జీఎస్‌డీపీ కంటే అప్పులు ఎక్కువ

ABN , First Publish Date - 2022-05-17T09:04:36+05:30 IST

‘మొత్తం అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. రాష్ట్ర జీఎ్‌సడీపీ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. బ్యాంకుల చైర్మన్లు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుంభకోణాలకు పాల్పడుతున్నారు’’

జీఎస్‌డీపీ కంటే అప్పులు ఎక్కువ

పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం లేదు: రఘురామ


న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘మొత్తం అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. రాష్ట్ర జీఎ్‌సడీపీ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. బ్యాంకుల చైర్మన్లు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుంభకోణాలకు పాల్పడుతున్నారు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల లెక్కలు చెప్పమని ప్రిన్సిపల్‌ అక్కౌంటెంట్‌ జనరల్‌ అడిగితే లెక్కలు చెప్పడం లేదు. ఈ అంశంపై పీఏజీకి లేఖ రాస్తాను. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారుల ద్వారా కాకుండా పక్క రాష్ట్రం నుండి వచ్చిన అధికారి ద్వారా తప్పులు చేయిస్తున్నారు. పరిస్థితి చెయ్యి దాటక ముందే మేలుకోవాలి. నా వంతు ప్రయత్నంగా నేను ప్రజలకు నిజాలు వివరిస్తా. రాష్ట్రపతి ఎన్నికల తర్వాతయిన కేంద్రం కళ్లు తెరచి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పును రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా తేల్చితే... ఉద్యోగులకు జీతాలు రావు. రెండు సంవత్సరాల వరకు అప్పు చేయడానికి వీలు ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మరికొన్ని రాష్ర్టాలు అప్పులు చేేస్త అప్పుడు దేశ పరిస్థితి శ్రీలంకలా మారుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల హామీలను తమ పార్టీ తుంగలో తొక్కిందని ఎంపీ ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. అది చూస్తూ ఊరుకోలేక నిజాలు చెప్పడానికి నేను ప్రజల ముందుకు వస్తున్నా.


వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పథకంపై చాలా అబద్ధాలు చెప్పారు. ఐదేళ్లకుగాను రైతుకు ఇచ్చే మొత్తం రూ.67 వేలల్లో కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు అందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్తు కోసం వెచ్చించే మొత్తాన్ని కూడా రైతుల కోసం ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది’’ అని వివరించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నవారు సామాన్యులు కాదన్నారు. హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌రెడ్డిని పార్టీ పదవి నుండి తొలగించడం లేదని ఆరోపించారు. ‘‘మంచి చేసే వారిని పార్టీ నుంచి తొలగించడం, చెడు చేసే వారిని పార్టీలో ఉంచుకోవడం మా పార్టీ విధానం కావచ్చు. హత్య కేసులో ముందుకు వెళ్తున్నకొద్దీ కొత్త పేర్లు తెరమీదికి వస్తున్నాయి. వివేకానంద రెడ్డి కూతురు సునీతకు త్వరగా న్యాయం జరగాలి’’ అని రఘురామ ఆకాంక్షించారు. 

Updated Date - 2022-05-17T09:04:36+05:30 IST