Yemmiganur: సైలెంట్ ఎమ్మెల్యే.. సడన్‌గా వయిలెంట్ ఎలా అయ్యారు?

ABN , First Publish Date - 2021-07-28T18:00:54+05:30 IST

ఏ నాయకుడైనా వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ.. ఆ ఎమ్మెల్యే మాత్రం వివాదాలు రేపి ప్రజల్లో అలజడి రేపుతున్నారు. సదరు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నా... తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ.. వివాదాల్లో మునిగి తేలుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన రేపిన వివాదాలు ఏంటి?

Yemmiganur: సైలెంట్ ఎమ్మెల్యే.. సడన్‌గా వయిలెంట్ ఎలా అయ్యారు?

ఏ నాయకుడైనా వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ.. ఆ ఎమ్మెల్యే మాత్రం వివాదాలు రేపి ప్రజల్లో అలజడి రేపుతున్నారు. సదరు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నా... తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ.. వివాదాల్లో మునిగి తేలుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన రేపిన వివాదాలు ఏంటి? 


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చాలా సీనియర్ నేత. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ఎమ్మెల్యే, సడన్‌గా వైలైంట్‌గా మారారు. గోవధ చట్టంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా హైలెట్‌ అయ్యారు. గోహత్యను సమర్ధిస్తూ.. గోవధ చట్టం కాలం చెల్లిన చట్టమని పేర్కొన్నారు. గోవును కొందరు పూజిస్తే.. ఇంకొందరు ఆహారంగా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. బక్రీద్ పండుగను అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన కామెంట్స్.. ఇటు రాజకీయ వర్గాలు.. అటు హిందూ ధార్మిక సంఘాల్లో దుమారం రేపాయి. చెన్న కేశవ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయట. చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమంతో బీజేపీ నేతలు పోరు బాట పట్టారు. మైనార్టీ వర్గాల మద్దతు కోసం హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని బీజేపీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చెన్నకేశవరెడ్డిని సీయం జగన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఎన్ని ఆందోళనలు జరిగినా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాను పక్కా హిందువునని.. లౌకిక వాదిగా ఈ వ్యాఖ్యలు చేశానని ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి సమర్దించుకున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. గోవులను అడ్డం పెట్టుకుని బీజేపీ లబ్ది పొందాలని  చూస్తోందని కమలదళానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యేపై మరింత రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా... కర్నూలు జిల్లా పాలిటిక్స్‌ ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారిపోయాయి. 





ఇదిలావుంటే... నందవరం మండలం గురజాల గ్రామంలో దళితులు, బీసీ కులాల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరడానికి కూడా ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డే కారణమని స్ధానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గురజాల గ్రామంలో చర్చి ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో దళితులు, బిసి కులాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 31న అడమ్ స్మిత్ అనే దళిత యువకుడు ఆదోనిలో పరువు హత్యకు గురయ్యాడు. దీంతో గురజాల గ్రామంలో దళితులు, బిసి కులాల మధ్య వివాదాలు మరింత పెరిగాయట. రెండు వర్గాల మధ్య రాజీ చేసేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నాలు కూడా చేశారు. ఇరు వర్గాల మధ్య సమస్య ఏమాత్రం సద్దుమణగలేదు. ఆరు నెలలుగా బీసీలు మమ్మల్ని వెలివేసి వ్యవసాయ పనులకు రానివ్వడం లేదని దళితులు పోరు బాట పట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధి కారులు కొద్ది రోజుల క్రితం గురజాల గ్రామాన్ని సందర్శించి రెండు వర్గాలకు కలిసి మెలసి ఉండాలని సూచించారు. అయితే.. లోగుట్టు రాజకీయాలే.. దళితులు, బీసీలు మధ్య చిచ్చు రేగడానికి కారణమని స్ధానికంగా చర్చ జరుగుతోంది. 



పంచాయతీ ఎన్నికల్లో దళితులు ఉండే వార్డుల్లో టీడీపీ వార్డు మెంబర్ విజయం సాధించడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. మిగిలిన అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలవగా... దళితులు టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే ఉద్దేశ్యంతో కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీసినట్లు స్థానికులు చెప్తున్నారు. తమ వార్డులో టీడీపీ గెలిచిందనే కారణంతో ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. గురజాల వ్యవహరంలో మొదట్లోనే ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదికాదని చెప్తున్నారు. ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేయడమే.. గురజాలలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాడానికి కారణమని అటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ చర్చ జరుగుతోంది. మొత్తంగా.. వివాదాలు నీడలా వెంటాడుతుండడంతో.. ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి దూకుడు తగ్గిస్తారా? కంటిన్యూ చేస్తారా..? అన్నది సస్పెన్స్‌గా మారింది. అటు.. ఎమ్మెల్యే వరుస వివాదాలపై పార్టీ అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా లేదా అనే అంశంపైనా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-07-28T18:00:54+05:30 IST