సరికొత్త సారథులు

ABN , First Publish Date - 2021-07-18T16:12:07+05:30 IST

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న..

సరికొత్త సారథులు

జిల్లా నుంచి 11 మందికి నామినేటెడ్‌ పదవులు

పశ్చిమ, పెనమలూరు నియోజకవర్గాలకు పెద్దపీట


విజయవాడ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల పంపకాలు శనివారం జరిగాయి. జిల్లా నుంచి 10 మందికి నామినేటెడ్‌ పోస్టులు దక్కగా, పశ్చిమ గోదావరి జిల్లా కోటాలో హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన కనుమూరి సుబ్బరాజును పదవి వరించింది. దీంతో జిల్లాకు 11 పోస్టులు దక్కినట్టైంది. తమ నేతలకు పదవులు రావడంతో జిల్లావ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 


రాష్ట్ర అటవీశాఖాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అరుణకుమార్‌

నందిగామ: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు సోదరుడు అరుణకుమార్‌ను రాష్ట్ర అటవీశాఖాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి వరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రస్థాయిలో క్రియాశీలక నేతగా ఎదిగిన అరుణకుమార్‌ ఉన్నత విద్యావంతుడు కావటంతో పాటు ఢిల్లీలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన నియామకంతో స్థానిక కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అరుణకుమార్‌ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  


ఏపీ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌

వన్‌టౌన్‌ : ఏపీ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నూతన చైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌ నియమితులయ్యారు. వన్‌టౌన్‌లోని వించిపేటకు చెందిన షేక్‌ ఆసిఫ్‌ (54) మొదటి నుంచి వైసీపీలో క్రియాశీలక పదవులు చేపట్టారు. పాత 40వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. అప్పటి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, ఆసిఫ్‌ను పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా నియమించారు. ఆ తరువాత వెలంపల్లి శ్రీనివాసరావు వైసీపీలో చేరడంతో ఎమ్మెల్యే సీటు ఆయనకే ఇచ్చారు. ఆసిఫ్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవడంతో ఏపీ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. కాగా, శనివారం పంజా సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి ఆసిఫ్‌ క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత పంజా సెంటర్‌ వద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మైనారిటీల పక్షపాతి అన్నారు. అనంతరం ఆసిఫ్‌ను పలువురు నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యలకల చలపతిరావు, శిరంశెట్టి పూర్ణ, మైనారిటీ నాయకులు ఇమామ్‌ ఖాన్‌, వాబిద్‌ఖాన్‌, ఎంపీ మొహమ్మద్‌, పైడాడ శ్రీనివాసరావు, బీపీ రమేష్‌, నరేంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా తన్నీరు నాగేశ్వరరావు

జగ్గయ్యపేట: కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా జగ్గయ్యపేటకు చెందిన మాజీ మునిసిపల్‌ చైర్మన్‌, జిల్లా వైసీపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు నియమితులయ్యారు. యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తన్నీరు ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుకు విధేయుడిగా ఉన్నారు. ఆయనతో పాటు వైసీపీలో చేరారు. 2005లో కౌన్సిలర్‌గా, 2014లో కౌన్సిలర్‌గా ఎన్నికై చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తనపై విశ్వాసం ఉంచి ఇచ్చిన బాధ్యతలను వమ్ము చేయకుండా పనిచేస్తానని, తనకు పార్టీ పట్ల ఉన్న అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణను గుర్తించి అతిపెద్ద పదవి రావటానికి కృషిచేసిన ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభానుకు జీవితకాలం రుణపడి ఉంటానని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. కాగా, తన్నీరు నాగేశ్వరరావు శనివారం ఉదయభాను ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తల సమక్షంలో ఉదయభానుకు పాదాభివందనం చేశారు. తనకు పదవి రావడానికి కృషిచేసిన ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా ఎమ్మెల్యేల అండదండలతో పనిచేస్తానని చెప్పారు.  


ఆర్టీసీ రీజనల్‌ చైర్‌పర్సన్‌గా తాతినేని పద్మావతి

పెనమలూరు: కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఆర్టీసీ రీజనల్‌ చైర్‌పర్సన్‌గా తాతినేని పద్మావతి నియమితులయ్యారు. టీడీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన పద్మావతి ఎన్టీఆర్‌ మరణించిన తరువాత కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్‌ మృతిచెందిన తరువాత వైసీపీలో చేరారు. గతంలో ఈమె కాంగ్రెస్‌, వైసీపీలో నామినేటెడ్‌ పదవులు పొందడంతో పాటు సంస్థాగత ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. 1997లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1995లో పెనమలూరు ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. 2000లో ఏపీ మహిళా కాంగ్రెస్‌ జాయింట్‌ సెక్రటరీగా, 2006లో జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా, అదే సంవత్సరం వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా, 2013లో పెనమలూరు పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014లో తోట్లవల్లూరు మండల జెడ్పీటీఈసీగా గెలుపొందారు. ఆ తదుపరి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా తాతినేని పద్మావతి మాట్లాడుతూ వైసీపీ  ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేశారన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణతో పాటు నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డికి,  జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.


గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా టీజే పూర్ణమ్మ

చిట్టినగర్‌: కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా చిట్టినగర్‌లోని భీమనవారిపేటకు చెందిన తిప్పరమల్లి జమల పూర్ణమ్మ నియమితులయ్యారు. దీంతో పలువురు వైసీపీ నాయకులు, గ్రంథాలయ ఉద్యోగులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. పూర్ణమ్మ భర్త ఆనందరావు రైల్వే విశ్రాంత ఉద్యోగి. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1978 నుంచి కుటుంబమంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. పూర్ణమ్మ కుమారుడు అశోక్‌ యాదవ్‌ వైసీపీ  నగర యూత్‌ నాయకుడిగా ఉన్నారు. 2014లో పాత 35వ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా  నియమించడం ఆనందంగా ఉందని పూర్ణమ్మ అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సంస్థ అభివృద్ధికి, ప్రజలు, విద్యార్థులు, అన్ని వర్గాలకు సేవలందిస్తానని చెప్పారు.


జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌గా స్నిగ్ధ

కంకిపాడు: జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌గా ప్రొద్దుటూరుకు చెందిన పడమట సురేష్‌బాబు పెద్ద కుమార్తె స్నిగ్ధను నియమించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే ఉంటూ అనేక ఆటుపోట్లకు గురైన పటమట సురేష్‌బాబుకు ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందని స్థానిక వైసీపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, రక్ష ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. 


 ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పుణ్యశీల

పాతరాజరాజేశ్వరి పేట: తనపై అపారమైన నమ్మకంతో  ముఖ్యమంత్రి జగన్‌ కీలకమైన బాధ్యత అప్పగించడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. ఆమె వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో వీఎంసీ 48వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 34వ డివిజన్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. వైసీపీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. మేయర్‌ రేసులో ఉన్న పుణ్యశీల సొంత పార్టీ రాజకీయాల కారణంగా ఆ పదవి దక్కించుకోలేకపోయారు. మేయర్‌ సీటు దక్కనందుకు కినుక వహించిన ఆమె కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకుండా కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు తిరిగి కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేసి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తనకు పదవి దక్కటానికి మంత్రి వెలంపల్లి కృషి చేశారని పుణ్యశీల అన్నారు.  


కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తుమ్మల

కంకిపాడు: కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌ నియామకంపై కంకిపాడులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం తుమ్మల చంద్రశేఖర్‌ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్‌ ద్వారా కమ్మ సామాజికవర్గ ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తుమ్మలకు పదవి హర్షణీయమని తుమ్మల బుడ్డి యువసేన అధ్యక్షుడు కొప్పరాజు సురేష్‌ ఆనందం వ్యక్తం చేశారు.


కాపు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  చైర్మన్‌గా అడపా శేషు

కృష్ణలంక: కాపు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ అడపా శేషును ప్రభుత్వం నియమించింది. వంగవీటి మోహనరంగా అభిమాని అయిన అడపా శేషు పదిహేనేళ్ల క్రితం అప్పటి 22వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. 20వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న శేషు రాష్ట్రంలోని కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


ఏపీ రోడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు

హనుమాన్‌ జంక్షన్‌: రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా  హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన వైసీపీ నేత కనుమూరి సుబ్బరాజు అలియాస్‌ రాజాబాబు నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా క్షత్రియ సామాజిక కోటాలో రాజాబాబును ఎంపిక చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికి రాజాబాబు కృషి చేశారు. హనుమాన్‌ జంక్షన్‌ అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఆయన తండ్రి సూర్యనారాయణరాజు, కుటుంబసభ్యులు పాటుపడ్డారు. రాజాబాబు నియామకం పట్ల వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాజాబాబు మాట్లాడుతూ తనను పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 


ముడా చైర్‌పర్సన్‌గా భవానీ 

మచిలీపట్నం టౌన్‌: మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్‌పర్సన్‌ పదవి.. అర్బన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్‌ భార్య వెంకట కనకదుర్గా నాగలక్ష్మీ భవానీకి దక్కింది. డిగ్రీ వరకూ చదివిన నాగలక్ష్మి 1996, ఫిబ్రవరిలో విఠల్‌ను వివాహమాడారు. నాగలక్ష్మికి పదవి దక్కడం పట్ల మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, మంత్రి పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి, పలువురు కార్పొరేటర్లు, సర్పంచ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. నాగలక్ష్మి మాట్లాడుతూ ముడా చైర్‌పర్సన్‌ పదవికి న్యాయం చేస్తానని, మచిలీపట్నం నగరపాలక సంస్థ అభివృద్ధికి పాటుపడతానన్నారు.

Updated Date - 2021-07-18T16:12:07+05:30 IST