ఆ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి మరీ దారుణం..!

ABN , First Publish Date - 2020-09-23T17:58:41+05:30 IST

కయ్యానికైనా, వియ్యానికైనా సమఉజ్జీ ఉండాలని అంటారు. అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి మాత్రం.. ఓ ఎంపీటీసీ విమర్శించే రేంజ్‌కు పడిపోయిందట. ఆ ఎంపీటీసీ కూడా సొంత పార్టీకే చెందడం

ఆ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి మరీ దారుణం..!

కయ్యానికైనా, వియ్యానికైనా సమఉజ్జీ ఉండాలని అంటారు. అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి మాత్రం.. ఓ ఎంపీటీసీ విమర్శించే రేంజ్‌కు పడిపోయిందట. ఆ ఎంపీటీసీ కూడా సొంత పార్టీకే చెందడం గమనార్హం. పైగా అగ్రవర్ణాలను ఒక దళిత ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణలు చేయడం ఆ జిల్లాలో సంచలనం రేపింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనపై ఎంపీటీసీ స్థాయి నేత ఎందుకు రెచ్చిపోయారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం.


విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఒకే ఒక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం పాయకరావుపేట. ఇది టీడీపీకి కంచుకోటలాంటిది. అయితే వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గొల్ల బాబురావు విజయం సాధించారు. వై.ఎస్.ఆర్‌పై అభిమానంతో కాంగ్రెస్‌కు ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీచేసి మరోసారి గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికలలో గొల్ల బాబురావుని కాదని.. చెంగల వెంటకరావుకు పాయకరావుపేట సీటుని వైసీపీ అధిష్టానం కేటాయించింది. అప్పుడు ఆయనపై వంగలపూడి అనిత పోటీచేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో పాయకరావుపేట నుండి వైసీపీ తరఫున బాబురావు మళ్లీ పోటీచేసి.. టీడీపీ ఆభ్యర్ధి బంగారయ్యపై విజయం సాధించారు. 


నిజానికి గొల్ల బాబురావు ఆర్థికంగా అంత బలవంతుడు కాదు. అలాగని రాజకీయాల్లో దూకుడు ఉన్న వ్యక్తి కూడా కాదు. వైసీపీకి విధేయుడు ఉండటంవల్ల ఆయనకు సీటు ఇచ్చారని చెబుతుంటారు. ఈ నియోజకవర్గంలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, కోటవరట్ల అనే మండలాలు ఉంటాయి. వీటిలో ఐదుగురు వైసీపీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతుంటారు. పాయకరావుపేటలో దళిశెట్టి బాబురావు, చిక్కాల రామరావు, నక్కపల్లిలో విసం రామకృష్ణ, ఎస్.రాయవరంలో బొలిశెట్టి గోవిందరావు. కోటవరట్లలో తంగేడు రాజులు కీలకంగా ఉన్నారు. ఈ నాలుగు మండలాల్లో ఏ పనులు కావాలన్నా సరే.. వీరి అనుమతితో చేయాల్సిందేనట. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా మారిపోయిందని టాక్. ఈ పరిస్థితిపై ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒక సందర్భంలో ఆవేదన వెళ్లగక్కారు. "నేను ఎమ్మెల్యేనైనప్పటికీ, నన్ను పని చేసుకోనివ్వడం లేదు, పార్టీలోని కొందరు అగ్రవర్ణాల నాయకులు ఇబ్బందులు పెడుతున్నారు" అని ఆయన ఒక బహిరంగ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు.


ఇక ఇటీవల పాయకరావుపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంటి అనే వ్యక్తి భార్యకు ఎమ్మెల్యే బాబురావు ఇప్పించారు. ఇదే పదవిని గోవిందరావు ఆశించినా దక్కలేదు. ఇంతలో ఎస్.రాయవరంలో కొన్ని పనులు ఆ చంటికే కేటాయించారు. ఈ విషయంగా గోవిందరావు.. ఎమ్మెల్యే బాబురావు ముందే పంచాయితీ పెట్టాడు. ఈ సమయంలో మాటామాట పెరగడంతో ఎమ్మెల్యే ఇంటి వద్దనే చంటిమీద గోవిందరావు చేయిచేసుకున్నాడట. తన ముందే తన అనుచరుడిని కొడతావా? అని అడిగిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గోవిందరావు సమావేశం పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారట. బాబురావుని దూషించడమేగాక.. అగ్రవర్ణాలైన తమను ఎమ్మెల్యే వేధిస్తున్నారని గోవిందరావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారట. దీనిపై ఎమ్మెల్యే బాబురావు.. వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యేను అవమానిస్తారా? అంటూ ప్రతిపక్షాలు సైతం ఎమ్మెల్యే బాబురావుకు మద్దతుగా నిలవడం గమనార్హం.


మొత్తంమీద పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి స్వపక్ష నాయకుడి నుంచి, అదికూడా ఎంపీటీసీ స్థాయి వ్యక్తి నుంచి వ్యతిరేకత రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గోవిందరావు వెనుక యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఉన్నందునే.. ఆయనలా రెచ్చిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పాయకరావుపేట వైసీపీలో ఏర్పడిన ఈ లుకలుకలు.. మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో చూడాలి.

Updated Date - 2020-09-23T17:58:41+05:30 IST