వింత కవ్వింత!

ABN , First Publish Date - 2020-11-26T06:10:28+05:30 IST

ప్రతిపక్షాలను నోరెత్తనివ్వరు.. నిరసన గళాలను..

వింత కవ్వింత!

విపక్షాల నోరు నొక్కేందుకు కొత్త వ్యూహం

ఆందోళనలకు అడుగడుగునా ఆటంకాలు

తటస్థ ముద్రతో అడ్డుకుంటున్న కార్యకర్తలు

ఎక్కడ విపక్ష సమావేశాలు జరిగినా ప్రత్యక్షం

ఎస్సీ సామాజికవర్గంతో వచ్చి ఆటంకం

ఎదురుతిరిగితే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే వ్యూహం

నిబంధనల పేరుతో పోలీసులతోనూ ఒత్తిడి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రతిపక్షాలను నోరెత్తనివ్వరు.. నిరసన గళాలను వినిపించనివ్వరు. జిల్లాలో అధికార పార్టీ కవ్వింతల వింత సంస్కృతికి తెర తీసింది. ఒక నిర్బంధం ఇప్పుడు రాజ్య మేలుతోంది. అధికార పార్టీ నేతల అనుచరులు ఒక వ్యూహంతో, పోలీసులు మరో వ్యూహంతో విపక్షాల నోరు నొక్కేసేందుకు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ నేతల ఈ తీరుపై జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది.  


ప్రజాసమస్యలపై రోడ్డెక్కి నిరసన తెలిపే ప్రతిపక్ష పార్టీ నేతల నొరు నొక్కేందుకు అధికార వైసీపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ప్రతిపక్ష నేతల నిరసనల గళాన్ని వినిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సంస్కృతి జిల్లాలో గతంలో ఎన్నడూ లేదు. ఎక్కడ ప్రతిపక్ష పార్టీ సమావేశాలు జరిగితే అక్కడ ‘తటస్థ’ ముసుగులో వైసీపీ నేతలు ప్రత్యక్షమైపోతున్నారు. వారితోపాటు కొద్ది మంది ఎస్సీ సామాజికవర్గంవారిని తీసుకొస్తున్నారు. సమావేశాలను అడ్డుకుంటూ, ప్రతిపక్ష నేతలను కవ్విస్తున్నారు. తమ వ్యూహం ఫలించి ప్రతిపక్ష నేతలు ఘర్షణకు దిగితే, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించాలన్నది వైసీపీ నేతల లక్ష్యంగా ఉంది. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు సంఘటనలు వైసీపీ నేతల ఉద్దేశాలకు అద్దం పడుతున్నాయి. 


మాజీ మంత్రి ఉమ లక్ష్యంగా.. 

మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జనంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొంది. మరోవైపు అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతూ ఆయన బామ్మర్ది వందల కోట్లు ఆర్జిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలను, ఎమ్మెల్యే అసమర్థతను ఎండగట్టడంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ముందుంటున్నారు. దీంతో కృష్ణప్రసాద్‌ తీవ్ర అసహనానికి గురవుతూ, దేవినేని ఉమను లక్ష్యంగా చేసుకుని ఆయనపై దాడికి తెగబడేలా తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఉమ సమావేశాలు జరిగితే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యక్షమవుతున్నారు. ఉమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సంయమనం కోల్పోయినా ఆయనపై దాడికి తెగబడటమో, లేక అట్రాసిటీ కేసు నమోదు చేయించడమో వైసీపీ నేతల లక్ష్యంగా ఉంది.  


కొండపల్లి రక్షిత అటవీప్రాంతంలోనూ షాబాదలో టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాంతంలోనూ ఎమ్మెల్యే బావమరిది కొండలను అక్రమంగా తవ్వించి, గ్రావెల్‌ను తరలించడంపై నిరసన తెలిపేందుకు మాజీ మంత్రి ఉమ ఇటీవల షాబాదను సందర్శించారు. అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ అక్కడే ఆందోళనకు దిగారు. దీన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలను పురమాయించారు. వారు గ్రామస్థుల ముసుగులో ఆ ప్రాంతానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. గొడవపడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు వారు సిద్ధమై వచ్చినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి గ్రావెల్‌ అక్రమ తరలింపుపై ఫిర్యాదు చేసింది స్థానికులే. అలాంటిది గ్రామస్థులు ప్రతిపక్ష నేతల ఆందోళనను ఎందుకు అడ్డుకుంటారన్నది ప్రశ్న. వైసీపీ కార్యకర్తలే గ్రామస్థుల ముసుగులో వచ్చి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నది వాస్తవం. 


జి.కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద దేవినేని ఉమ పసుపు చైతన్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై నిరసన తెలిపారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంత మంది ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారితో అక్కడికి వచ్చారు. నేరుగా ఉమ వద్దకు వెళ్లి గొడవకు దిగారు. టీడీపీ నేతలు సంయమనంతో వ్యవహరించి వారికి సర్ది చెప్పి పంపారు. 


జి.కొండూరు మండలం కోడూరులో మంగళవారం ‘పసుపు చైతన్యం’ జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని వలంటీరు ఒకరు రికార్డు చేసి, అధికార పార్టీ నేతలకు పంపడం గమనార్హం. 


అడుగుడుగునా అడ్డంకులే.. 

వైసీపీ పాదయాత్రలకు ఎటువంటి అభ్యంతరం చెప్పని పోలీసులు ప్రతిపక్ష నేతల ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు మాత్రం నిబంధనల పేరుతో అనుమతులు నిరాకరిస్తున్నారు. టిడ్కో ఇళ్ల కోసం విపక్ష నేతలు తలపెట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పలువురు నేతలను హౌస్‌అరెస్ట్‌ చేశారు. చిన్నపాటి సమావేశాలకు సైతం నిబంధనలను సాకుగా చూపి అనుమతి నిరాకరిస్తున్నారు. విజయవాడలో ఇటీవల టీడీపీ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్యవైశ్య సమ్మేళనాన్ని సైతం అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. 

Updated Date - 2020-11-26T06:10:28+05:30 IST