Mla balaraj: మీలో ఎవరైనా కలెక్టర్ అయితే చూడాలని ఉంది

ABN , First Publish Date - 2021-08-28T23:51:42+05:30 IST

"మీలో ఎవరైనా కలెక్టర్ అయితే చూడాలని ఉంది" అని విద్యార్థులను ఉద్దేశించి

Mla balaraj: మీలో ఎవరైనా కలెక్టర్ అయితే చూడాలని ఉంది

పశ్చిమ గోదావరి: "మీలో ఎవరైనా కలెక్టర్ అయితే చూడాలని ఉంది" అని విద్యార్థులను ఉద్దేశించి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన మనసులోని కోరికను బయటపెట్టారు. మీ ఉజ్వల భవిష్యత్తుతో ఒక కలెక్టర్‌గా, ఒక ఐపీఎస్‌గా, ఒక ఇంజనీర్‌గా, ఒక డాక్టర్‌గా మారి మీ చదువుల కోసం ఇంత చేస్తున్న జగన్ మామ రుణాన్ని తీర్చుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే హితబోధ చేశారు. పట్టుదలతో చదివి అనుకున్నది సాధించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. శనివారం బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపవరం, అంతర్వేదిగూడెం, కొరసవారిగూడెం, దొరమామిడి గ్రామ పంచాయతీల్లోని పాఠశాలల్లో "నాడు-నేడు"లో భాగంగా స్కూల్స్‌లో జరిగిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. 


ప్రతి స్కూల్‌లోను పిల్లలను ఉత్సాహపరుస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకోవడానికి బాగా కృషి చేయాలని, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి బయట ప్రైవేటు బడులలో అందుతున్న సౌకర్యాల కన్నా ఎక్కువగా మీకు ఇక్కడ సౌకర్యాలను కల్పించారని ఆయన తెలిపారు. ఈ రోజు బడులలో ఉన్న సదుపాయాలను చూస్తే తన విద్యాభ్యాసం ఇప్పుడు జరిగి ఉంటే ఎంత బాగుండునోనని అనిపిస్తుందని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల బాల్యస్మృతులను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. 




దొరమామిడి పాఠశాలలో ఎమ్మెల్యే బాలరాజు సతీమణి  రాజ్యలక్ష్మీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తో్ంది. తన భర్త ఎమ్మెల్యే బాలరాజుకు సహకరిస్తూ, మరోపక్క విధి నిర్వహణలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న రాజ్యలక్ష్మీకి ముందుగా గ్రామస్తులు సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలకు దిశా యాప్ ఉపయోగాలను ఎమ్మెల్యే తెలియజేసి ప్రతి ఒక్కరితో దిశా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. 104 వాహనంలో అందిస్తున్న సేవలను, అందులో ఉన్న పరికరాలు, వాటి పనితీరును డాక్టర్ చందుని అడిగి ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా పరిశీలించారు.


Updated Date - 2021-08-28T23:51:42+05:30 IST