వైవీ ఆశలు గల్లంతు

ABN , First Publish Date - 2021-07-18T07:06:02+05:30 IST

వైవీ సుబ్బారెడ్డి..

వైవీ ఆశలు గల్లంతు
రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు సాధించిన వారు వరుసగా కృష్ణచైతన్య, సత్యనారాయణరెడ్డి, కాకుమాను రాజశేఖర్‌, జూపూడి, సుప్రజ, సుభాన్‌బీ, జిల్లాస్థాయి పదవులకు ఎంపికైన మాదాసి వెంకయ్య, రావి పద్మావతి, మీనాకుమారి, వెంకటసుశీల

ఆశాభంగం

పది మందికే నామినేటెడ్‌ పదవులు

వైవీకి మళ్లీ టీటీడీ చైర్మన్‌ పదవే

మార్కాపురం డివిజన్‌కి మొండిచేయి

సగం నియోజకవర్గాల్లో పదవుల ఊసేలేదు 

కీలకనేతల సిఫార్సు ఉన్నవారికే పీఠం

మహిళలకు పెద్దపీట పేరుతో కొందరు నేతలకు చిక్కులు 

ఒంగోలు, కొండపిలకు ఎక్కువ అవకాశాలు 

అంతుచిక్కక అయోమయంలో సీనియర్లు 

మంత్రి బాలినేని సిఫార్సులకు ప్రాధాన్యం


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): నామినేటెడ్‌ పదవుల కేటాయింపు జిల్లాలోని వైసీపీ శ్రేణులను సంతృప్తి పరచలేకపోయింది. అసంతృప్తి చెందిన వారే అధికంగా కనిపిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ‘ప్రత్యక్ష’ ఆశలు గల్లంతయ్యాయి. టీటీడీ చైర్మన్‌ పదవినే మళ్లీ కట్టబెట్టారు. ఇక మార్కాపురం డివిజన్‌కు రాష్ట్రస్థాయి పదవులలో కనీస ప్రాధాన్యం కూడా దక్కలేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవులు ఆరు, జిల్లాస్థాయిలో నాలుగు వెరసి పది పదవులు వచ్చినా జిల్లాలోని సగం అసెంబ్లీ నియోజకవర్గాలకు కనీస ప్రాధాన్యం లభించలేదు. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్‌ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పదవులు వచ్చిన వారిలో కూడా కొందరు వారి సతీమణులకు ఇవ్వటంతో తాము తెరవెనకకు పోవాల్సిందేనా అంటూ గుసగుసలాడటం ప్రారంభమైంది. 


రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా భారీగా ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల వ్యవహారం జిల్లాలో వైసీపీ శ్రేణుల్లో అలజడిని సృష్టించింది. రాష్ట్రస్థాయిలో ఆరు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు, నాలుగు జిల్లా స్థాయి చైర్మన్‌ పదవులను ప్రభుత్వం ప్రకటించింది. అందులో జిల్లాలోని సగం నియోజకవర్గాలకు ప్రాధాన్యం లేకపోవటం ముఖ్యంగా మార్కాపురం డివిజన్‌కు ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కకపోవటం గమనార్హం. వీటన్నింటికీ తోడు సీఎం సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. ఆయన తిరిగి టీటీడీ చైర్మన్‌ పదవినే చేపట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన జిల్లాకు వచ్చి బహిరంగంగా చేసిన విజ్ఞప్తిని కూడా సీఎం పరిగణనలోకి తీసుకోకపోవటం విశేషం.


ఇంకోవైపు ఆయా పదవులు దక్కినవారిని పరిశీలిస్తే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. పదవులలో సామాజిక న్యాయం పరంగా దళిత, బడుగు బలహీనవర్గాలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ శ్రేణులను అది కూడా కాస్తంత నిరాశకు గురిచేసింది. మహిళలకు సగభాగం పదవులు ఇవ్వాలన్న జగన్‌ నిర్ణయంతో అనేకమంది నాయకులు వెనక్కి తగ్గి వారి సతీమణులకు పదవులు ఇప్పించుకున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని పరిశీలిస్తే వైసీపీ కేడర్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. 


