యూపీలో మండల్ శక్తుల తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-01-23T07:40:37+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంభవిస్తున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీని కలవరపరుస్తున్నాయి..

యూపీలో మండల్ శక్తుల తిరుగుబాటు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంభవిస్తున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీని కలవరపరుస్తున్నాయి. హిందూత్వకు ఒక గట్టి ప్రతిఘటనగా లౌకిక విలువలు, మత బహుళత్వం పునరుత్థానమయ్యేందుకు చరిత్రాత్మక రైతు ఉద్యమం దోహదం చేయగా, సామాజిక న్యాయం ఎజెండాను పునరుద్ధరించాలని ఇతర వెనుబడిన తరగతుల (ఓబీసీ) వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తీరని నష్టం కలిగించనున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


రైతు ఉద్యమం పశ్చిమయూపీలో జాట్‌లు, ముస్లింలను ఏకం చేసింది. ప్రజలను కుల మతాల వారీగా విడదీసే బీజేపీ రాజకీయాలకు అడ్డుకట్ట వేసింది. ముజాఫర్‌నగర్‌లో మతోన్మాద అల్లర్ల నేపథ్యంలో యూపీ ప్రజల్లో మతపరమైన చీలికలను సృష్టించడం ద్వారా 2014 సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ విశేషంగా లబ్ధి పొందింది. హిందూ–-ముస్లిం వైషమ్యాలకు తోడు తీవ్రస్థాయిలో ప్రజ్వరిల్లిన జాతీయవాద మనోభావాలు 2017 అసెంబ్లీ, 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ విజయాలకు తిరుగులేని విధంగా తోడ్పడ్డాయి. ముస్లింలతో తమ సంప్రదాయ రాజకీయ మైత్రిని విడనాడిన జాట్ రైతులు ఆ రెండు ఎన్నికలలో బీజేపీకి మూకుమ్మడిగా ఓటు వేశారు. ఎన్నికల విజయాలతో ఆ పార్టీ తన హిందూత్వ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకువెళ్ళింది. ముస్లింల మత విశ్వాసాలపై దాడి చేసింది. వారి ఆహార, చివరకు వస్త్ర ధారణ అలవాట్లను కూడా తెగనాడింది. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగుచట్టాలు మతాలకు అతీతంగా రైతులందరినీ సమైక్యపరిచాయి. పశ్చిమ యూపీలో రైతుల మధ్య మతాలకు అతీతంగా పునరుజ్జీవమైన సమైక్యత ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో సంపూర్ణంగా ప్రతిబింబించింది. రాకేష్ తికాయిత్ ‘అల్లా హో అక్బర్’ అని ఎలుగెత్తినప్పుడు మహాపంచాయత్‌లో పాల్గొన్న రైతులు అందరూ ముక్తకంఠంతో హర హర మహదేవ్ అంటూ ప్రతిస్పందించారు. లౌకికవాదానికి ప్రధానమైన ఈ మత బహుళత్వం ప్రజలను మతాల వారీగా విడదీసే హిందూత్వ ఎజెండాకు పూర్తిగా విరుద్ధమైనది. ‘విద్వేషమే బీజేపీ రాజకీయాల ప్రమాణ చిహ్నం’ అని రాకేశ్ తికాయత్ వ్యాఖ్యానించాడు. ప్రజల్లో వెల్లివిరిసిన ఈ మత సమైక్యత యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నది. ఈ వాస్తవాన్ని గుర్తించినందునే తాము తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే అప్పటికే చాలా జాప్యం జరిగింది.


రైతు ఉద్యమంతో పాటు సామాజిక న్యాయ ఎజెండా పునరుద్ధరణ కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలి నుంచి వైదొలిగి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు- స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీ-తో సహా పలువురు బీజేపీ శాసనసభ్యులే సామాజిక న్యాయ ఎజెండాను సమగ్రంగా అమలు పరచాలని పట్టుబడుతున్నారు. యోగి ప్రభుత్వం నుంచి వైదొలిగిన ముగ్గురు మంత్రులు తమ తమ సామాజిక వర్గాలలో గణనీయమైన పలుకుబడి ఉన్నవారు. గతంలో బీజేపీ ఎన్నికల విజయాలకు వారు విశేషంగా సహాయపడినవారే. సామాజిక న్యాయం పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నది వారి ఆరోపణ. ‘సామాజిక పునర్నిర్మాణం కంటే సామాజిక న్యాయానికి తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హిందూత్వ లక్ష్యాల సాధనకు అవసరమైన సంఖ్యాధిక్యతలను వెనుకబడిన కులాలు, దళితుల మద్దతుతో సమకూర్చుకోవడమే బీజేపీ పునర్నిర్మాణ కార్యక్రమం. అగ్రకులాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యమని వారు విమర్శించారు.


