చింతపల్లి ఎంపీపీగా వైసీపీ రెబల్‌ బాబూరావు

Sep 25 2021 @ 01:18AM
వంతల బాబూరావు, ఎంపీపీ

 

చింతపల్లి, సెప్టెంబరు 24: స్థానిక మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠగా సాగింది. చివరకు లాటరీ ద్వారా వైసీపీ రెబల్‌ అభ్యర్థి ఎంపీపీ అయ్యారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాల యంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీకి పది, కాంగ్రెస్‌ రెండు, టీడీపీ, సీపీఐ ఒక్కొక్కటి, స్వతంత్రులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు. శుక్రవారం ఉదయం ఎంపీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి పోటీ చేయగా.. వైసీపీ రెబల్‌ అభ్యర్థిగా చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యుడు వంతల బాబూరావు బరిలో నిలిచారు. ఇరువురుకి పదేసి మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీంద్రనాథ్‌ ఎన్నికల నిబంధనల ప్రకారం లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో వైసీపీ రెబల్‌ అభ్యర్థి వంతల బాబూరావు విజయం సాధించడంతో ఎంపీపీగా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. వైస్‌ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎ.శనివారం ఎంపీటీసీ సభ్యుడు సాగిన వెంగళరావు, వైసీపీ రెబల్‌ అభ్యర్థి కొత్తపాలెం-1 ఎంపీటీసీ సభ్యురాలు గోపినాయక్‌ శారద పోటీచేశారు. వెంగళరావుకి 9 ఓట్లు, గోపీనాయక్‌ శారదకు 11ఓట్లు వచ్చాయి. దీంతో శారదను వైస్‌ఎంపీపీగా ఎన్నికైనట్టు ఆర్‌వో ప్రకటించారు. కోఆప్షన్‌ సభ్యుడుగా షేక్‌ నాజర్‌వల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రెబల్‌ అభ్యర్థులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు విప్‌ అస్త్రం వినియోగించినప్పటికీ ఎమ్మెల్యే ఎదుటే అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసి రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.