కర్మ ఫలమందు ఆసక్తి లేకుండుటే యోగం

ABN , First Publish Date - 2020-09-19T06:59:00+05:30 IST

‘‘విషయ విముఖుడవైన ఓ ధనంజయా! యోగివై కర్మ ప్రవృత్తుడవుకా! విషయాసక్తి లేకుండుటే యోగం. అనగా కర్మ ఫలమందు కాంక్ష లేకుండుట. సర్వకాల

కర్మ ఫలమందు ఆసక్తి లేకుండుటే యోగం

యోగస్థః కురుకర్మాణి - సంగం త్యక్త్వా ధనంజయః

సిద్ధ్యస్సిద్ధ్యోః సమోభూత్వా - సమత్వం యోగ ఉచ్యతే


‘‘విషయ విముఖుడవైన ఓ ధనంజయా! యోగివై కర్మ ప్రవృత్తుడవుకా! విషయాసక్తి లేకుండుటే యోగం. అనగా కర్మ ఫలమందు కాంక్ష లేకుండుట. సర్వకాల - సర్వావస్థల యందూ సమభావం కలిగి ఉండే విషయాతీత, త్రిగుణాతీత స్థితియే యోగం.’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. కర్మలకు మూలాలు కామనలు. వాటి స్థానంలో ధర్మానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్టు..  ఎవరెట్టివారో భగవంతుడు వారికి అట్టివాడు. ఏ కర్మలు లౌకికాలో అవే ఆత్మానందానికి కూడా కారణాలు. సమస్త ధర్మాలకూ భగవంతుడే ఏకైక లక్ష్యం.


యోకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో న

తస్య ప్రాణా ఉత్ర్కామంతి బ్రహ్మైవసన్‌ బ్రహ్యాప్యేతి


..అని బృహదారణ్యకోపనిషత్తులో, ‘శ్రోత్రియస్యచా కామహతస్య’ అని తైత్తిరీయ ఉపనిషత్‌లో వివరించబడింది. అకాముడు, నిష్కాముడు.. ఈ పదాలన్నీ బ్రహ్మకు, బ్రహ్మణ్యునకు పర్యాయపదాలు. నిష్కాముని యందు, నిష్కామ కర్మలందు భగవంతుడు  ప్రవేశిస్తాడు. 


జీవులు సంకల్ప త్యాగాలకు, వాంఛా త్యాగాలకు అతీతంగా ఉండడం సాధ్యమా? సుఖదుఃఖాలకు అతీతంగా ఉండగలరా? అనే విషయంలో పరమాత్మ చక్కని సందేశాన్ని అందించాడు. శరీరంలో ఉంటూనే శరీరానికి అతీతంగా.. సత్త్వ, రజో, తమో గుణాల్లోనే ఉంటూ వాటికి అతీతంగా.. సంకల్పం చేస్తూ అది తనది కాకుండా.. సంపారంలో ఉంటూ సన్యాసివలె జీవించే వాడే యోగి అన్నాడు. యోగి అయినవాడు సంకల్పం చేస్తాడు. సంకల్పించే ఆ మనసులో ఉన్నది దైవం అయినపుడు ఇంక ఆ భౌతిక గుణాలు జీవుని ఎలా బంధిస్తాయి.


యోగి పంచభూత శరీరంలో మనో వాక్కాయాలతో దినచర్య చేస్తూనే, నాయకుడిగా ఉంటాడు గానీ, దాసుడుగా ఉండడు. యోగికి వేటితోనూ బంధాలుండవు. ముందుకు సాగిపోవడమే అతని ధ్యేయం. వంచనలు, కల్లకపటాలు, వ్యర్థ భాషణాలు, లౌకిక విషయాల సంగ్రహనం ఉండదు. విధి నిషేధాలుండవు. ఈశ్వరుడు తప్ప తనకు వేరు రక్షకులెవరూ ఉండరనే విశ్వాసం వారిలో దృఢంగా నెలకొని ఉంటుంది.



భగవంతుడొక్కడే రక్షకుడని నమ్మి, భారమంతా దైవంపై వేసి మనసా - వాచా - కర్మణా - విశ్వసించి, కర్మలు మాత్రం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తాడు. ‘‘యోగ క్షేమం వహామ్యహం’’.. అట్టివారి యోగక్షేమాలను తానే వహిస్తానని సాక్షాత్తూ ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అభయమిచ్చాడు.

- పి.వి.సీతారామమూర్తి, 9490386015


Updated Date - 2020-09-19T06:59:00+05:30 IST