Advertisement

‘ఏడంతస్తుల మేడ‌’కు నలభై ఏళ్ళు

Jan 10 2021 @ 19:59PM

దర్శకరత్న దాసరి నారాయణరావు, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ అంటే అప్పట్లో ఎటువంటి క్రేజ్ ఉండేదో తెలియంది కాదు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగవ చిత్రమే 'ఏడంతస్తుల మేడ'. అప్పట్లో సంక్రాంతి సీజన్‌ను పురస్కరించుకుని జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. సుజాత, జయసుధ పోటీపడి నటించిన ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొన్ని ప్రత్యేక షోలు ఆడవారి కోసమే వేశారంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. ఈ చిత్రం 1980, జనవరి 11న విడుదలైంది. ఈ జనవరి 11కి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.


నాగేశ్వరరావు తన నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అందులో ‘ఏడంతస్తుల మేడ’ ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఏఎన్నార్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. సుజాత, జయసుధ, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా కేవలం 50 రోజులకే ఒక కోటీ ఇరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. అప్పట్లో అక్కినేని స్టామినా ఏంటో చాటిచెప్పింది. ఇక చక్రవర్తి సంగీత సారధ్యంలో.. అరటి పండు వలిచిపెడితే తినలేని చిన్నది, ఏడంతస్తుల మేడ ఇది వడ్డించని విస్తరిది, ఇది మేఘ సందేశమూ లాంటి పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఒక పేద వాడు కోటిశ్వరుడైతే.. ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చాటి చెప్పే కథతో మలచిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై వై. అరుణ్ ప్రసన్న నిర్మించిన ఈ సినిమాను ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా.. అక్కినేని నాగార్జునతో రీమేక్ చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఏదేమైనా ‘ఏడంతస్తుల మేడ’ చిత్రం హీరోగా.. అక్కినేని నాగేశ్వరరావుకే కాకుండా.. దర్శకుడిగా దాసరికి కూడా ఒక మరిచిపోలేని చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న టైమ్‌లో ఈ ఏడంతస్తుల మేడ సినిమా నాగేశ్వరావుకి మంచి హిట్టై.. కెరీర్‌లో నిలదొక్కుకునేలా చేసింది. 


ఈ సినిమా గురించి సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మాట్లాడుతూ.. ''దాసరి నారాయణరావు అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడు. ఆయనకోసం నిర్మాతలే కాదు హీరోలు ఎదురు చూస్తున్నారు. నేను అప్పట్లో జగపతి బ్యానర్ లో మేనేజర్ గా చాలా సినిమాలకు చేస్తున్నాను. ఆ సమయంలో దాసరి నారాయణరావు మనం సినిమా చేద్దామని చెప్పడంతో కథ ఏమిటి అని అడగకుండా సరే అని చెప్పి సినిమా మొదలు పెట్టాం. అప్పట్లో కాశ్మీర్ లో ప్రత్యేకంగా పాటలు తీసిన మొదటి సినిమా మాదే. ఏడంతస్తుల మేడ పాటలు సూపర్ హిట్ అవడమే కాదు.. ఇప్పటికి ఆ పాటలు హిట్ ఆల్బమ్స్ లో ప్లే అవుతున్నాయి. దాసరి నారాయణరావు ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అంటే...చిన్న పాయింట్ దొరికితే చాలు కథ అద్భుతంగా అల్లేస్తాడు. ఆయనతో సినిమా చేయడం నిజంగా గొప్ప అనుభవం. ఈ సినిమా అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ ఆ క్షణాలు నా కళ్లముందు తిరుగుతాయి. ఇప్పుడు అంతా మారిపోయింది. అలాంటి నటులు, మనుషులు ఇప్పట్లో కనిపించరు. ఆ రోజుల్లో నారాయణరావు ఒక నిర్మాతకు ఫోన్ చేసి రెండు లక్షలు కావాలి పంపండి అంటే వాళ్ళు ఏకంగా మూడు లక్షలు పంపేవారు..అది ఆయన రేంజ్. ఈ సినిమా చేయడానికి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్లి నాకు ఈ సినిమా చేయాలి అని అడిగితే.. అక్కడ హాయిగా ఉన్నావుగా మళ్లీ సినిమా ఎందుకు అని ఆయన అంటే..లేదు మీరు చేయాల్సిందే అని అడిగితే నీ ఇష్టం అని చేశారు. టైటిల్ కూడా ఆయనకు ఇష్టం లేదు. కానీ టైటిల్ మార్చేది లేదు అని చెబితే నీ ఇష్టం చెప్పినప్పుడు, వినకపోతే నీ ఇష్టం అని ఆయన చెప్పారు. ఆ తరువాత నేను నిర్మాతగా చాలా సినిమాలు చేశాను..'' అని చెప్పారు.


రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ''దాసరి నారాయణరావుగారు చాలా బిజీగా ఉన్న టైమ్‌లో కాశ్మీర్ లో 15 రోజుల పాటు పాటల చిత్రీకరణ కోసం వెళ్ళాము. అక్కడ దాసరి ఖాళీ సమయంలో ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చునేవారు. నాలుగు వెర్షన్స్ రాసుకుని.. అందులో కథ మీద గ్రిప్ ఉన్న బెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకుని సినిమాని తీయడం జరిగింది. నేను దాసరిగారి దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులు. దాసరి నారాయణరావు గారిని దగ్గర నుండి చూసిన వ్యక్తిని. దాసరి గారు అంత డేడికేటెడ్ గా కథ, కథనాలతో వర్క్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అవడం .. నాగేశ్వరరావుగారి కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ హిట్ గా నిలవడం జరిగింది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్లీ తియ్యగలమా. నేను కో డైరెక్టర్ గా పని చేసిన చివరి సినిమా ఇదే..'' అని అన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.