కరోనాను ఎదుర్కొందాం... క్రియాత్మకంగా!

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

మనకు తెలిసిన దాని నుండి ప్రారంభించి, తరువాతి అడుగును మనకు తెలియని దానిలోకి వేయించడమే యోగ ప్రక్రియ. ‘యోగ‘’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. అన్నింటిలో ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే మీరు యోగాలో...

కరోనాను ఎదుర్కొందాం... క్రియాత్మకంగా!

  • సద్గురువాణి

మనకు తెలిసిన దాని నుండి ప్రారంభించి, తరువాతి అడుగును మనకు తెలియని దానిలోకి వేయించడమే యోగ ప్రక్రియ. ‘యోగ‘’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. అన్నింటిలో ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే మీరు యోగాలో ఉన్నట్టు భావించాలి. యోగాలో అనేక విధానాలున్నాయి. అభ్యాసం ప్రారంభించేటప్పుడు శరీరంతో మొదలుపెడతారు, తర్వాత శ్వాస, ఆపై మనసు, ఆ తర్వాత అంతరాత్మ చెంతకు... ఇలా పలు మెట్లుగా యోగా రూపొందింది. ఈ దశలన్నీ యోగాలోని విభిన్న అంశాలే కాని యోగాకు ఉప శాఖలు కావు. వీటన్నిటినీ యోగాలోని అంతర్భాగంగానే చూస్తాం, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. వాటన్నిటినీ సమపాళ్ళలో, ఒకటిగా  నేర్పడం ముఖ్యం. వాస్తవానికి యోగాలో ఎలాంటి విభజనలు లేవు, వీటన్నిటినీ (శరీరం, శ్వాస, మనసు, భావోద్వేగం, శక్తి) కలిపితేనే యోగా. ప్రాచీన యోగ ప్రక్రియలు శరీరానికీ, మనసుకూ, మనలోని శక్తికీ ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పేరు పొందాయి



శరీరంతో ప్రారంభమయ్యే యోగ ప్రక్రియల ద్వారా శరీరాన్ని పటిష్టం చేసి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇప్పుడు మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో... వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తుల మీద తీవ్రంగా పడుతోంది. ఆక్సిజన్‌ సరిగ్గా అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకెందరో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో చిక్కుకోవడానికి ముందే శ్వాసకోశ వ్యవస్థను చక్కగా పనిచేసేలా తీర్చిదిద్దుకోవడం అవసరం. దీనికి సులువైన సాధన సింహ క్రియ. ఇది తరతరాలుగా యోగాలో ఒక భాగంగా ఉంది. ప్రత్యక్షంగా గురువు ద్వారా నేర్చుకోవడం కుదరని వాళ్ళు... దృశ్య మాధ్యమాల ద్వారా చూసి సాధన చెయ్యడానికి ఇది అనువుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా సరళమైన ప్రక్రియ ఇది. గత ఏడాది నుంచి ఎంతో మంది సింహ క్రియను సాధన చేసి, గొప్ప ఫలితాలు పొందారు. సింహ క్రియ చేసిన తరువాత చాలా మందిలో ప్రశాంతత, ధైర్యం నెలకొన్నాయని జర్నల్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసెన్‌ (జెఎసిఎం) లో ప్రచురితమైన ఒక పరిశోధనా వ్యాసం వెల్లడించింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన కొందరు వైద్యులతో సహా దేశ, విదేశాల్లో ఎందరో వైద్యు నిపుణులు సింహ క్రియ ఆచరిస్తున్నారు. ఫలితాలు అత్యంత సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ సైతం తమ ఉద్యోగులకు ఈ శక్తిమంతమైన సింహ క్రియ చేయాల్సిందిగా సూచించింది. 


