ltrScrptTheme3

యోగాతో వీర్యకణాలు పెరుగుతాయి

Mar 11 2020 @ 11:37AM

ఆంధ్రజ్యోతి(11-03-2020)

ఆసనాలతో 400 జన్యువుల్లో మార్పులు

వాటిలో 100 పునరుత్పత్తికి సంబంధించినవే

సీసీఎంబీ, ఎయిమ్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో డాక్టర్‌ సురభి శ్రీవాస్తవ

రోజూ గంటపాటు ప్రాణాయామం, ధ్యానంతో సత్ఫలితాలు


యోగాతో ఆరోగ్య‘యోగం’ దక్కుతుందనే విషయం మనకు తెలుసు. కానీ యోగాసనాలతో మన శరీరంలో జన్యుస్థాయిలో మార్పులు జరుగుతాయనే విషయం తెలియదు. ఈ దిశగా అధ్యయనం జరుపుతున్న హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ), ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌) శాస్త్రవేత్తల సంయుక్త బృందం ఓ కొత్త విషయాన్ని కనుగొంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే పురుషుల్లో వీర్యకణాలు పెరుగుతాయనేదే దాని సారాంశం. ప్రపంచంలో ఈ తరహా అధ్యయనం జరగడం ఇదే తొలిసారి అని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్‌ సురబి శ్రీవాస్తవ అంటున్నారు. ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ వివరాలివీ.. 


జన్యువులు ఎలా ప్రభావితమవుతాయి? 

మన అలవాట్లు, జీవనశైలి, వాతావరణ పరిస్థితులు.. ఇవన్నీ శరీరంలోని జన్యువులను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి. 


వీర్యకణాలు తగ్గడానికి కారణమేంటి? 

ఆధునిక జీవనశైలి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో సంతానలేమి ప్రధానమైంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం అనేది దానికి ఓ ముఖ్య కారణం. ప్రస్తుతం ఉన్న చికిత్సలతో దుష్ప్రభావాలూ ఉన్నాయి. వాటికి బదులు.. రోజూ గంటపాటు ప్రాణాయామం, ధ్యానం చేస్తే సహజసిద్ధంగా వీర్యకణాలు వృద్ధిచెందుతాయి. 


యోగాతో వీర్యకణాల పెంపుపై.. ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి? 

ఈ దిశగా ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. యోగా బేస్డ్‌ లైఫ్‌స్టైల్‌ ఇంటర్వెన్షన్స్‌ (వైబీఎల్‌ఐ) అనే అంశంపై డాక్టర్‌ రీమా, మేము కలిసి కొన్ని పరిశోధనలు చేశాం. 


పరీక్షల ప్రాథమిక వివరాలు చెబుతారా?

వీర్యకణాల సంఖ్య తక్కువుగా ఉన్న ఐదుగురు పురుషులను ఎంపిక చేసి, 21 రోజులు.. రోజుకు గంట సేపు వారితో యోగాసనాలు వేయించారు. ప్రాణాయామం, ధ్యానం చేయించారు. ఇవి పూర్తయిన తర్వాత అత్యాధునిక డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ పద్ధతి ద్వారా జన్యు స్థాయిలో వీరిలో వచ్చిన మార్పులను పరీక్షించారు. 


భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటి? 

మేము ఐదుగురు వ్యక్తులపైనే ప్రయోగ పరీక్షలు జరిపాం. దీన్ని కొన్ని వందల మందిపై చేసినప్పుడు మరిన్ని కొత్త వివరాలు తెలుస్తాయి. అదే సమయంలో వీర్యకణాలను ప్రభావితం చేసే 100 జన్యువులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ అధ్యయనాన్ని ఇంతటితో ఆపకుండా కొనసాగిస్తాం. 


ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయా?  

క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న పురుషుల్లో యోగా తర్వాత దాదాపు 400 జన్యువుల్లో మార్పులు వచ్చాయి. వీటిలో దాదాపు 100 జన్యువులు మన పునరుత్పత్తితో నేరుగా సంబంధం ఉన్నవే కావడం విశేషం. వీటిలో వచ్చిన మార్పుల వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య కూడా పెరిగింది. అంటే యోగాకు వీర్య కణాల సంఖ్య పెరగటానికి నేరుగా సంబంధం ఉందని కనుగొనగలిగాం.


- స్పెషల్‌ డెస్క్‌

- తార్నాక(ఆంధ్రజ్యోతి)

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.