బాపట్ల వైసీపీ ఎంపీ కనబడుట లేదు అంట..?..ఇంతకూ ఆ ఎంపీ ఎవరు..?

ABN , First Publish Date - 2021-12-14T17:28:43+05:30 IST

ఆ నాయకుడు అక్కడ స్థానికుడు కాదు. ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి అయినా.. ఆయన్ను అక్కడి ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారు. కానీ వరదలు వచ్చి పంటలు నష్టపోయినా, ఇతర ఏ సమస్య వచ్చినా సదరు ఎంపీ కనపడరట. తమ ఎంపీ గారిని..

బాపట్ల వైసీపీ ఎంపీ కనబడుట లేదు అంట..?..ఇంతకూ ఆ ఎంపీ ఎవరు..?

ఆ నాయకుడు అక్కడ స్థానికుడు కాదు. ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి అయినా.. ఆయన్ను అక్కడి ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారు. కానీ వరదలు వచ్చి పంటలు నష్టపోయినా, ఇతర ఏ సమస్య వచ్చినా సదరు ఎంపీ కనపడరట. తమ ఎంపీ గారిని టీవీలలో చూడటం తప్ప.. నేరుగా చూడలేకపోతున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇంతకూ ఆ ఎంపీ ఎవరు? ఆయన అక్కడ నల్లపూసగా మారడానికి అసలు కారణమేంటి? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఎన్నో ఆశలతో  ఓట్లు వేసి ఎంపీగా గెలిపించారు..

గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నుంచి గత ఎన్నికలలో వైసీపీ తరపున ఎంపీగా నందిగం సురేష్ గెలుపొందారు. సురేష్‌ స్థానికేతురుడు అయిననప్పటికీ.. బాపట్ల పార్లమెంట్ ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఎన్నో ఆశలతో  ఓట్లు వేసి ఎంపీగా గెలిపించారు. కానీ ఆయన మాత్రం.. గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అస్సలు కనిపించడం లేదని ఆ పార్టీ వారే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. తమ ఎంపీ గారిని చూడాలంటే సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లోనో, టీవీలలోనో చూసుకోవాల్సిందేనని స్థానికులు సెటైరికల్‌గా చర్చించుకుంటున్నారు. కనీసం తన పార్లమెంట్ పరిధిలో వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉన్నా.. ఆయన వచ్చి పలుకరించని పరిస్థితిపై స్థానికులు మండిపడుతున్నారట. ఆ ఎంపీ గారు మాత్రం... తనను  గెలిపించిన నియోజకవర్గ ప్రజలను వదిలేసి.. తన సొంతూరు ఉండే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వ్యవహారాల్లో ఎక్కువగా చొరవ చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చూపు కోసం... పార్టీ అగ్రనేతల అనుగ్రహం కోసం అనునిత్యం ప్రయత్నిస్తుంటారని సొంత పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.


ముఖ్యమంత్రికి దగ్గర మనిషిగా ఉన్న వ్యక్తి..

రాజధాని అమరావతి ప్రాంత వాసి అయిన నందిగం సురేష్.. అక్కడ భూసమీకరణ జరిగిన సమయంలో జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞతతో జగన్ ఆయనకు ఏకంగా బాపట్ల ఎంపీ సీటు కేటాయించారు. నందిగం సురేష్‌ బాపట్ల ప్రాంతానికి సంబంధంలేని వ్యక్తి అయినప్పటికీ.. నియోజకవర్గ ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించారు. జగన్ కూడా ఎంపీ నందిగం సురేష్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషించారు. ముఖ్యమంత్రికి దగ్గర మనిషిగా ఉన్న వ్యక్తి.. తమ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారని సంబరపడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎంపీ సురేష్‌ మాత్రం నియోజకవర్గానికి నల్లపూస అయ్యారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. ఆయన ఒక్కదాని వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రాకపోయినా.. కనీసం ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలోనైనా కన్నెత్తి చూడటం లేదన్న అసహనం వ్యక్తం చేస్తున్నారు.


సీఎం క్యాంప్ ఆఫీస్, పార్టీ కార్యాలయాలకే ఆయన పరిమితం 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల బాపట్ల పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మళ్లీ వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఇలా నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో కూడా ఎంపీ నందిగం సురేష్‌ కనీసం పరామర్శకు రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు మినహా నిత్యం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్, పార్టీ కార్యాలయాలకే ఆయన పరిమితం అయ్యారని స్వపక్షీయులే చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండే తాడేపల్లి ప్రాంతం తన పార్లమెంట్ నియోజకవర్గానికి 30,40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. నందిగం సురేష్‌కు తన నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా సమావేశాలు నిర్వహించి చంద్రబాబును, టీడీపీ వారిని విమర్శించడానికే నందిగం సురేష్‌కు సమయం సరిపోతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. 


ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో రాజకీయ విభేదాలు

ఇదిలావుంటే, నందిగం సురేష్‌.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల పార్లమెంటును వదిలేసి తాడికొండ నియోజకవర్గ రాజకీయాలలో వేలు పెట్టడం వివాదాలకు దారితీసింది. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో రాజకీయ విభేదాలు కూడా పొడచూపాయి. ఒకానొక సందర్భంలో ఆమె సురేష్‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను వదిలేసి.. సంబంధంలేని తాడికొండ నియోజకవర్గంలో వేలు పెట్టి వివాదాలు సృష్టించడంపై పార్టీ అధిష్టానం వద్ద పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. పార్టీ పెద్దల జోక్యంతో వారిద్దరి మధ్య వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎంపీ నందిగం సురేష్.. సీఎం జగన్‌ దృష్టిలో పడేందుకు పడుతున్న తపనలో కొంతైనా.. ఓట్లు వేసి గెలిపించిన పార్లమెంట్ ప్రజలపై చూపాలని వైసీపీ నేతలే కోరుతుండటం కొసమెరుపు.

Updated Date - 2021-12-14T17:28:43+05:30 IST