ఎలా చేయాలి?: 

నోరు పూర్తిగా తెరవండి. మీ నాలుకను పూర్తిగా బయటకు చాపండి. వీలైనంత శక్తితో ఊపిరి తీసుకోండి. పొట్టను కదపకండి, ఊపిరిని శక్తిమంతంగా లోపలికి పీల్చుకొని, బయటకు వదలండి. ఊపిరి లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం... ఇలా ఇరవై ఒక్కసార్లు చెయ్యండి. ఇది పూర్తయ్యాక మీ నాలుకను పైకి మడవండి. వీలైనంత వెనక్కి లాగండి. ఈ ప్రక్రియలో మీ చేతులను ఉపయోగించకండి. మీకు వీలైనంత పూర్తిగా నాలుకను మడవండి. నోరు తెరిచే ఉంచండి.  ఊపిరిని అదే విధంగా తీసుకుంటూ ఉండండి. వీలైనంత శక్తితో ఊపిరి తీసుకొని, బయటకు వదలండి. గొంతులోంచీ ఊపిరి గట్టిగా తీసుకుంటున్నట్టూ, బయటకు వదులుతున్నట్టూ శబ్దం చేస్తూ చేయండి. కానీ పొట్టను కదపకండి. ఇలా మరో ఇరవై ఒక్క సార్లు నాలుకను మడిచి చెయ్యండి. ఈ ప్రక్రియ మొత్తం కళ్ళు మూసుకొనే చేయండి. కదలకుండా, ప్రశాంతంగా కూర్చొని ఒక్క నిమిషం పాటు ఇలా చేయండి. మీకు నిర్దిష్టమైన వయసు దాటినా, ఊపిరి అంత చక్కగా తీసుకోలేకపోతున్నా, కనీసం ఓ ముప్ఫై సెకన్లు చేయండి. ఏ రోజైతే ఇలా చెయ్యలేకపోతున్నారో, మీ శ్వాసకోశ వ్యవస్థలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోండి. వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఇలా మీరు నాలుగైదు రోజులు  చేసి, ఒక రోజు హటాత్తుగా చేయలేని స్థితికి వస్తే, మీకు శ్వాసకోశ సమస్య ఏదో ఉందని అర్థం. అది కరోనా వల్ల కాకపోవచ్చు, మరేదైనా కావచ్చు, అదేమిటన్నది పక్కన పెడితే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ముఖ్యం. 


ఇవీ నియమాలు: 

మీ కడుపు నిండుగా ఉండకూడదు; కొద్దిగా ఆకలితో ఉండాలి. భోజనానికీ, సాధనకూ మధ్య రెండున్నర గంటల వ్యవధి ఉంటే మంచిది. గర్భంతో ఉన్నవారు, ఉబ్బసం, మైగ్రేన్‌, మధుమేహం, రక్తపోటు లాంటి మొండి వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా సింహ క్రియ చేయవచ్చు. ఆరు నుంచీ డెబ్భై ఏళ్ళ మధ్య వయసున్న వారందరూ ఈ అభ్యాసం చెయ్యవచ్చు. ఆరేళ్ళ లోపువారు, డెబ్భై ఏళ్ళకు పైబడినవారు రోజుకు ఇరవై ఒక్కసార్లు కాకుండా పన్నెండు సార్లు మాత్రమే చెయ్యాలి. అలాగే మెదడులో కణితులు, తలకు గాయాలు తగిలినవారు పన్నెండు సార్లు చెయ్యాలి.


ఎప్పుడు చెయ్యాలి?: 

సింహ క్రియకు ఒకటి రెండు నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు... వ్యక్తుల సామర్థ్యాన్ని అనుసరించి సింహ క్రియను ఆచరించవచ్చు. కరోనా వైరస్‌ సోకనివారు సింహ క్రియను సాధన చేస్తే, వారి రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఊపిరితిత్తులు పటిష్టం అవుతాయి. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు చేయడం ద్వారా వైరస్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కరోనా వచ్చి, కోలుకున్నవారు సింహ క్రియను సాధన చేస్తే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. టీకాలు తీసుకున్నవారు కూడా సింహ క్రియను ఆచరించవచ్చు. దీనితోపాటు రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి, అల్లం లాంటి పదార్థాలను ఆహారంలో తీసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.


Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST