ఏరువాక సాగేనా..?

ABN , First Publish Date - 2021-06-24T06:40:04+05:30 IST

పంటల సాగుకు ప్రారంభ సూచికమైన ఏరువాకకు వేళయింది. జైష్టమాసంలో వచ్చే పౌర్షమి రోజును ఏరువాక పౌర్ణమిగా రైతాంగం పండుగ చేస్తారు.

ఏరువాక సాగేనా..?
దొనకొండ ప్రాంతంలో దుక్కులు దున్నుతున్న ట్రాక్టర్‌

చినుకు కోసం ఎదురుచూపులు

గతనెలలో కురిసిన జల్లులతో దుక్కులు దున్నకం

కొన్నిచోట్ల పత్తి, వేరుశనగ, నువ్వు వేసిన రైతులు

ఈసారి వర్షాలు పడితే ముమ్మరంగా సాగుకు సిద్ధం

నేడు ఏరువాక పౌర్ణమి, గత ప్రభుత్వంలో ఉత్సవాలు

ఒంగోలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : పంటల సాగుకు ప్రారంభ సూచికమైన ఏరువాకకు వేళయింది. జైష్టమాసంలో వచ్చే పౌర్షమి రోజును ఏరువాక పౌర్ణమిగా రైతాంగం పండుగ చేస్తారు. ఆరోజు నుంచి వ్యవసాయ సీజన్‌ ప్రారంభిస్తారు. అలా ఈ ఏడాది గురువారం నాడు ఏరువాక పౌర్ణమి వచ్చింది. పూర్వపు రోజుల్లో ఊరూవాడ రైతాంగం అంతా గ్రామదేవతలను పూజించి అరకలు కట్టి, పొలాలు దున్ని పెద్దఎత్తున పండుగ నిర్వహించేవారు. కాల క్రమంలో వచ్చిన మార్పులతో వాణిజ్య పంటలు పెరగడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో ఏరువాక సందడి పల్లెల్లో తగ్గింది. అయితే సీజన్‌ పంటల సాగు మాత్రం ఏరువాక పౌర్ణమికి అటుఇటుగా చేస్తున్నారు. దానిని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం అధికారికంగా ఏరువాకను నిర్వహించి గ్రామీణప్రాంతాల్లో తిరిగి సందడి సాగేలా చేసింది. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో రైతులతో కలిసి గ్రామాల్లో అరకలు కట్టి పొలాలు దున్ని రైతాంగాన్ని ఉత్సాహపర్చడంతో పాటు అధికారులను కూడా గ్రామాలకు తరలించి సాగును ప్రొత్సహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏరువాకను వదిలేసి జూలై 8న దివంగత సీఎం వైఎస్సార్‌ జన్మదినం రోజున రైతు దినోత్సవం పేరుతో నిర్వహిస్తోంది. 

ఈ ఏడాది ఏరువాక వేళ జిల్లాలో వ్యవసాయ సీజన్‌ పరిస్థితులు పరిశీలిస్తే చాలా ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. గతనెలలో కాస్తంత మెరుగైన వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం మేలో 51.0 మి.మీ కాగా 71మి.మీ. నమోదైంది. దీంతో తొలకరి సాగుకు రైతులు ఉపక్రమించి కొద్దిచోట్ల పరిమితంగా విత్తనాలు కూడా వేయగా అత్యధిక ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేశారు. అయితే ఈనెలలో వర్షాలు లేవు. ఈనెలలో 58.0మి.మీ. వర్షపాతం కురవాలి. ఇప్పటివరకు 23మి.మీ. మాత్రమే కురిసింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికి వాటి ప్రభావం అంతగా లేదు. ఎండలు కూడా పెరిగాయి. దీంతో ఏరువాక వేళ రైతులు చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో  2.18 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. అయితే గతనెలలో కురిసిన వర్షాలతో కొన్నిచోట్ల బోర్ల కింద పత్తి, మిర్చివంటి పంటలను రైతులు సాగు చేయగా తీరప్రాంతంలో వేరుశనగ పంటను వేశారు. అలాగే కాస్తంత అధిక వర్షం కురిసిన చోట నువ్వు, సజ్జ, పెసర కూడా వేశారు. వ్యవసాయశాఖ సమాచారాన్ని బట్టి జిల్లాలో 2,307 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అందులో 1081 హెక్టార్లలో పత్తి సాగు కాగా 470 హెక్టార్లలో వేరుశనగ, 480 హెక్టార్లలో నువ్వు సాగుచేశారు. కాగా ఈ ఏడాది సీజన్‌ బాగా ఉంటుందని ఆశిస్తున్నట్లు జేడీఏ డాక్టర్‌ పీ శ్రీరామమూర్తి తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతర ఉపకరణాలు సిద్ధం చేశామన్నారు. వచ్చేనెలలో సాగు ఊపందుకుంటుందని భావిస్తున్నామన్నారు. 



Updated Date - 2021-06-24T06:40:04+05:30 IST