పశ్చిమ వైసీపీలో అసమ్మతి!

ABN , First Publish Date - 2022-05-26T06:32:06+05:30 IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చిచ్చు రాజుకుంటోంది.

పశ్చిమ వైసీపీలో అసమ్మతి!

వెలంపల్లి తీరుపై కొందరు మండిపాటు

 బాహాటంగానే సీనియర్ల తిరుగుబాటు 

 తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న నాయకులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చిచ్చు రాజుకుంటోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తీరుపై స్థానిక నాయకుల్లో అసంతృప్తి తీవ్రమవుతోంది. వెలంపల్లి ఒంటెద్దుపోకడతో సీనియర్లకు చిర్రెత్తుకొస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను పక్కనపెట్టి ఇతర పార్టీల వారిని తీసుకొచ్చి పదవులు, నామినేటెడ్‌ పోస్టులు కట్టబెడుతుండటం, ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగడం నిత్యకృత్యమవుతోంది. వీటిపై తాడోపేడో తేల్చుకునేందుకు అసమ్మతి నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ కారణంగానే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. 

(విజయవాడ- ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : 

కొద్దిరోజుల క్రితం వైసీపీ సీనియర్‌ నాయకుడు దాడి జగన్‌ ఆధ్వర్యంలో పలువురు సీనియర్‌ నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వెలంపల్లి తమను అణగదొక్కుతున్న వైనంపై చర్చించుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రితోపాటు అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. తమ ఆవేదనపై వారు స్పందించకపోతే తదుపరి కార్యాచరణకు దిగాలని  నిర్ణయించుకున్నారు. తాజాగా వైసీపీ యువజన విద్యార్థి సంఘ నాయకుడు దాడి మురళి బుధవారం పంజా సెంటర్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలోకి వచ్చిన ఇతర పార్టీల నాయకులపైనా, వారిని ప్రోత్సహిస్తున్న నాయకులపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున ప్రచారం చేసిన నాయకుడు ప్రస్తుతం వైసీపీలోకి వచ్చి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. వెలంపల్లి కాళ్లు పట్టుకుని నామినేటెడ్‌ పదవులు తెచ్చుకుంటున్న వాళ్లు వైసీపీకి ఏ విధంగా పనిచేస్తారని ప్రశ్నించారు. అలాంటి వారిని వెలంపల్లి ప్రోత్సహించడం ఏమిటని నిలదీశారు. 

ఏడాది నుంచే అసమ్మతి సెగలు

వెలంపల్లి మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో తొలి నుంచీ పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీ నుంచి వచ్చిన శీలం వెంకట్రావు లాంటి వారికి నామినేటెడ్‌ పోస్టులు కట్టబెట్టి సొంత పార్టీ వారిని పక్కన పెట్టారన్న విమర్శలు వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. వీఎంసీ ఎన్నికల్లో సైతం వెలంపల్లి ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. 

సొంత పార్టీ వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వెలంపల్లి పెద్ద పీట వేయడం అప్పట్లో పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగల్చింది. సుమారు ఏడాది క్రితమే వెలంపల్లి తీరును ప్రశ్నిస్తూ పార్టీ సీనియర్‌ నాయకుడు దాడి అప్పారావు పెద్దఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెలంపల్లి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించినట్లు ప్రచారం చేయించుకున్నారు. వాస్తవానికి అధిష్ఠానం అప్పారావుపై ఎలాంటి సస్పెన్షన్‌ వేటు వేయలేదు. అధిష్ఠానం పెద్దల ఆశీస్సులతో అప్పారావు ఆ తర్వాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పదవి తెచ్చుకున్నారు. 

వైసీపీ అధిష్ఠానాన్ని కలిసేందుకు సిద్ధం

రానున్న రోజుల్లో మరికొందరు సీనియర్లు వెలంపల్లిపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెలంపల్లి తొలి నుంచీ పదవుల కోసం పార్టీలు మారుతూ వచ్చారని, అలాంటి వ్యక్తి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను అణగదొక్కి తన వ్యక్తిగత లబ్ధి కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వెలంపల్లికి సీటు ఇవ్వవద్దని వైసీపీ అధిష్ఠానాన్ని కోరాలని, తమ విన్నపాలను కాదని ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని సీనియర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. 

వెలంపల్లి ఒంటెద్దు పోకడకు కొన్ని ఉదాహరణలు

  జనసేన నుంచి వచ్చిన శీలం వెంకట్రావుకు నగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోస్టు ఇప్పించిన వెలంపల్లి, సొంత పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు దాడి జగన్‌ సతీమణికి సింహాచలం దేవస్థానం కమిటీ సభ్యురాలిగా అవకాశం వచ్చినా నియామక ఉత్తర్వులను రద్దు చేయించారు.  జనసేన నుంచి వచ్చిన మద్దిల రామకృష్ణకు ఎస్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా, వైసీపీతో సంబంధం లేని సొంత సామాజికవర్గానికి చెందిన ఓ వ్యాపారవేత్త భార్యను దుర్గగుడి దేవస్థానం కమిటీలో సభ్యురాలిగా కూర్చోబెట్టారు.  ఇవన్నీ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వైసీపీ సీనియర్లకు తీవ్ర ఆగ్రహాన్ని కలుగజేశాయి.  టీడీపీ నుంచి వచ్చిన శీలంశెట్టి పూర్ణచంద్రరావుకు 55వ డివిజన్‌ వైసీపీ టికెట్‌ ఇప్పించారు. ఇక్కడి నుంచి వైసీపీ టికెట్‌ ఆశించిన బొబ్బిలి లీలాకుమార్‌, మధిరి ప్రభాకర్‌, ఏనుగుల రమేశ్‌కు మొండిచేయి చూపారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఇర్ఫాన్‌కు 41వ డివిజన్‌ టికెట్‌ ఇచ్చారు. ఈ స్థానం నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆస్తులు అమ్ముకుని పనిచేస్తున్న ట్రావెల్స్‌ ఖాదర్‌కు మొండిచేయి చూపారు.


Updated Date - 2022-05-26T06:32:06+05:30 IST