యోగి ప్రభుత్వం మైనారిటీల శ్రేయస్సును విస్మరించి ఉన్నత కులాల వారినే అన్ని విధాల ప్రోత్సహిస్తుందని స్వామి ప్రసాద్ మౌర్య తదితరులు ధ్వజమెత్తారు. మైనారిటీల పట్ల అన్ని విషయాలలోనూ వివక్ష చూపడం సాధారణమైపోయిందని వారు పేర్కొన్నారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల విషయంలో కూడా యూపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం లేదు. విద్యా ఉద్యోగాలలో ఆ బడుగు వర్గాలకు రిజర్వేషన్లను అర్హులైన అభ్యర్థులు లేరనే సాకుతో అమలుపరచడం లేదు. తమకు న్యాయబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్లు దక్కకపోవడం పట్ల ఆ సామాజిక వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఉద్యోగ నియామకాలలో తమ పట్ల పూర్తి ఉదాసీనత చూపడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న ఉద్యోగాల విషయంలో కూడా తమకు న్యాయం చేయకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత ఠాకూర్ కులస్తులకే అన్నిటా అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం పట్ల మిగతా సామాజిక వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. రాజకీయ, పాలనా రంగాలలో కీలక పదవులు అన్నిటిలోనూ ఠాకూర్లే కనిపిస్తున్నారు. యూపీ సమాజంలో వారి ప్రాబల్యం పెరిగిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గమనార్హమైన విషయమేమిటంటే తమ ఓట్ల ఆధారంగా అధికారానికి వచ్చిన హిందూత్వవాదులు అగ్రకులాలకే అధిక ప్రాధాన్యమిస్తూ తమ శ్రేయస్సును ఉపేక్షిస్తున్నారని ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కేవలం మైనారిటీలనే కాకుండా వెనుకబడిన కులాలు, దళితులను సైతం హిందూత్వ అణచివేస్తుందనే సత్యాన్ని అర్థం చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.


నిరుద్యోగిత అంతకంతకూ పెచ్చరిల్లిపోతోంది. ధరలు భరించలేని విధంగా పెరిగిపోతున్నాయి. ఆహార భద్రత కొరవడుతోంది. ఆరోగ్య సంక్షోభం సరేసరి. ఈ సమస్యలన్నీ ఉత్తరప్రదేశ్ ప్రజలు అందరినీ వేధిస్తున్నాయి. అయితే మరెవ్వరికంటే వెనుకబడినకులాలు, అణగారిన వర్గాల వారే వాటి భారాన్ని ఎక్కువగా చవిచూస్తున్నారు. కొవిడ్–19 రెండో దశ తీవ్రత యూపీ ప్రజలను ఇప్పటికీ భయకంపితులను చేస్తోంది. వైద్య సదుపాయాలు, మందుల కొరతతో కుటుంబసభ్యులు, ఇతర ఆప్తులను కోల్పోవలసిరావడం చాలామందిని అంతులేకుండా బాధిస్తూనే ఉంది. సార్స్ కోవ్–2 రూపాంతరమైన ఒమైక్రాన్ ప్రస్తుతం విజృంభిస్తున్నప్పటికీ ఆ పరిస్థితులలో ఇప్పటికీ మెరుగుదల లేకపోవడం వారిని అమితంగా కలవరపరుస్తోంది. మహమ్మారిని అదుపు చేయడంలో యోగి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయిందనే భావం ప్రజల్లో బలంగా ఉంది.


కులాల వారీగా జనాభా గణన నిర్వహించాలన్న ఓబీసీ నాయకుల డిమాండ్‌ను అటు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమూ, ఇటు లక్నోలోని యోగి సర్కార్ రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించడాన్ని సంబంధిత వర్గాల ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ తిరస్కరణ తమను అవమానించడమేనని వారు ఆగ్రహిస్తున్నారు. వారి ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి తోడు తమ పార్టీ అధికారానికి వస్తే మూడు నెలలలోగా బీసీ జనాభా గణన నిర్వహిస్తామని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఓబీసీలు ఇప్పటికే ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది బీజేపీకి ప్రతికూల పరిస్థితిని సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.


