అక్రమ కేసులకు భయపడేది లేదు..: యరపతినేని శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2020-10-27T14:22:24+05:30 IST

తమపై అక్రమంగా పెట్టిన కేసులకు భయపడే సమస్యే లేదని.. రేపు టీడీపీ అధికారంలోకి రాగానే ఒకటికి వంద కేసులు పెట్టి వడ్డీ సహా తిరిగి..

అక్రమ కేసులకు భయపడేది లేదు..: యరపతినేని శ్రీనివాసరావు

గుంటూరు: తమపై అక్రమంగా పెట్టిన కేసులకు భయపడే సమస్యే లేదని.. రేపు టీడీపీ అధికారంలోకి రాగానే ఒకటికి వంద కేసులు పెట్టి వడ్డీ సహా తిరిగి చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడకుండా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా మారి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెంటచింతలలో తాను పోలీసులపై ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. శరవయ్య అనే బీసీ నాయకుడు చనిపోతే వారి పిల్లలను పిలిచి కర్మకాండలను చెయ్యొద్దని పోలీసులు హెచ్చరించారని.. దాని గురించి అడగటం తప్పా అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్లలో చాలామంది పోలీసులు తమ పనులు కోసం నా వద్దకు రాలేదా.. అధికారం మారగానే ప్రభుత్వానికి అనుకూలంగా మారి మాపైనే అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారో పోలీసులు అత్మపరిశీలన చేసుకోవాలి అని అన్నారు. పోలీస్‌శాఖ అంటే తనకు చాలా గౌరవమన్నారు. 


కొంతమంది పోలీసులు తాత్కాలిక పోస్టింగ్‌ల కోసం తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. మీవలన ఇబ్బంది పడిన ప్రతి కార్యకర్త వద్ద ఫిర్యాదు తీసుకుని రేపు అధికారంలోకి రాగానే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళగానే, వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. ఆ తరువాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కార్యకర్తలను పార్టీలు మారాలని చెప్పడం, మాటవినకపోతే హింసించడం వంటివి చే స్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మాచర్ల టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ, తాను ఎప్పుడు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.

Updated Date - 2020-10-27T14:22:24+05:30 IST