వైసీపీ పోలీస్‌

ABN , First Publish Date - 2022-09-20T06:08:55+05:30 IST

మంచి పని అయినా సరే.. మీరు చెయ్యడానికి వీలు లేదు. అంతే..!’ ఇది అధికార పార్టీవారి తీరు. ఎండిన గొంతులు తడిపినా, అపరిశుభ్రతను తొలగించినా, చివరకు బడి పిల్లల సమస్యలను పరిష్కరించినా ఒప్పుకోరు

వైసీపీ పోలీస్‌
టీడీపీ కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ను హెచ్చరిస్తున్న పోలీసులు (ఫైల్‌)

టీడీపీ వర్గీయులే టార్గెట్‌

మంచి పనులు చేసినా కేసులు

కదిలితే వార్నింగ్‌లు.. లాఠీ దెబ్బలు..

నివ్వెరపరిచేలా పోలీసుల తీరు


మంచి పని అయినా సరే.. మీరు చెయ్యడానికి వీలు లేదు. అంతే..!’ ఇది అధికార పార్టీవారి తీరు. ఎండిన గొంతులు తడిపినా, అపరిశుభ్రతను తొలగించినా, చివరకు బడి పిల్లల సమస్యలను పరిష్కరించినా ఒప్పుకోరు.  కాదూ కూడదని చేస్తే పోలీసులను రంగంలోకి దింపుతారు. దాడులు చేస్తారు. క్రిమినల్‌ కేసులు పెట్టిస్తారు. బైండోవర్‌ చేయిస్తారు. తెలుగుదేశం పార్టీవారికి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన కలలో కూడా రాకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వ పాలన జరుగుతోందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ‘ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు చందాలు వేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. టీడీపీ వర్గీయులు అని.. వారిని కూడా వేధిస్తున్నారు..’ అని ప్రధాన ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు విస్మయం కలిగించేలా ఉన్నాయి. పోలీసుల తీరు విమర్శలకు దారితీస్తోంది. 

- తాడిపత్రి


అప్పుడూ అంతే..

- తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పైపులైనకు ఎస్టీపీ వద్ద మరమ్మతు చేసేందుకు మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారు. నిధులు లేవని అధికారులు జాప్యం చేయడంతో రూ.5 లక్షలు ఖర్చు చేసి, మరమ్మతుకు ప్రయత్నించారు. కానీ వైసీపీవారు అడ్డుకున్నారు. గతంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో తాము పనులు చేశామని, మరోసారి అదే పద్ధతిలో చేయాలని అనుకుంటే.. మధ్యలో చైర్మన ఉచితంగా ఎలా చేస్తారని వైసీపీ నాయకులు అడ్డుతగిలారు. ఆ పనులు వల్ల వచ్చే ఆదాయానికి గండిపడుతుందని పనులను జరగనివ్వలేదు. పనులను పర్యవేక్షిస్తున్న టీడీపీ కౌన్సిలర్లు, అక్కడున్న విలేకరులపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగింది. చోద్యం చూసిన పోలీసులపై ఎస్పీ ఫక్కీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరపాలని డీఎస్పీని ఆదేశించారు. దీంతో బాధ్యులపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. కానీ నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. ఉన్నతాధికారుల తీరు కిందిస్థాయి పోలీసు అధికారులకు మరింత ఊపునిచ్చింది.  వైసీపీ వర్గీయులు ఏం చెప్పినా చేసేస్థాయికి చేరారు. 

- గాయపడ్డ టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జున ఫిర్యాదు చేసినా, ప్రధాన నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయలేదు. పైగా విచారణ పేరుతో పోలీ్‌సస్టేషనకు పిలిపించి బాధితుడికి కౌన్సెలింగ్‌ చేశారు. ఆ తరువాత పైపులైను మరమ్మతు పనులకు మున్సిపల్‌ అధికారులు టెండర్‌ పిలిచారు. ఆ టెండర్‌ను వైసీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్నారా అంటే.. అదీ లేదు. అంచనా రేట్లకంటే తక్కువకు, కేవలం రూ.3 లక్షలకు టీడీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. అధికార పార్టీవారికి డబ్బుమీద యావ తప్పితే ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రూ.5 లక్షల సొంత డబ్బుతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి పనులు చేస్తుంటే అడ్డుకున్నారని, ఇప్పుడు అవే పనులకు మున్సిపాలిటీ రూ.3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నారు. 


డ్రైనేజీ పనులూ వద్దట

 తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లికాలనీలో మురుగునీరు నిలుస్తోంది. సమస్య పరిష్కారానికి పైప్‌లైన వేసుకోవాలని జనం చందాలు వేసుకున్నారు. దీనికి సహకరిస్తున్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, టీడీపీ సర్పంచ ఉమామహేశ్వర్‌ను వైసీపీ మద్దతుదారులు ఆదివారం అడ్డుకున్నారు. పనులకు స్థానికుల మద్దతు ఉండడంతో పోలీసుల సాయం తీసుకున్నారు. శాంతిభద్రతల పేరుతో పోలీసు టీడీపీ నాయకులను బైండోవర్‌చేశారు. 


వరద కాలువలో కొట్టుకుపోయిన నిబంధనలు

పట్టణంలోని నవరంగ్‌ టాకీస్‌ వద్ద వరద కాలువ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు స్పందించలేదు. వైసీపీ నాయకుడికి మేలు జరిగేలా చూశారు. టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకోవాలని చూస్తే.. కేసులు పెడతామని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. పోలీసులు దగ్గరుండి మరీ పనులను పూర్తిచేయించారు. విస్తరించాల్సిన కాలువను మరింత కుదించి, బండలు వేశారు. ప్రస్తుతం ఈ కాలువ పైభాగం వైసీపీ నాయకుడి భవనంలో ఉన్న బ్యాంక్‌ ఖాతాదారులు, కింద ఉన్న దుకాణాలకు వచ్చివెళ్లేవారి వాహనాలకు పార్కింగ్‌ స్థలం అయ్యింది. 


ప్రశాంతంగా ఉన్న పల్లెలో..

యాడికి మండలంలోని ప్రశాంతంగా ఉన్న కోనుప్పలపాడులో అలజడికి పరోక్షంగా పోలీసులు కారణమయ్యారు. టీడీపీ నాయకుడు చవ్వా గోపాల్‌రెడ్డి సొంత స్థలంలో ఉన్న గేటును పోలీసుల సాయంతో వైసీపీ మద్దతుదారులు తొలగించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఆ తరువాత కొన్నాళ్లకే యానిమేటర్‌ విషయంలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. యానిమేటర్‌ పనిచేస్తున్న టీడీపీ మద్దతుదారున్ని తొలగించాలని వైసీపీ వర్గీయులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గొడవకు కారణమైన వైసీపీవారిపైపోలీసులు కేసు నమోదు చేయలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ వర్గీయులను స్టేషన నుంచి బయటకు పంపించారు. ఆ తరువాత వైసీపీ మద్దతుదారుల  ఫిర్యాదు ఆధారంగా టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేశారు. స్టేషనకు పిలిపించి డీఎస్పీ చైతన్య చితకబాదారు. లాఠీ దెబ్బలకు తాళలేక టీడీపీ వర్గీయులు ఆసుపత్రిపాలయ్యారు. తాడిపత్రి కోర్టులో డీఎస్పీపై ప్రైవేట్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. 


Updated Date - 2022-09-20T06:08:55+05:30 IST