రాష్ట్ర పదవులు ఆరు, జిల్లా స్థాయిలో నాలుగు 

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు జిల్లాకు ఆరు దక్కాయి. నలుగురికి జిల్లాస్థాయి ఛైర్మన్‌ పదవులను కేటాయించారు. ఈ మొత్తం పది పదవులలో మూడు ఒంగోలుకి, మూడు కొండపి నియోజకవర్గానికే దక్కాయి. పార్టీ నిర్ణయం మేరకు అద్దంకి ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణ చైతన్యకు ఏపీ నెట్‌వర్క్‌(శాప్‌నెట్‌) చైర్మన్‌ పదవిని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఈ పదవిని కేటాయించటంలో గతంలో సోషల్‌ మీడియాలో కృష్ణచైతన్యకు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. శాప్‌ సీఈవో వెన్నా ప్రజ్ఞాధరరెడ్డి వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి గన్నవరం రోడ్డులో ఉన్న కార్యాలయం, దాని నిర్వహణ, విఽధుల గురించి చెప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలో ఈ కార్పొరేషన్‌ ఉంటుంది. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌కు సామాజిక న్యాయం సలహాదారు కమిటీ చైర్మన్‌ పదవిని కేటాయించారు.


ఒంగోలుకి చెందిన కాకుమాని రాజశేఖర్‌కి లెదర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవినిచ్చారు. ఒంగోలుకే చెందిన షేక్‌ సుభాన్‌బీకి అనూహ్యంగా టైలర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. కనిగిరి నియోజకవర్గానికి చెంది హైదరాబాద్‌లో ఉండే చింతలచెరువు సత్యనారాయణరెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చి రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. సింగరాయకొండకు చెందిన డాక్టరు అశోక్‌కుమార్‌రెడ్డి సతీమణి సుప్రజకు ప్రకాశంతో సంబంధమున్న మూడు జిల్లాల ఆర్టీసీ రీజనల్‌బోర్డు చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. 


జిల్లాస్థాయిలో నాలుగు..

జిల్లాస్థాయిలో నాలుగు చైర్మన్‌ పదవుల నియామకం జరిగింది. కొండపి ఇన్‌చార్జ్‌ మాదాసు వెంకయ్యకు తిరిగి సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిని కేటాయించారు. పర్చూరు ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు స్థానంలో ఆయన సతీమణి పద్మావతిని డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. జిల్లాలో కీలకంగా కనిపిస్తున్న ఒంగోలు అర్బన్‌ అభివృద్ధి అథారిటీ (ఓడా) చైర్‌పర్సన్‌గా ఒంగోలుకి చెందిన సింగరాజు మీనాకుమారిని ఎంపికచేశారు. మంత్రి బాలినేని తన అనుచరుడైన నగర పార్టీ అధ్యక్షుడు వెంకటరావు పేరుని సిఫార్సు చేయగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న నిర్ణయంతో ఆయన సతీమణి మీనాకుమారి పదవికి ఎంపికయ్యారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ పదవి వైపాలెం నియోజకవర్గానికి చెందిన రాచగొర్ల వెంకటసుశీలకు దక్కింది.  వైసీపీకి చెందిన పిచ్చయ్యయాదవ్‌కి ఆ పదవి ఇవ్వమని మంత్రి సురేష్‌ సిఫార్సు చేయగా మహిళల కోటాలో ఆయన భార్యను ఎంపిక చేశారు. అయితే ఆమె 7వ తరగతి వరకే చదువుకుని ఉండటం విశేషం. 


