అవును..ఇది ED (Eknath-Devndra) ప్రభుత్వమే : Devendra Fadnavis

ABN , First Publish Date - 2022-07-04T20:44:57+05:30 IST

మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ దుర్వినియోగం చేసిందంటూ విపక్షాలు చేసిన ..

అవును..ఇది ED (Eknath-Devndra) ప్రభుత్వమే : Devendra Fadnavis

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను బీజేపీ దుర్వినియోగం చేసిందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలకు రాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారంనాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని ఈడీ ప్రభుత్వమని కొందరు అంటున్నారని, నిశ్చయంగా ఇది ఈడీ ప్రభుత్వమేనని, ఏకనాథ్-దేవేంద్ర (Eknath-Devendra) ప్రభుత్వమని చమత్కరించారు. ఈ ప్రభుత్వంలో అధికారం కోసం జగడమనేది ఎప్పుడూ లేదని, తమ సహకారం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు.


ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి ప్రజలు పట్టం కట్టారని ఫడ్నవిస్ చెప్పారు. అయితే తమ మెజారిటీని ఉద్దేశపూర్వకంగా లాక్కోవడంతో ఏక్‌నాథ్ షిండేతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేశామని ఫడ్నవిస్ తెలిపారు. నిజమైన శివసైనికుడిని ముఖ్యమంత్రిగా చేశామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా తాను ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా నాయకత్వం అందుబాటులో లేకపోవడం చూశామని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. విశ్వాస తీర్మానం సందర్భంగా కొద్దిమంది మినహా శివసేన ఎమ్మెల్యేలు షిండేకు మద్దతునివ్వడం, బలపరీక్షలో షిండే నెగ్గడంతో విపక్ష ఎమ్మెల్యేలు ''ఈడీ, ఈడీ'' అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2022-07-04T20:44:57+05:30 IST