అవును.. ఇవి ప్రభుత్వ హత్యలే: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-15T02:26:37+05:30 IST

ఇరవై ఆరు మంది చనిపోతే సీఎం రావాలా ? వద్దా ? ఫుడ్‌ ఫాయిజిన్‌ అయితే మగవాళ్ళే చనిపోతారా, అడవాళ్ళకైతే అనారోగ్యం రాదా

అవును.. ఇవి ప్రభుత్వ హత్యలే: చంద్రబాబు

ఏలూరు: ‘ఇరవై ఆరు మంది చనిపోతే సీఎం రావాలా ? వద్దా ? ఫుడ్‌ ఫాయిజిన్‌ అయితే మగవాళ్ళే చనిపోతారా, అడవాళ్ళకైతే అనారోగ్యం రాదా. ఇక్కడ అంతా కల్తీ సారా తాగి చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. జగన్‌ ధన దాహానికి మహిళల మంగళసూత్రాలు తెగాయని, బాధితులంతా పోరాటానికి దిగాలని, అసెంబ్లీ ముందు నిరసన గళం విప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి ఇప్పటికే దాదాపు 26 మంది మృతి చెందిన నేపథ్యంలో ఆయా కుటుంబాలను సోమవారం ఆయన కలిసి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్‌ సీఎం వైఖరిని తప్పు పట్టారు. ‘‘కల్తీ సారా తాగి చనిపోతే అసెంబ్లీలో మాత్రం అవన్నీ సహజ మరణాలే అంటారా. ఇవన్నీ కల్తీ సారా మరణాలా, సహజ మరణాలా అంటూ ప్రజల నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. పేదవాడిని చంపేసి సహజ మరణాలు అంటారా’’ అంటూ మండిపడ్డారు. 


జంగారెడ్డిగూడెంలో 26 కుటుంబాలు వీధి పాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి టీడీపీ పక్షాన లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని తెలిపారు. ఈ పార్టీని మొదటి నుంచి కాపాడుకున్నది పేదలేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కుటుంబాల్లో ఒక్కొక్క దానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఒక ప్రైవేటు గ్యాస్‌ కంపెనీలో ప్రమాదం సంభవిస్తే ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

Updated Date - 2022-03-15T02:26:37+05:30 IST