వైవీ ఆశలు గల్లంతు

ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర నాయకులు వైవీ సుబ్బారెడ్డి ఆశలు గల్లంతు కావటం విశేషం. ఇటీవల జిల్లాకు వచ్చిన ఆయన మరోసారి తాను టీటీడీ చైర్మన్‌ పదవిని కోరుకోవటం లేదనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న పదవిని కోరుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. అందిన సమాచారం మేరకు ఆయన అటు రాజ్యసభకైనా వెళ్లాలని లేదా ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి కావాలని ఆశించినట్లు తెలిసింది. అయితే ఆయనకు మళ్లీ టీటీడీనే ఇస్తారని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తర్వాత ఆ విషయం చర్చనీయాంశమైంది. గత రెండు మూడు రోజులుగా తన ఆలోచనలకు అనుగుణంగా న్యాయం చేయమని సీఎంపై వైవీ వత్తిడి కూడా తెచ్చినట్లు సమాచారం. చివరికి వైవీకి మరోసారి టీటీడీ చైర్మన్‌ పదవినే కేటాయిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఇవ్వకపోగా గుంపులో గోవిందలా శనివారం భారీ జాబితాతో పాటు ఆయన నియామక ఉత్తర్వులను ప్రకటించటం వైసీపీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి జిల్లాలోని వైవీ అభిమానులు, అనుచరులైతే ఈ విషయంలో తీవ్ర కలత చెందారు.  


మార్కాపురం డివిజన్‌కి దక్కని ప్రాధాన్యం

మార్కాపురంనకు జిల్లాలో రాజకీయంగా వైసీపీకి అత్యంత బలమైన డివిజన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఈ పదవుల విషయంలో ఆ డివిజన్‌కి ఎలాంటి ప్రాధాన్యం లభించక లేదు. మొత్తంగా వైసీపీకి పట్టున్న పశ్చిమ ప్రాంతాన్నే తీసుకున్నా ఆ డివిజన్‌లోని గిద్దలూరు, మార్కాపురం, వైపాలెంతో పాటు దర్శికి కూడా ఎలాంటి ప్రాధాన్యం లభించలేదు. కనిగిరి నియోజకవర్గానికి రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కినా ఆయన హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉండి పనిచేస్తున్న రెడ్డి సామాజికవర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తిని ఆ నియోజకవర్గంలోని ఆ వర్గం వారు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. 


సీనియర్ల విస్మయం

జిల్లాలోని పలువురు సీనియర్‌ నాయకులు ఈ పదవుల జాబితాను చూసి విస్మయం చెందారు. వారిని పక్కనబెట్టారా లేక మున్ముందు వేరే పదవులలో అవకాశం ఇస్తారా అనే విషయం తెలియక తర్జనభర్జన పడుతున్నారు. గత ఎన్నికలలో టిక్కెట్‌ ఇవ్వలేకపోయిన పలువురికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని లేక మంచి గౌరవం దక్కే పదవులు ఇస్తామని సీఎం జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, డాక్టరు గరటయ్య, ప్రతిపక్షంలో పార్టీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన తూమాటి మాధవరావు, గొట్టిపాటి భరత్‌ లాంటి వారున్నారు. అలాగే 2014లో బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన డాక్టరు అమృతపాణి, కొండపి ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వరికూటి అశోక్‌లతో పాటు కిందిస్థాయిలో పార్టీలో చక్రం తిప్పే అనేకమంది నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధిగా ఉన్న బత్తుల బ్రహ్మారెడ్డికి పదవి దక్కకపోవటం మరింత చర్చనీయాంశమైంది. తొలుత రాష్ట్రస్థాయి నాయకత్వం ఆయనకు పదవి ఇవ్వాలని భావించినా మంత్రి బాలినేని నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో పక్కన బెట్టినట్లు తెలుస్తోంది.


అలాగే కనిగిరి నియోజకవర్గంలో ముక్కు కాశిరెడ్డి లాంటి మరికొందరు నాయకులు కూడా పదవుల కోసం వేచిచూస్తున్నారు. ఇలాంటి వారందరినీ పక్కనబెట్టి జరిగిన పదవుల కేటాయింపుతో వారంతా విస్మయానికి గురయ్యారు. కాగా పదవుల కేటాయింపు వ్యవహారంలో ఆది నుంచి జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే మంత్రి బాలినేని సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పార్టీ నాయకత్వం ప్రాధాన్యమిచ్చినట్లు తేటతెల్లమవుతోంది. రెడ్డి, టైలర్స్‌ కార్పొరేషన్‌ పదవులను మంత్రి సిఫార్సు తర్వాతే వారికి కేటాయించారు. 

Updated Date - 2021-07-18T07:06:02+05:30 IST