ఇక్కడ Real Estate వ్యాపారం చేయాలంటే.. వైసీపీ నేతలు అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. లేదంటే..!

ABN , First Publish Date - 2021-12-18T17:44:58+05:30 IST

రాజకీయంగా, భౌగోళికంగా కూడా ప్రాముఖ్యత కలిగిన స్థానం. ఈ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందడానికి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడుతుంటాయి. 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎక్కువగా గెలవగా, తర్వాత స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీకి ...

ఇక్కడ Real Estate వ్యాపారం చేయాలంటే.. వైసీపీ నేతలు అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. లేదంటే..!

అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలంటే.. అధికార పార్టీ నేతలు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే! ఒక్క వెంచర్‌కు గరిష్టంగా 30 లక్షల రూపాయలు ముట్టజెప్పాల్సిందేనట! లేదంటే.. మున్సిపల్‌ అధికారుల నుంచి అనుమతులు రావన్న మాటే! ఇంతకీ ఈ రియల్‌ వసూళ్ల దందా ఎక్కడ? ఆ అధికార పార్టీ నాయకులు ఎవరు? బాధిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆవేదన ఎలా ఉంది? దీనిపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


ఇక్కడే అధికార వైసీపీ నాయకుల జేబులు నింపుకోవడానికి మార్గం

పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంది కీలక స్థానం. రాజకీయంగా, భౌగోళికంగా కూడా ప్రాముఖ్యత కలిగిన స్థానం. ఈ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందడానికి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడుతుంటాయి. 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎక్కువగా గెలవగా, తర్వాత స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీకి చెందిన కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేవలం భౌగోళికంగానే కాకుండా విద్యా సంస్ధల పరంగానూ తాడేపల్లిగూడెం ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందింది. దాంతో సహజంగానే ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారమూ బాగానే పుంజుకుంది. దీనికితోడు నేషనల్ హైవే అతి దగ్గరగా ఉండటంతో భూముల రేట్లు పెరగడం, దానికి ఆనుకుని అనేక లే అవుట్లు రావడం జరిగింది. ఇదిగో ఇక్కడే అధికార వైసీపీ నాయకుల జేబులు నింపుకోవడానికి మార్గం ఏర్పడింది. అధికార పార్టీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తమ రియల్ నైజం చూపించడం మొదలుపెట్టారు. తాము అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అనే పరిస్థితిని కల్పించారు. ఏదో తృణమో పణమో అయితే పర్వాలేదు, కానీ వీరు వసూలు చేస్తున్నది భారీ మొత్తంలో ఉండటంతో అటు వ్యాపారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేగుతోంది. 


కొత్త కొత్త వెంచర్లపై వైసీపీ నేతల కన్ను

తాడేపల్లిగూడెం అనేక వ్యాపారాలు, విద్యా సంస్థలకు నెలవుగా మారడంతో ఈ పట్టణానికి ఇటీవల కాలంలో వలసలు బాగా పెరిగాయి. సొంత నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థానికులు, వలసదారులు ప్రాధాన్యత ఇస్తుండటంతో అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొచ్చాయి. తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఆనుకుని పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లోనూ వెంచర్లు వేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇలా వచ్చిన కొత్త కొత్త వెంచర్లపై వైసీపీ నేతల కన్ను వాటిపై పడింది. వెంచర్లు వేయాలంటే.. తమ అనుమతి తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఒక్కో వెంచర్‌కు లక్షల రూపాయల్లోనే వసూళ్లు మొదలుపెట్టారు. వెంచర్ స్థాయిని బట్టి గరిష్టంగా 30లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే.. వారు ఏ విధంగా దందాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలవారు చర్చించుకుంటున్నారు.


ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది..

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్. అదేమిటంటే.. వెంచర్లు వేయడానికి ప్లాన్లు వేసుకుని, సంబంధింత మునిసిపల్ అధికారులను కలవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్లారనుకోండి.. మునిసిపల్ అధికారుల నుంచి వచ్చే మొదటి ప్రశ్న.. "వైసీపీ నేతలను కలిశారా?" అనేది. "లేదంటే స్థానిక ప్రజా ప్రతినిధి దగ్గరకు వెళ్లి అనుమతి తెచ్చుకోండి" అని అంటారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. వైసీపీ నాయకుల దగ్గరకు పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నాయకుల అనుమతి లేకుండా మునిసిపల్‌ అధికారులు చిన్న కాగితం కూడా ముందుకు కదపరట. 


వసూళ్ల దందా అంతా.. సదరు ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే

ఇదంతా ఒక ఎత్తయితే.. ఇక్కడ రియల్ దందా సాగించే వైసీపీ నాయకులందరూ స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులే అనేది బహిరంగ రహస్యం. రియల్‌ వసూళ్ల దందా అంతా.. సదరు ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు. ఈ పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దడ పుట్టిస్తోంది. కొందరు వ్యాపారులయితే.. వెంచర్లు మానేసి కామ్‌గా ఉండడమే మేలనే పరిస్థితికి వచ్చారు. ఒక్క వెంచర్‌ వేసుకోవడానికి గరిష్టంగా 30 లక్షల రూపాయల దాకా వసూళ్లకు పాల్పడుతున్న అధికార వైసీపీ నేతల రియల్‌ దందాపై స్థానిక రాజకీయ వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ హయాంలో ఏదో కాస్తోకూస్తో తీసుకునేవాళ్లం కానీ, ఇలా భారీ మొత్తాలు వసూళ్లు చేయలేదని చెబుతున్నారు. మొత్తానికి అధికార బలం ఉండే.. ఏమైనా చేయవచ్చనడానికి తాడేపల్లిగూడెం కేంద్రంగా జరుగుతోన్న రియల్‌ దందానే నిదర్శనమని చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-12-18T17:44:58+05:30 IST