ఆర్‌బీకే ఎరువుల.. బ్లాక్‌

ABN , First Publish Date - 2021-11-25T05:41:45+05:30 IST

ఎరువులను రైతుభరోసా కేంద్రాలకే(ఆర్‌బీకే) ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు రైతుల పాలిట శాపంలా మారాయి. ఆర్‌బీకేలకు సక్రమంగా సరఫరా కాకపోవడం.. సరఫరా అయినవి కూడా మార్కెట్‌కు తరలిపోతుండటంతో కృత్రిమ కొరత ఏర్పడింది.

ఆర్‌బీకే ఎరువుల.. బ్లాక్‌

ప్రభుత్వ ఆదేశాలతో కృత్రిమ కొరత

వర్షాలతో యూరియాకు డిమాండ్‌

డీలర్లకు ఎరువులు ఇవ్వని కంపెనీలు

అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులు


వర్షాలు పడ్డాయి. చివరి దశలో ఉన్న పైర్లు పోయాయి. కొంతమంది మళ్లీ సాగుకు సిద్ధమవుతున్నారు. రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వాణిజ్య పంటలకు యూరియా, పొటాష్‌, ఇతర ఎరువులను వాడాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలో ఉన్న పైర్లకు బలానికి యూరియా అవసరం ఏర్పడింది. దీంతో జిల్లాలో ఎరువులకు, యూరియాకు డిమాండ్‌ పెరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారానే ఎరువులు, యూరియా సరఫరా చేయాలని నిర్ణయించింది. కంపెనీలు డీలర్లకు కాకుండా నేరుగా ఆర్‌బీకేలకే సరఫరా చేస్తున్నాయి. ఒకవైపు డీలర్లకు సరఫరా కాకపోవడం.. మరోవైపు ఆర్‌బీకేలకు అందుతున్నవి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుండటంతో కృత్రిమ కొరత ఏర్పడింది.  ఇదే అవకాశంగా వ్యాపారులు దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 


           (ఆంధ్రజ్యోతి- గుంటూరు) 

ఎరువులను రైతుభరోసా కేంద్రాలకే(ఆర్‌బీకే) ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు రైతుల పాలిట శాపంలా మారాయి. ఆర్‌బీకేలకు సక్రమంగా సరఫరా కాకపోవడం.. సరఫరా అయినవి కూడా మార్కెట్‌కు తరలిపోతుండటంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాలతో కంపెనీలు ఎరువులను డీలర్లకు సరఫరా చేయడంలేదు. జిల్లాలో 2-3 వారాల నుంచి ఆయా కంపెనీల నుంచి వచ్చే ఎరువులను వంద శాతం ఆర్‌బీకేలకు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో కృత్రిమ కొరతతో అధిక ధరలకు అమ్ముతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్‌, యూరియా, పొటాష్‌, తదితర ఎరువులకు కృత్రిమ కొరత ఏర్పడింది. ఎరువుల కొరతపై అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. ఆర్‌బీకేలలో అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉంచామన్న ప్రకటనలకే అధికారులు పరిమితమవుతున్నారు. బ్లాక్‌ మార్కెట్‌, అధిక ధరలపై జోక్యం చేసుకోవడంలేదు. రైతుల ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆర్‌బీకేలకు గిడ్డంగులు లేవు. దీంతో ఎరువులను దుకాణాల్లో దించి అమ్ముతున్నారు. దీంతో  ఎరువులు పక్కదారి పడుతున్నాయి. నిజాంపట్నం, కొల్లిపర మండలాల్లో ఆర్‌బీకే ఎరువులను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నట్లు ఫిర్యాదులొచ్చాయి. వీటిపై దర్యాప్తు చేసిన అధికారులు ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. రేపల్లె ప్రాంతంలో ఆర్‌బీకేల ఎరువుల పంపిణీ సక్రమంగా లేదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ జేడీ విజయభారతి దృష్టికి తెచ్చారు.  

 

 సహకార సంస్థలకు ఇవ్వాలి

ప్రభుత్వం డీసీఎంఎస్‌, సొసైటీల వంటి రైతులకు అందుబాటులో ఉండే సహకార సంస్థలకు ఎరువులు కేటాయించడంలేదు. సహకార సంస్థలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముతారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సహకార సంస్థలను పరిగణలోకి తీసుకోవాలి.

- యార్లగడ్డ భాగ్యలక్ష్మి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ 

 

అధిక ధరపై ఫిర్యాదు చేయాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్‌బీకేలకు వంద శాతం ఎరువులు కేటాస్తున్నాం. ఎమ్మార్పీకే ఎరువులు అమ్ముతున్నాం. ఎక్కడైనా ఎక్కువ ధరకు అమ్మితే రైతులు ఫిర్యాదు చేయాలి.

- విజయభారతి, వ్యవసాయశాఖ జేడీ


===============================================================

Updated Date - 2021-11-25T05:41:45+05:30 IST