Appaకే ప్రచార సారథ్యం

ABN , First Publish Date - 2022-07-17T18:02:23+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాకర్షణశక్తి కలిగిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రచార సారథ్యంలోనే 2023 శాసనసభ ఎన్నికల్లో ముందుకు

Appaకే ప్రచార సారథ్యం

 - ఎస్సీ, ఎస్టీ ఓట్లపై కసరత్తు

- మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదిక

 - కొందరు త్యాగాలకు సిద్ధం కావాలి

 - చింతనా - మంథనాలో Bjp పలు కీలక నిర్ణయాలు 


బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాకర్షణశక్తి కలిగిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రచార సారథ్యంలోనే 2023 శాసనసభ ఎన్నికల్లో ముందుకు సాగాలన్న అభిప్రాయం రాజధాని బెంగళూరులో జరిగిన బీజేపీ చింతనా - మంథనా సమావేశంలో వ్యక్తమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అధిష్టానం మార్గదర్శకత్వంలో అప్ప ప్రచార సారథ్యంలో సమష్టిగా ముందుకు సాగితే అనుకున్న టార్గెట్‌ 150ని సునాయాసంగా అందుకోగలమని పలువురు సీనియర్లు అభిప్రాయపడినట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఒంటి చేత్తో గెలిపించి ఢిల్లీకి పంపి నరేంద్రమోదీని ప్రధానిగా చేయడంలో అప్ప కీలక పాత్ర పోషించారని సీనియర్లు గుర్తుకు తెచ్చారు. యడియూరప్ప ఇప్పటికీ తిరుగులేని మాస్‌లీడర్‌ అనే సంగతిని విస్మరించజాలమని ఈ నేతలు కుండబద్ధలు కొట్టడంతో సమావేశంలో పాల్గొన్న అధిష్టానం ప్రతినిధులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. చింతనా - మంథనాలో తీసుకున్న నిర్ణయాల గురించి బీజేపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రాధాన్యత పార్టీలో ఉన్నప్పటికీ అవి అధికారం తెచ్చిపెట్టే స్థాయిలో లేవని పలువురు సీనియర్లు నిర్మొహమాటంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. యడియూరప్ప పుత్రరత్నం బీవై విజయేంద్రకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్‌ కేటాయిస్తేనే యడియూరప్ప పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యానించగా దీనిపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను పూర్తిగా ఆలకించేందుకే మొగ్గు చూపినట్టు తెలిసింది. మొత్తానికి యడియూరప్ప ప్రచార సారథ్యంలో ముందుకెళ్లగలిగితేనే రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీ సాధ్యమన్న నేతల అభిప్రాయాలతో అధిష్టానం తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవచ్చునని తెలుస్తోంది. ప్రత్యేకించి టికెట్ల కేటాయింపులో యడియూరప్పకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉండాల్సిందేనని ఆయన వర్గీయులు అన్నట్టు సమాచారం. 


ఎస్సీ, ఎస్టీలపై వల...

రాష్ట్ర రాజకీయాల్లో యడియూరప్ప తర్వాత అత్యంత ప్రజాకర్షణ కల్గిన నేతగా మాజీ సీఎం సిద్దరామయ్యకు స్థానం ఉందని, మైనారిటీ, బలహీనవర్గాలు, దళితులు (అహింద)పై ఆయనకు గట్టిపట్టు ఉండడమే కారణమని బీజేపీ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లను మరింతగా ఆకర్షించే దిశలో గట్టి ప్రయత్నాలు జరగాల్సిందేనని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రపతిగా ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక ద్వారా గరిష్ట రాజకీయ లబ్ధి పొందాలని, అలాగే పార్టీలో దళిత నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆ వర్గానికి చెందిన కేడర్‌లో బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. మైనారిటీల ఓట్లు బీజేపీకి పెద్దగా వచ్చే అవకాశం లేనప్పటికీ ఈ వర్గాన్ని కూడా విస్మరించరాదని, సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ మంత్రాన్ని ప్రయోగించాలని, అలాగే బలహీన వర్గాలకు పార్టీ వేస్తున్న  పెద్దపీట గురించి గు ర్తు చేయాలని సూచించారు. తద్వారా సిద్దరామయ్య అహింద ఎత్తుగడను తిప్పికొట్టాలని ఇందుకు క్షేత్రస్థాయిలో భారీ కసరత్తు చేపట్టాలని నిర్ణయించారు. 


త్యాగాలకు సిద్ధం కావాల్సిందే... 

2023 శాసనసభ ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధపడాల్సిందేనని బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 2023 ఎన్నికల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉందని, వీరి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఏఏ మంత్రులకు, ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించబోతున్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన ప్రోగ్రెస్‌ రిపోర్టు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా వద్ద ఉందని వెల్లడించిన ఆయన ఈ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఉద్బోధించినట్టు సమాచారం. మొత్తానికి చింతనా-మంథనా సదస్సులో 2023 ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా యడియూరప్ప, బీజేపీ జట్టుకు బసవరాజ్‌ బొమ్మై నాయకత్వం వహిస్తారని నేతలంతా సమష్టిగా అధిష్టానం కనుసన్నల్లోనే ముందుకు సాగాలని తీర్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-07-17T18:02:23+05:30 IST