దిగుబడులు వచ్చినా దిగులేనా?

ABN , First Publish Date - 2022-05-22T06:49:10+05:30 IST

పంట దిగుబడులు చేతికి వచ్చిన అన్నదాతల్లో దిగులే కనిపిస్తోంది. ఎన్నో అష్టకష్టాలు పడి వేసవిలో జొన్న పంటను సాగు చేసిన ప్రభుత్వం కొనుగోళ్లను చేపట్టక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ యేడు వేసవిలో 31,396 ఎకరాలలో జొన్న పంట సాగైంది.

దిగుబడులు వచ్చినా దిగులేనా?
తాంసిలో నిల్వ ఉంచిన జొన్న పంటను పరిశీలిస్తున్న రైతు సంఘ నేతలు

జొన్న పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

వానాకాలం సమీపిస్తున్నా.. ఇళ్లలోనే నిల్వలు

అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలం

స్పష్టతనివ్వని ప్రభుత్వం.. చేతులెత్తేస్తున్న శాఖ అధికారులు

జిల్లావ్యాప్తంగా ఈ యేడు వేసవిలో 31,396 ఎకరాల్లో సాగైన జొన్న పంట

ఆదిలాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): పంట దిగుబడులు చేతికి వచ్చిన అన్నదాతల్లో దిగులే కనిపిస్తోంది. ఎన్నో అష్టకష్టాలు పడి వేసవిలో జొన్న పంటను సాగు చేసిన ప్రభుత్వం కొనుగోళ్లను చేపట్టక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ యేడు వేసవిలో 31,396 ఎకరాలలో జొన్న పంట సాగైంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, సరిపడా నీటితడులు అందడంతో దిగుబడులు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఎకరాన 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో 4లక్షల 70వేల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వచ్చాయి. పంట చేతికి వచ్చి పక్షం రోజులు గడిచి పోతున్న జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కావడం లేదు. దీంతో సగం పంట దళారుల పాలవుతునే ఉంది. ప్రతియేటా పంట అమ్మిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. అన్నదాతల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, నిండు నిర్లక్ష్యంతో ఎంతో కష్టపడి పండించిన పంట దిగుబడులను తక్కువ ధరకే అమ్మేసుకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకునే వసతి లేక అన్నదాతలు ఆదరబాదరగా అమ్మేసుకుంటున్నారు. మద్దతుధర దేవుడెరుగు కానీ, చేతికొచ్చిన జొన్న పంట అమ్మేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేవంటూ మార్కెటింగ్‌ అధికారులు చేతులెత్తేయడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

అకాల వర్షాల గుబులు

పంట దిగుబడులు చేతికి రావడంతో ఆనందపడాల్సిన అన్నదాతలు అకాల వర్షాలతో ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంటను చేనులోనే కుప్పలుగా పోసి అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పంట చేనులోనే పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పంట కుప్పలపై పాలిథిన్‌ కవర్లు వేసిన ఈదురు గాలుల బీభత్సానికి చెదిరిపోయి పంట దిగుబడులు తడిచిపోతున్నాయని చెబుతున్నారు. పగలంతా పంటను ఆరబోయడం, సాయంత్రం వేళల్లో కుప్పలుగా చేసి పాలథిన్‌ కవర్లు కప్పడం రైతులకు ఓ పనిగా మారుతుంది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు జొన్నపంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? లేదా? అనే స్పష్టతనివ్వక పోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరో పది రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభమైతే రైతులు పంటల సాగు సమయంలో బిజీబిజీగా మారే అవకాశం ఉంది. సరైన సమయంలో కొనుగోళ్లు చేపడితే పంట డబ్బులతో వానాకాలం పంటల సాగుకు సిద్ధం కావాల్సి ఉంటుందని అన్నదాతలు పేర్కొంటున్నారు.

పేరుకే మద్దతుధర

ప్రభుత్వం జొన్న పంటకు మద్దతుధరను ప్రకటించిన కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అత్యవసరాల పేరిట అమ్మేసుకోవడంతో క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు నష్టం వస్తుంది. క్వింటాల్‌ జొన్న పంట ప్రభుత్వ మద్దతు ధర రూ.2720 కాగా, బయట మార్కెట్‌లో రూ.1300 నుంచి రూ.1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అకాల వర్షాలకు తడిసిన పంట, నాణ్యత లేదంటూ రూ.వెయ్యి వరకే కొనుగోలు చేస్తున్న పరిస్థితులున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు రైతుల ఇంటికే వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావని చెబుతూ తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. నగదును ఆశ చూపుతూ దళారులు పంటను కొనుగోలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. ఏది ఉచితం ఇవ్వకున్న ఫర్వాలేదు కానీ, సకాలంలో మద్దతుధరను చెల్లించి పంటలను కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గతేడు కూడా రైతుల ఆందోళనలతో దిగి వచ్చిన ప్రభుత్వం చివరి సమయంలో జొన్న పంటను కొనుగోళ్లు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. 

యేటా ఇదే తంతు!!

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంట కొనుగోళ్లలో యేటా ఇదే తంతు కనిపిస్తోం ది. పంటల సాగు విస్తీర్ణం ప్రభుత్వానికి ముందే తెలిసిన ఎందుకు కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుందో? అర్థం కావడం లేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో రైతులు మద్ధతు ధరకు దూరమవుతున్నారు. ప్రభుత్వ మద్దతుధర రూ.2720 ఉండ గా దళారులు మాత్రం రూ.1700లోపే క్వింటాల్‌ జోన్న పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ముందుచూపుతో వ్య వహరిస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉండేది. రై తులు, రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి, అ ధికారులకు పలుమార్లు వినతిపత్రాల ను అందించిన పట్టింపే లే కుండా పోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే పట్టించుకోకుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

జొన్న పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి

: సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు

రైతులు పండించిన జోన్న పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా పంట దిగుబడులు చేతికి రావడంతో కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దిగుబడులను ఇంటి వద్దనే నిల్వ చేసుకుని అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని పంట కొనుగోళ్లను ప్రారంభిస్తే భాగుంటుంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అయిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఒకవేళ జొన్న పంటను కొనుగోలు చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపడుతాం. 

ఎలాంటి ఆదేశాలు రాలేదు

: శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

జొన్న పంట కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చేతికి వచ్చిన పంట దిగుబడుల వివరాల ను ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు వస్తే మార్క్‌ఫెడ్‌ ద్వారా జొన్న పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జిల్లాలో నాలుగైదు మండలాల్లోనే జొన్న పంట సాగు అధికంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొనుగోలు ప్రక్రియను చేపడుతాం.

Updated Date - 2022-05-22T06:49:10+05:30 IST