గుంటూరు జిల్లా వైసీపీలో వార్.. తహసీల్దారు విషయంలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

ABN , First Publish Date - 2021-10-04T05:48:51+05:30 IST

జిల్లాలో ఒక మండల తహసీల్దారు విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వార్‌ జరుగుతుంది.

గుంటూరు జిల్లా వైసీపీలో వార్.. తహసీల్దారు విషయంలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ

రసవత్తరంగా రాజకీయ కుమ్ములాట 

సాగనంపాలని ఒకరు.. కొనసాగించాలని మరొకరు పట్టు

పదిరోజులైనా అమలుకాని కలెక్టర్‌ డిప్యూటేషన్‌ ఉత్తర్వులు


గుంటూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక మండల తహసీల్దారు విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వార్‌ జరుగుతుంది. వీరిద్దరి మధ్యన గత కొన్ని నెలలుగా రాజకీయ పోరాటం కొనసాగుతుండగా ప్రస్తుతం తహసీల్దారు బదిలీ మరింత ఆజ్యం పోసింది. తన నియోజకవర్గంలో ఆ తహసీల్దారు ఉండడానికి వీల్లేదని కొన్ని నెలలుగా ఆ ఎమ్మెల్యే పలుమార్లు లేఖలు కూడా రాశారు. ఎట్టకేలకు డిప్యూటేషన్‌ బదిలీ ఆర్డర్స్‌ వెలువడగా అవి అమలు జరగకుండా ఆ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తోన్న ఎంపీ అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రాజకీయ కుమ్ములాట రసవత్తరంగా మారింది. జిల్లాలోని ఆ మండలంలోని భూములు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎకరం రూ.2 కోట్ల వరకు పలికాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రియాల్టర్లు వచ్చి భూములు కొనుగోలు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొన్న నిర్ణయంతో భూముల ధరలు పడిపోతూ వస్తున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే మళ్లీ రెండున్నరేళ్ల క్రితం ఉన్న భూమ్‌ వస్తుందన్న ఆశలు నెలకొంటున్నాయి. కాగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దారు స్థానిక ఎమ్మెల్యేని ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఆపై చెప్పిన పనులు కాదు కూడదని పక్కన పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ తహసీల్దారు తన నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదని, గత కొన్ని నెలలుగా సంబంధిత ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు కూడా చేస్తూ వస్తున్నారు.


పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు లేఖలు కూడా పంపించారు. ఇదే సమయంలో ఆ తహసీల్దారుకు వైసీపీకి చెందిన ఓ ఎంపీ ఒత్తాసు పలుకుతున్నారు. దీంతో ఆ మండలం నుంచి కదిలించడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. పది రోజుల క్రితం డిప్యూటేషన్‌ పేరుతో తహసీల్దారుని బదిలీ చేసి వేరొకరికి అక్కడి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటివరకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ జారీ చేసిన ఆర్డర్స్‌ అమలుకు నోచుకోలేదు. తహసీల్దారు రిలీవింగ్‌ కాకుండా కొనసాగుతున్నారు. ఇందుకు కారణం ఎంపీ ఆదేశాలేనని సమాచారం. కాగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంతో సంబంధం లేని ఆ ఎంపీ పెత్తనం ఏమిటని ఎమ్మెల్యే వైసీపీ అధిష్ఠానం వద్ద ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తీసుకొంటుందోనన్న ఉత్కంఠని రేకెత్తిస్తున్నది. 



Updated Date - 2021-10-04T05:48:51+05:30 IST