దేవుడ్నీ వదలని వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-08-12T06:08:58+05:30 IST

వైసీపీ నాయకులు బరి తెగించారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు. రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసి అక్రమంగా రోడ్డును నిర్మించారు. దీంతో ముసినివలస గ్రామస్థులు గురువారం ఆందోళనకు దిగారు.

దేవుడ్నీ వదలని వైసీపీ నేతలు
రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న ముసినివలస గ్రామస్థులు

మాన్యంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం
 రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసిన వైనం
 ముసినివలస గ్రామస్థుల ఆందోళన
జి.సిగడాం, ఆగస్టు 11:
వైసీపీ నాయకులు బరి తెగించారు. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టారు. రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసి అక్రమంగా రోడ్డును నిర్మించారు. దీంతో ముసినివలస గ్రామస్థులు గురువారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ముసినివలసలో పట్టా నెంబరు 355, సర్వే నెంబరు 44లో ఐదు ఎకరాల 15 సెంట్ల విస్తీర్ణంలో దేవుడి మాన్యం ఉంది. ఈ భూమి గ్రామానికి చెందిన పురోహితుడు దేవగుప్తాపు విజయజగన్నాథ కుమార్‌ సాగులో ఉంది. పక్క రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దేవుడి మాన్యం మీద ఉన్న ఓ పొలాన్ని కోనుగోలు చేశాడు. దీనికి దారి కోసం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అతనితో కుమ్మక్కై దేవుని మాన్యాన్ని ఆక్రమించారని గ్రామస్థులు చెబుతున్నారు. రాత్రికి రాత్రే దేవుడి మాన్యం గుండా 20 అడుగుల వెడల్పు, 700 అడుగుల పొడువునా రహదారిని నిర్మించారని గ్రామస్థులు దేవగుప్తాపు కొండలరావు, డి.మురళీ, పి.ముత్యాలరావు, బి.పెంటమ్మ. పి.రమణ, జి.సన్యాసి, ఎం.అప్పన్న, పి.శీతమ్మ, జి.పోలయ్య, డి.బలరాం, డి.సతీష్‌, డి.రవి, డి.బాబూరావు, డి.సూర్యకుమారిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురోహితుడు విజయజగన్నాథకుమార్‌ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తున్న దేవుని మాన్యాన్ని అన్యాక్రాంతం చేస్తే ఉరుకోబోమని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు, ఎస్‌ఐ సామంతుల రామారావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి సమగ్ర సర్వే చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

దేవుని మాన్యాన్ని కాపాడాలి
మా బ్రాహ్మణ కులానికి చెందిన పూర్వీకులు రామాలయ అభివృద్ధి కోసం కొంత భూమిని కేటాయించారు. దానిపై వచ్చిన ఫలసాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వంశపారంపర్యంగా వస్తున్న దేవుని మాన్యాన్ని అధికార పార్టీ నాయకులు అన్యాక్రాంతం చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని దేవుని మాన్యాన్ని కాపాడాలి.
- దేవగుప్తాపు విజయజగన్నాథకుమార్‌, పురోహితుడు, ముసినివలస

 చర్యలు తీసుకుంటాం
 దేవుని మాన్యంపై సిబ్బందిని పంపించి సమగ్ర సర్వే చేయిస్తాం. రెవెన్యూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి ప్రాప్తికి చర్యలు తీసుకుంటాం.
 - పి.వేణుగోపాలరావు, తహసీల్దార్‌, జి.సిగడాం

Updated Date - 2022-08-12T06:08:58+05:30 IST