యడ్డి నిష్క్రమణ

ABN , First Publish Date - 2021-07-27T06:37:22+05:30 IST

ఎవరూ కోరలేదు, ఏ ఒత్తిడీ లేదు, స్వచ్ఛందంగానే తప్పుకున్నాను అని చెబుతున్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కంట ఆ కన్నీరెందుకు? యడ్డి అధికారికంగా సోమవారం రాజీనామా...

యడ్డి నిష్క్రమణ

ఎవరూ కోరలేదు, ఏ ఒత్తిడీ లేదు, స్వచ్ఛందంగానే తప్పుకున్నాను అని చెబుతున్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కంట ఆ కన్నీరెందుకు? యడ్డి అధికారికంగా సోమవారం  రాజీనామా చేసివుండవచ్చు కానీ, సాంకేతికంగా ఆయన ఆ పదవినుంచి తప్పుకొని పక్షంరోజులపైనే అయింది. ఆరోగ్యం బాగోలేదు, పదవి మోయలేకున్నాను, మీరు సరేనంటే ఆ భారం దించుకుంటాను అంటూ ఆయన ఎప్పుడో ప్రధానికి లేఖ రాశారు, రాయవలసి వచ్చింది. యడ్డిని బీజేపీ అధిష్ఠానం తప్పించబోతున్నదని ప్రపంచానికి తెలిసి చాలాకాలం అయినా, అది గౌరవంగా జరగాలని పార్టీ పెద్దలు అనుకోవడం వల్లా, ఆయన షరతుల్లో కనీసం కొన్నింటిని ఆమోదించడానికి కొంత సమయం పట్టినందునా వ్యవహారం ఇప్పటికి తేలింది. 


యడ్డి ఎన్నిచెప్పినా, రాజీనామా ప్రకటన సందర్భంగా ఉబికివచ్చిన ఆ కన్నీటినీ, ఉద్వేగాన్నీ దాచుకోలేకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. తమ ముఖ్యమంత్రి ఎందుకు కన్నీరుపెట్టుకున్నారో, అందుకు కారణలేమిటో, కారకులెవ్వరో తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉంది అని కర్ణాటక కాంగ్రెస్‌ అధినేత శివకుమార్‌ అన్నారు. తన పాలనలో కరోనాతో అనేకమంది కన్నుమూసినందుకూ, ప్రజలను కష్టాలు పెట్టినందుకూ ఇప్పుడు కన్నీరుపెడుతున్నారేమో అని సామాజిక మాధ్యమాల్లో కొందరు ఎగతాళి చేస్తున్నారు. వందలకోట్ల ఖర్చుతో ఎంతో కష్టపడి అడ్డుతోవలో అధికారం దక్కించుకుంటే, రెండేళ్ళలోనే పొమ్మన్నందుకు బాధ కలగదా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. యడియూరప్ప ఇష్టంగా కాక కష్టంగానే తప్పుకున్నాడన్నది నిజం. ఆయన కన్నీటి వరదలో కొట్టుకుపోయి బీజేపీ సర్వనాశనం అయిపోతుందని లింగాయత్‌స్వామి ఒకరు శపించారు. పార్టీ అధిష్ఠానం మీద ఒత్తిడితెచ్చే క్రమంలో యడ్డి ఆఖరుప్రయత్నంగా లింగాయత్‌ స్వామీజీలతో ఈ మధ్యన ఓ భారీ భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా, పార్టీ పెద్దలు సానుకూలంగా లేకపోవడంతో ఆ ఎత్తుగడలూ వ్యూహాలూ నెగ్గలేదు. 


అటల్‌–అద్వానీ కాలం నాటివారికి మోదీ–షాలు పొగబెడుతున్న క్రమంలో, యడ్డి మరో వికెట్‌ అన్న విమర్శలను అటుంచితే, కర్ణాటకలో తాను లేనిదే పార్టీ లేదనేంతగా యెడ్డీ దానిని నిలబెట్టినమాట నిజం. విపక్షనాయకుడు, పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం వంటి పలు పదవుల్లో ఉన్నప్పటికీ, 2008లో సంకీర్ణభాగస్వామిగా ఉంటున్న జనతాదళ్‌ (ఎస్‌) అనుకున్న ప్రకారం అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించిన సందర్భం బీజేపీ రాజకీయాన్ని మార్చేసింది. వెన్నుపోటు, ద్రోహం అంటూ యడ్డి రోడ్డునపడి రచ్చచేయడం రాజకీయంగా ఆయనకూ, పార్టీకీ ఉపకరించింది. ఎక్కువస్థానాలు నెగ్గినా, అవసరమైనన్ని లేకపోవడంతో యడ్డి మార్కు కొనుగోళ్ళ రాజకీయానికి తెరదీసి, దక్షిణాదిన తొలి కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయన. సరిగ్గా పదేళ్ళ తరువాత కూడా అదే పునరావృతమైంది. 2018లో అత్యధిక స్థానాలు నెగ్గినా మెజారిటీ లేకపోవడంతో బీజేపీ పక్కన కూచోవలసి వచ్చింది. తమ సంకీర్ణాన్ని కూల్చేందుకు యడ్డి, బీజేపీ పెద్దలూ కలసి ఆపరేషన్‌ కమల్‌ అమలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌–జెడీఎస్‌ నాయకులు నిత్యమూ విమర్శించేవారు. ఎట్టకేలకు అది విజయవంతంగా అమలైంది. పదహారుమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు యడ్డి. ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా, పాలనలో పుత్రరత్నం ప్రమేయంమీద విమర్శలు వచ్చినా ఇప్పటివరకూ పార్టీ అధిష్ఠానం ఆయన జోలికిపోలేదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా, కొద్దిరోజుల్లోనే రాజీనామా చేయవలసిన సందర్భాలూ ఎదురైనాయి. ఎప్పుడూ కూడా పదవీకాలాన్ని పూర్తిగా అనుభవించకుండానే దిగిపోవలసి వచ్చింది. శోభా కరంద్లాజేకు మొన్నటిమంత్రివర్గ విస్తరణలో స్థానం ఇవ్వడం ద్వారా బీజేపీ అధిష్ఠానం ఆయన మాటకు ఎంతో విలువ ఇచ్చిన సంకేతాలు పంపింది. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన వారసుడికి స్థానం చోటు దక్కుతుందని అంటున్నారు. యడియూరప్పను తప్పించడం కంటే, ఈ బలమైన లింగాయత్‌ నాయకుడి స్థానంలో అంతటి యుక్తిమంతుడూ శక్తిమంతుడైన కొత్త వ్యక్తిని ఎంపికచేయడం పార్టీ అధిష్ఠానానికి అసలైన పరీక్ష.

Updated Date - 2021-07-27T06:37:22+05:30 IST