వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు

ABN , First Publish Date - 2022-05-15T08:15:55+05:30 IST

‘‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మా పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే 2023 మార్చి - ఏప్రిల్‌లోనే ప్రజలకు పండగ వస్తుంది. లేదంటే 2024 ఎన్నికల వరకు ప్రజలు కష్టాలు భరించాలి.

వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు

ప్రతిపక్షాల ఐక్యతను ప్రజలు కోరుకుంటున్నారు

అదే జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి

కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తా

నా పుట్టిన రోజును మరపురానిదిగా చేసిన ఉన్మాదికి కృతజ్ఞతలు: రఘురామరాజు


న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మా పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే 2023 మార్చి - ఏప్రిల్‌లోనే ప్రజలకు పండగ వస్తుంది. లేదంటే 2024 ఎన్నికల వరకు ప్రజలు కష్టాలు భరించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. లేకపోయినా ఈ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం. కూటమి ఏర్పాటులో నేను కీలక పాత్ర పోషిస్తాను. భాగస్వామిగా ఉంటాను’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజలు వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ప్రతిస్పందనతో ఇది అర్థమవుతోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం కొన్ని కలయికలు తప్పవు... తప్పులేదు. ప్రజల కోసం వాళ్లు కలిసి తీరాల్సిందే. కూటమిలో గరిష్ఠంగా మూడు, కనిష్ఠంగా రెండు పార్టీలు ఉంటాయు. ఆ పార్టీల్లో ఏదో ఒకదానిలో నేనుంటాను. వైసీపీలో మాత్రం ఉండను. చంద్రబాబు, పవన్‌ కలిస్తే తమ పార్టీకి పుట్టగతులు ఉండవన్న భయం సీఎం జగన్‌లో ఉందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై వరకు మా పార్టీ ఆటలు సాగవచ్చు. ఆ తర్వాత ఆట ముగింపునకు వస్తుంది’’ అని రఘురామ అభిప్రాయపడ్డారు.


రాష్ట్రపతి ఎన్నిక తరువాత చర్యలు

రఘురామరాజు శనివారం తన జన్మదినాన్ని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జరుపుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోకేశ్‌, ప్రముఖ గాయని జానకితో పాటు అనేక మంది ప్రముఖులు తనకు ఫోన్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. కాగా, తనపై జరిగిన హింసకు సంబంధించి కేంద్రానికి, లోక్‌సభ స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులపై రాష్ట్రపతి ఎన్నికల తర్వాత చర్యలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 


బాకీ ఉంచుకోను

గత ఏడాది తన జన్మదినం నాడే రాజద్రోహం కేసు నమోదు చేసి సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, అత్యంత కిరాతకంగా హింసించడం తదితర ఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది నా 60వ పుట్టిన రోజు. ఎన్నో పుట్టిన రోజులు ఘనంగా జరిగాయి. కానీ ఆ పుట్టిన రోజును మరపురానిదిగా చేసినందుకు ఉన్మాదికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాకీ ఉంచుకోను. ఆ రోజు నేను చనిపోవాల్సినవాడిని. కాబట్టి ఇది 60వ పుట్టిన రోజు అయినప్పటికీ... జగన్మోహన్‌రెడ్డి పుణ్యాన మొదటి పుట్టిన రోజుగానే భావిస్తున్నాను. ఈ మహద్భాగ్యాన్ని ఇచ్చిన జగన్‌, సునీల్‌, ఇతర పోలీసు అధికారులకు, సహకరించిన అన్యాయవాదులకు ధన్యవాదాలు’’ అని రఘురామరాజు అన్నారు.

Updated Date - 2022-05-15T08:15:55+05:30 IST