్కా ఇళ్లు, తాగునీటి సౌకర్యం లేదు

అభివృద్ధి లేని సంక్షేమం ఎందుకు?

‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో వైసీపీ నేతలను నిలదీస్తున్న జనం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. తమ ఇళ్లకు వస్తున్న వైసీపీ నేతలను ఈ మూడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటయ్యా..? అంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ‘‘గత మూడేళ్లుగా రోడ్లను పట్టించుకోలేదు.. పక్కా గృహాలు ఇచ్చింది లేదు.. తాగునీటి సౌకర్యం కల్పించలేదు.. ఉపయోగం లేని పఽథకాలకు డబ్బులు ఖర్చు చేస్తూ అప్పులు చేయడం ఎందుకు..?’’ అంటూ ఒక సామాన్య మహిళ తిరువూరు ఎమ్యెల్యే రక్షణనిధిని ప్రశ్నించింది. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కోడూరు గ్రామంలో తిరువూరు ఎమ్యెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న సమయంలో కోట వరమ్మ మాట్లాడుతూ.. ‘ఎంతో అభివృద్ధి చేస్తారని వైసీపీకి ఓట్లు వేశాం.. మూడేళ్లుగా రోడ్లు మంజూరు లేదు.


పక్కా గృహాలు, తాగునీటి సౌకార్యలు, డ్రెయిన్లు లేవు.. ఎందుకూ ఉపయోగపడని సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమెందుకు?’ అని నిలదీసింది. అమ్మఒడి కోసం సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఎస్సీ కాలనీకి చెందిన బంక వనజ, కోట సావిత్రి, కంభంపాటి బేబీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని ఎమ్యెల్యే హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.


మా అమ్మను చూసైనా దయ కలగలేదా..?

‘మా అమ్మ ఈడిగ చిన్నమ్మకు 86 ఏళ్లు. రెండేళ్ల నుంచి ఆమె పింఛను రావడం లేదు. బియ్యం కార్డు మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మా అమ్మను చూసైనా మీకు దయ కలగడం లేదా?’ అంటూ కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామస్తుడు ఈడిగ ఈరన్నగౌడ్‌ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రశ్నించడం.. వైసీపీ శ్రేణులను నివ్వెరపరిచింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తన అనుచరులు, అధికారులతో కలసి సోమవారం విరుపాపురం వెళ్లారు. అక్కడ వృద్ధురాలైన తన తల్లికి వస్తున్న పింఛను తొలగించడం... బియ్యం కార్డు ఇవ్వకపోవడంపై ఈరన్నగౌడ్‌ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ‘మాకు సెంటు భూమి కూడా లేదు. మా పేరిట ఐదెకరాల భూమి ఉన్నట్టు ఆన్‌లైన్‌లో చూపుతోంది. దీన్ని సరిచేసి.. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదం’టూ అదే గ్రామానికి చెందిన గోపాల్‌, భార్య ఈరమ్మ ఎమ్మెల్యేకి మొర పెట్టుకున్నారు. ‘జెడ్పీ ఉన్నత  పాఠశాలలో తాను కొన్నాళ్ల పాటు ఆయాగా విధులు నిర్వహించానని... తనకు రూ.70వేలు జీతం బకాయిలు రావలసి ఉంద’ని మరియమ్మ అనే మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చింది.


ఎమ్మెల్యే స్పందిస్తూ.. వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా... ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం వైసీపీ ప్రచారంలా మారింది. ఆదోని మండలం విరుపాపురంలో జరిగిన కార్యక్రమంలో అధికారుల కంటే పార్టీ కార్యకర్తలే అధికంగా ఉన్నారు. పార్టీ జెండాలే అధికంగా కనిపించాయి. ఈ ప్రచారానికి భారీగా పోలీసు బందోబస్తు ఉండడం గమనార్హం. 


సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు?

కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఎందుకయ్యా అంటూ ఆయనను పలువురు నిలదీశారు. కడప నగరం రెండో డివిజన్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా స్థానిక కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సమయంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. రోడ్లు సక్రమంగా లేవని, కాలువలు సరిగా లేక రోడ్లపైనే డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయినా కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించడం లేదని సమస్యలు ఏకరువు పెట్టారు. కొందరికి పింఛన్లు మంజూరు కాలేదని చెప్పారు. విద్యుత్‌ కోతలపైనా ఉప ముఖ్యమంత్రిని నిలదీశారు. సంబంఽధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిస్కరించాలని అంజాద్‌ బాషా సూచించారు. జమ్మలమడుగు పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


తాతయ్యగుడి వీధి శివార్లలో నలుగురు మహిళలు అధిక ధరల గురించి ప్రశ్నించారు. ఏడాది నుంచి వితంతు పెన్షన్‌ రావడం లేదని ఓ మహిళ వాపోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ పెంచడం వలన ధరలు పెరిగాయని చెప్పారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలపై పలువురు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ నిత్యావరసర ధరల పెరుగుదల పాపం మోదీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పారు.

Updated Date - 2022-05-17T09:20:59+05:30 IST