పసుపు పండుగొచ్చె..

ABN , First Publish Date - 2022-05-26T07:25:49+05:30 IST

మహానాడు సమీపిస్తుండటంతో ఒంగోలులో పసుపు పండగ వాతావరణం నెలకొంది.

పసుపు పండుగొచ్చె..
మహానాడు ప్రాంగణానికి సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు

రేపు, ఎల్లుండి ఒంగోలులో టీడీపీ మహానాడు

తుదిదశకు చేరిన ఏర్పాట్లు

పరిశీలించిన అచ్చెన్న, ఇతర నేతలు

నేడు అధినేత చంద్రబాబు రాక 

పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహణ

ఘనస్వాగత ఏర్పాట్లలో టీడీపీ నేతలు

ఒంగోలులో భారీగా అలంకరణ

తోరణాల తొలగింపుపై ఆగ్రహం  

మహానాడు సమీపిస్తుండటంతో ఒంగోలులో పసుపు పండగ వాతావరణం నెలకొంది. నగరాన్ని పసుపుమయం చేసే ప్రయత్నాల్లో స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లతోపాటు పాత బైపాస్‌ రోడ్డు ప్రాంతాలను తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో అలంకరించారు. మహానాడు జరిగే ప్రాంగణం సమీప ప్రాంతాలన్నింటినీ  హోర్డింగ్‌లతో నింపేశారు. కాగా కలెక్టరేట్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి తోరణాలను కట్టగా బుధవారం ఉదయం కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు. దీనిపై పార్టీనేతలు మండిపడుతున్నారు. తొలి నుంచి మహానాడుకు అధికారపార్టీ యంత్రాంగం ద్వారా అనేక అడ్డంకులు కలిగిస్తున్నదని, చివరకు నగరం అలంకరణ కోసం కట్టిన తోరణాలను కూడా తీసేశారని మండిపడుతున్న టీడీపీ నాయకులు తాము అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు ఇబ్బందిపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

ఒంగోలు, మే 25 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 27, 28 తేదీల్లో ఒంగోలు వేదికగా మహానాడు జరగనుండగా నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ప్రాంగణం ఏర్పాటు చేసిన విషయం విదితమే. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శత జయంతి కూడా కావడంతో మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. తొలిరోజు ప్రతినిధుల సభతోపాటు రెండవ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా తదనుగుణ ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజులకుపైగా ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం నాటికి అవి తుదిదశకు చే రుకున్నాయి. దాదాపు 12వేల మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాటుచేసిన తాత్కాలిక జర్మన్‌ షెడ్‌, సభా వేదిక పనులతోపాటు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌, గ్యాలరీ వంటి వాటి పనులు రాత్రింబవళ్ళు ఈ వారం రోజులుగా చేస్తుండగా అవి ఒక కొలిక్కివచ్చాయి. 


పెరిగిన నేతల రాక

ప్రాంగణంలో జరుగుతున్న పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం పరిశీలించారు. పార్టీ రాష్ట్రనేతలు బీదా రవిచంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీ జనార్దన్‌లతో కలిసి అక్కడకు వచ్చిన ఆయన  ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, ఇతర నేతలతో కలిసి ప్రాంగణం అంతా కలియ తిరిగారు. అక్కడ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. 


నేడు ఒంగోలుకు చంద్రబాబు 

పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే ఒంగోలుకు రానున్నారు. తొలుత అనుకున్న ప్రకారం చంద్రబాబు  27వ తేదీ ఉదయం ఒంగోలు వచ్చి మహానాడులో పాల్గొనాల్సి ఉంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం 26వతేదీ మధ్యాహ్నానికే ఒంగోలు రానున్నారు. ఉదయం 11.30కు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం వద్ద నుంచి బయలుదేరే ఆయన 2.30కు నేరుగా ఒంగోలులోని హోటల్‌ సరోవర్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొని రాత్రికి ఎన్నె స్పీ అతిధిగృహంలో బస చే స్తారు. 27, 28 తేదీల్లో మహానాడులో పాల్గొంటారు. 


ఒంగోలులో పొలిట్‌బ్యూరో సమావేశం

పొలిట్‌ బ్యూరో సమావేశం ఒంగోలులో జరగనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ముఖ్యనేతలందరూ గురువారమే ఒంగోలు రానున్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం నగరంలోని హోటల్‌ సరోవర్‌ లో గురువారం మధ్యాహ్నం జరగనుండగా అక్కడి ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. కాగా అధినేత చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగా అది కూడా మధ్యాహ్నానికే ఒంగోలు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాసరిహద్దు మార్టూరు ప్రాంతం నుంచి ఒంగోలు వరకు వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. కాగా  చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా నగరంలో తెలుగుతమ్ముళ్ల బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా స్థానిక త్రోవగుంట వద్ద నుంచి నగరానికి భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు.






Updated Date - 2022-05-26T07:25:49+05:30 IST