వైసీపీ కార్యకర్త దాడి

ABN , First Publish Date - 2022-10-08T05:34:10+05:30 IST

పాతకక్షల నేపథ్యంలో ఓ వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న టీడీపీ కార్యకర్త కళ్లల్లో కారం చల్లి, కొడవలితో తలపై దాడి చేశాడు. అనంతరం కట్టెలో విచ్చలవిడిగా కొట్టాడు. స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి, వదిలేసి వెళ్లాడు.

వైసీపీ కార్యకర్త దాడి
గాయపడిన టీడీపీ కార్యకర్త జోగి కొండన్న


టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు

రాప్తాడు, అక్టోబరు 7: పాతకక్షల నేపథ్యంలో ఓ వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న టీడీపీ కార్యకర్త కళ్లల్లో కారం చల్లి, కొడవలితో తలపై దాడి చేశాడు. అనంతరం కట్టెలో విచ్చలవిడిగా కొట్టాడు. స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి, వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు, టీడీపీ కార్యకర్త జోగి కొండన్నకు, వైసీపీ కార్యకర్త పసుపుల ముత్యాలప్పకు దాదాపు పదేళ్ల క్రితం చిన్న ఘర్షణ జరిగింది. జోగి కొండన్న శుక్రవారం పొలంలో ఒంటరిగా పని చేసుకుంటుండగా, వైసీపీ కార్యకర్త ముత్యాలప్ప అక్కడికి వెళ్లి కొండన్న కళ్లలో కారం చల్లాడు. కొడవలితో తలపై దాడి చేశాడు. అనంతరం కట్టెతో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో కొండన్న స్పృహ తప్పి పడిపోయాడు. కొండన్న చనిపోయాడని భావించి.. ముత్యాలప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొండన్న ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆయన కొడుకు పొలం వద్దకు వెళ్లాడు. స్పృహ తప్పి పడిపోయిన తండ్రిని చూసి వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించాడు. చికిత్స నిమిత్తం వెంటనే బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-10-08T05:34:10+05:30 IST