Advertisement

తీవ్ర ఆందోళనలో వైసీపీ మహిళా ఎమ్మెల్యే.. కారణమిదేనా?

Sep 23 2020 @ 12:31PM

రాష్ట్ర రాజధాని ఎమ్మెల్యే... రాజకీయాలకు కొత్త అయినా తొలిసారే ఎన్నికలలో పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఆమె ఎంతోమందికి నాడిని పట్టి రోగ నిర్దారణ చేసినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కార్యకర్తల నాడి పట్టడంలో విఫలం అవుతున్నారట. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోతున్నారట. కొందరు స్వపక్ష నాయకులే విపక్షంలా వ్యవహరిస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పైగా వరుస వివాదాలు తలెత్తుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే?


గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  హైదరాబాద్‌లో డాక్టర్ వృత్తిలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే గెలుపొందారు. అయితే ఆమె గత ఏడాదిన్నర కాలంలో అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. గతేడాది వినాయకచవితి పందిళ్లలోకి ఆమెను రానివ్వకపోవటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగానే తనను పందిట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో కులవివక్ష ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శ్రీదేవి ఎస్సీ కాదంటూ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు  ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు ఆమె హాజరయ్యారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి మండిపడటం నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


ఇటు సొంత పార్టీలోని నాయకులతో సైతం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి విబేధాలు పొడచూపాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సొంత గ్రామం  రాజధానిలో ఉండటంతో ఆయన పెత్తనంతో ఆమె విభేదించారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. అయితే దీనిపై పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చారని సమాచారం. ఇక అంతా బాగానే ఉందని భావిస్తున్న క్రమంలో కొద్దీ రోజుల క్రితం పెదకాకాని సమీపంలోని ఐజేఎం అపార్టుమెంట్‌లో కొంతమంది పేకాట శిబిరం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు  పేకాట శిబిరంపై దాడిచేసి 30 మంది వరకు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శిబిరం నిర్వాహకుడు చలివేంద్రం సురేశ్‌గా తేల్చారు. అయితే ఆయన ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అని జోరుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ఉండవల్లి అండదండలతోనే శిబిరం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీనిపై డీజీపీకి  సైతం ఆమె ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. అయితే అప్పటికే విషయం ప్రజల్లోకి వెళ్లిపోవడం.. ఉండవల్లి శ్రీదేవి ఇమేజ్‌ ని బాగా డ్యామేజ్ చేసిందని టాక్.


ఇదిలా ఉండగానే, పేకాట శిబిరం నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న రమణారెడ్డి, సందీప్, సురేశ్‌లను వైసీపీ నుండి బహిష్కరించారు. ఇది జరిగిన తర్వాత వారం రోజులకి మేకల రవి అనే వ్యక్తి.. తన నుంచి ఎమ్మెల్యే కోటీ 40 లక్షల రూపాయల నగదు తీసుకుని.. 60 లక్షల రూపాయల మాత్రమే వెనక్కి ఇచ్చారని స్వయంగా వెల్లడించారు. మిగిలిన 80 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన డబ్బులు తనకు ఇప్పించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే రవి విన్నవించడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో వివాదాస్పదం కావటంతో మండల పార్టీ నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు డబ్బులిచ్చేంత స్థోమత రవికి లేదనీ, పార్టీ నుండి సస్పెండ్ అయినవారే ఆయనతో అలా చేయించారనీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే ఈ పరిణామం కూడా ఎమ్మెల్యే శ్రీదేవికి ఇబ్బందికరంగా మారిందట.


మొత్తంమీద, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వరుసగా వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. అధికార పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకోవాలని కొంతమంది ద్రుష్పచారం చేస్తున్నారనీ, వారిని వదిలిపెట్టేది లేదనీ ఎమ్మెల్యే శ్రీదేవి అంటున్నారు. అయితే ఏడాదిన్నర కాలంలోనే ఎదురైన పలు వివాదాలు.. ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతోంది. మరి ఉండవల్లి శ్రీదేవి.. తన చుట్టూ ముసురుకున్న వివాదాల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.