యోగి పాలనలో తమ సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం వల్ల వెనుకబడినకులాల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. బీజేపీ నుంచి వైదొలగి హిందూత్వను వ్యతిరేకించాలని వారు తమ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారు. హిందూత్వ భావజాలమే తమకు అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించిందని ఆ నాయకులూ గ్రహిస్తున్నారు. అందుకు వారు బీజేపీ నుంచి వైదొలుగుతున్నారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల శ్రేయస్సుకు కీలకమైన సామాజిక న్యాయం ఎజెండాను బీజేపీ పూర్తిగా ఉపేక్షిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. 


రైతు ఉద్యమ లౌకిక విలువలు, మత సామరస్యం, ఓబీసీ నాయకుల సామాజిక న్యాయ ఎజెండా బీజేపీకి ఒక ప్రతికూల పరిస్థితిని సృష్టించాయి. ఈ కారణంగా ఎన్నికల రాజకీయాల సంక్ష్లిష్టతలను గతంలో వలే అధిగమించగలగడం హిందూత్వ పార్టీకి అసాధ్యంగా ఉంది. ఇది వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది. హిందూత్వ లక్ష్యాల సాధనకు కీలకమైన ఓబీసీల మద్దతు బీజేపీకి ఏ విధంగాను లభించని పరిస్థితి ఏర్పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు 80 శాతం మందికి, 20 శాతం మందికి మధ్య జరగనున్న పోరాటమని యోగి ఆదిత్యనాథ్ అభిర్ణించారు. ఆ గణాంకాలు రాష్ట్ర జనాభాలోని హిందువులు, ముస్లింల నిష్పత్తిని ప్రతిబింబిస్తున్నాయనేది అందరికీ తెలిసిన వియమే. ఆ వ్యాఖ్య ద్వారా ముస్లింల పట్ల హిందూత్వ దృక్పథమేమిటో మరోసారి విశదమయింది. సామాజిక న్యాయాన్ని కూడా అది వ్యతిరేకిస్తుందనే విషయం కూడా అందరికీ అర్థమయింది.


సామాజిక న్యాయ ఎజెండా పునరుద్ధరణ మండల్ వెర్సెస్ కమండల్ రాజకీయాలను గుర్తు చేస్తుంది. మతతత్వాన్ని సామాజికన్యాయం పదిహేను సంవత్సరాల పాటు అదుపులో ఉంచిన రాజకీయాలవి. కమండల్ ప్రాధాన్యం సంతరించుకున్న తరువాతనే సామాజిక న్యాయశక్తులు బలహీనపడ్డాయి. తద్వారా హిందూత్వ రాజకీయాలు ప్రభవించడానికి దారి సుగమమయింది. క్రింది స్థాయి వర్గాల వారి సమానత్వం, సామాజిక న్యాయ డిమాండ్లను బలహీనపరిచేందుకే బీజేపీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పూనుకున్నది. అందుకే కారిడార్ ప్రాజెక్టునూ ప్రారంభించింది.


యూపీ అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం స్థానాలు మహిళా అభ్యర్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయం హిందూత్వ మహిళా వ్యతిరేక ఎజెండాపై ప్రతికూల ప్రభావం తప్పక చూపుతుంది. లౌకికవాద విలువల పరిరక్షణకు పోరాటం మహిళా హక్కుల కోసం పోరాటమే అన్న అభిప్రాయం పూర్తిగా సహేతుకమైనది. రాజకీయాలలో జెండర్ న్యాయం లౌకికవాదాన్ని కాపాడడంతో పాటు హిందూత్వను తిరస్కరిస్తుంది.


ఉత్తరప్రదేశ్‌లో చాలా సంవత్సరాల తరువాత సామాజికన్యాయం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరూ విస్మరించలేని వాస్తవం. సామాజిక న్యాయ ఆకాంక్షలూ, ఆరాటాలూ బీజేపీని ప్రజాక్షేత్రంలోనూ, ఎన్నికల పోరాటంలోనూ బలహీనపరుస్తాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అంతేకాకుండా అవి జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసి లౌకికవాదశక్తులను ఉత్సాహపరిచి వాటిని ‘భారత్ భావన’ వెనుక సమైక్యపరుస్తాయి. హిందూత్వ శక్తుల పురోగతిని అడ్డుకున్న ప్రతిష్ఠ రైతులు, వెనుకబడిన కులాలు, జెండర్ న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తులకే దక్కుతుంది. 


ఎస్.ఎన్. సాహు

(మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రెస్ సెక్రటరీ)

Updated Date - 2022-01-23T07:40:37+05:30 IST