పెనమలూరు వైసీపీలో అసమ్మతి

ABN , First Publish Date - 2022-08-17T05:53:44+05:30 IST

పెనమలూరు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చిచ్చు రేగింది.

పెనమలూరు వైసీపీలో అసమ్మతి

పార్టీలోని కొందరు పెద్దల వేధింపులు

 పదవికి ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు పూర్ణిమ రాజీనామా

 ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని వెల్లడి

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : పెనమలూరు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చిచ్చు రేగింది. పార్టీ పెద్దల దన్ను చూసుకుని ఏకంగా జడ్పీటీసీ సభ్యురాలి ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ పార్టీ పెద్దల వేధింపులు తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆమె ప్రకటించారు. 

పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండల పరిధిలో కాటూరుకు చెందిన పూర్ణిమ ఉయ్యూరు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలైనప్పటికీ ఆమెకు స్థానికంగా ఎలాంటి గౌరవమూ దక్కడం లేదు. ఎమ్మెల్యే వర్గంగా భావిస్తున్న కొలుసు పోతురాజు, తదితరులు ఓ గ్రూపుగా చలామణి అవుతూ ఉయ్యూరులో పెత్తనం చెలాయిస్తున్నారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్ణిమ దగ్గర బంధువు సజ్జా అనూష కాటూరు-2 సెగ్మెంట్‌ నుంచి టీడీపీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. అనూష విజయానికి జడ్పీటీసీ సభ్యురాలి భర్త కోటయ్యచౌదరి సహాయ సహకారాలు అందించారని, టీడీపీతో కుమ్మక్క య్యారని స్థానిక అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పార్థసారఽథికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం కోటయ్య చౌదరి ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి స్థానిక అధికార పార్టీ నాయకులతో పూర్ణిమ, ఆమె భర్త కోటయ్య చౌదరికి విభేదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థి అనూష విజయానికి.. తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని కోటయ్య తన అనుచరుల దగ్గర వాపోయారు.  పార్టీ పెద్దల నియంతృత్వ ధోరణి భరించలేక పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు.  

  కొంపముంచుతున్న కోటరీలు

పెనమలూరు నియోజకవర్గ వైసీపీలో కోటరీలు పెరిగిపోతున్నాయని, ఫలితంగా పార్టీ నష్టపోతోందని వైసీపీ అభిమానులు వాపోతున్నారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పేరుతో ఇద్దరు వ్యక్తులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, లే అవుట్‌ యజమానుల నుంచి, బిల్డర్ల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లే అవుట్‌లు వేసే వారు ఎకరానికి రూ.5 లక్షలు, బిల్డర్లు అనధికార ఫ్లాటుకు లక్ష రూపాయలు చొప్పున మామూళ్లు చెల్లించుకోవాల్సి వస్తోందని రియల్టర్లు వాపోతున్నారు. ఈ కోటరీల కారణంగా ఆది నుంచీ పార్టీని వెన్నంటి ఉన్న వారు సైతం పార్టీకి దూరమవుతున్నారని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2022-08-17T05:53:44+05:30 IST